Begin typing your search above and press return to search.

లిక్కర్ స్కామ్ లో కొత్త కోణం

By:  Tupaki Desk   |   23 Oct 2022 3:33 AM GMT
లిక్కర్ స్కామ్ లో కొత్త కోణం
X
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కొత్తకోణం బయటపడింది. కొద్దిరోజులుగా లిక్కర్ స్కామ్ లో ఇన్వాల్వ్ అయ్యారనే కారణంతో చాలామంది సీబీఐ, ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారించిన విషయం తెలిసిందే. పనిలోపనిగా ముగ్గురిని అరెస్టుకూడా చేసింది. లిక్కర్ స్కామ్ బయటపడింది, జరిగింది ఢిల్లీలోనే అయినా దాని మూలాలు మాత్రం హైదరాబాద్ లోనే ఉన్నట్లు దర్యాప్తు సంస్ధలకు బలమైన ఆధారాలు లభించాయి.

తమకు దొరుకుతున్న ఆధారాల కారణంగా దర్యాప్తుసంస్ధలు విచారణను మరింత లోతుల్లోకి తీసుకెళుతోంది. ఈ నేపధ్యంలోనే మహబూబాబాద్ పట్టణానికి చెందిన ఇద్దరిని దర్యాప్తుసంస్ధలు తాజాగా అదుపులోకి తీసుకున్నాయి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఒకళ్ళిద్దరిని విచారిస్తున్నపుడు మరో నలుగురైదుగురి పేర్లు బయటపడుతున్నాయి. వాళ్ళని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నపుడు మరికొందరి పేర్లను చెబుతున్నారు.

ఈ పద్దతిలో విచారణ చైన్ పద్దతిలో జరుగుతునే ఉంది. ఈ కారణంగానే హైదరాబాద్ లోనే ఇప్పటికి అనేకసార్లు దాడులు చేయాల్సొస్తోంది. తాజాగా అదుపులోకి తీసుకున్న ఇద్దరిని విచారిస్తున్నపుడు హవాలా కోణం బయటపడిందట. ఈ ఇద్దరికి హవాల వ్యాపారం చేసిన నేపధ్యం బయటపడిందట. దాంతో మరింతలోతుగా విచారించినపుడు వీరిద్దరి ద్వారా అనేకమంది ప్రముఖుల ఆర్ధిక లావాదేవీల వ్యవహారం బయటకొచ్చిందట.

కొంతమంది రాజకీయనేతలు తమ ఆర్ధిక లావాదేవీలను వీళ్ళిద్దరి ద్వారా జరిపినట్లు ఆధారాలు బయటపడ్డాయి. వీరిద్దరి బ్యాంకు ఖాతాలను తనిఖీ చేసినపుడు భారీఎత్తున డబ్బు లావాదేవీలు జరిగినట్లు దర్యాప్తు సంస్ధలు గుర్తించాయి. అంటే లిక్కర్ స్కామ్ లో వచ్చిన డబ్బును హవాలా మార్గంలో పెద్దఎత్తున నిధులను అవసరమైన చోటికి తరలించినట్లుగా దర్యాప్తుసంస్ధలు అనుమానిస్తున్నాయి. క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే లిక్కర్ స్కామ్ ఇప్పట్లో ఒక కొలిక్కి వచ్చేట్లుగా కనబడటంలేదు. ఊటబావిలో నుండి తవ్వేకొద్దీ నీరు వచ్చినట్లుగా లిక్కర్ స్కామ్ లోతుల్లోకి వెళ్ళేకొద్దీ కొత్త లింకులు ఎన్నో బయటపడుతున్నాయి. మరి చివరకు ఈ లింకులు ఎక్కడకు వెళ్ళి ఆగుతాయో చూడాల్సిందే.