Begin typing your search above and press return to search.

ఢిల్లీ మద్యం కుంభకోణం.. మాగుంట మధ్యంతర బెయిల్‌ రద్దు!

By:  Tupaki Desk   |   9 Jun 2023 2:48 PM GMT
ఢిల్లీ మద్యం కుంభకోణం.. మాగుంట మధ్యంతర బెయిల్‌ రద్దు!
X
ఢిల్లీ మద్యం కుంభకోణం దేశంలోనే సంచలనాలకు కారణమైన సంగతి తెలిసిందే. మద్యం వ్యాపారులంతా సిండికేటుగా మారడంతోపాటు ప్రభుత్వాన్ని ప్రభావితం చేయడం ద్వారా తమకు అనుకూలంగా మద్యం పాలసీ వచ్చేలా చేశారని.. దీనివల్ల ప్రభుత్వ ఖజానాకు భారీ నష్టం వాటిల్లిలే చేశారని అభియోగాలు నమోదైన సంగతి తెలిసిందే.

ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించి ఇప్పటికే సీబీఐ పలువురిని అరెస్టు చేసింది. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అల్లుడు సోదరుడు శరత్‌ చంద్రారెడ్డిని, ఒంగోలు వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి కుమారుడు రాఘవను, ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్‌ సిసోడియా తదితరులను సీబీఐ అరెస్టు చేసింది. బీఆర్‌ఎస్‌ అధినేత, లె లంగాణ సీఎం కేసీఆర్‌ కుమార్తె కల్వకుంట్ల కవితను పలుమార్లు విచారించింది. శరత్‌ చంద్రారెడ్డికి ఇటీవల బెయిల్‌ మంజూరైన సంగతి తెలిసిందే. అలాగే మాగుంట రాఘవకు కూడా ఢిల్లీ హైకోర్టు ఇటీవల మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది.

ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసులో నిందితుడు మాగుంట రాఘవ మధ్యంతర బెయిల్‌ రద్దు అయ్యింది. ఈ మేరకు రాఘవ మధ్యంతర బెయిల్‌ ను సుప్రీంకోర్టు రద్దు చేసింది. జూన్‌ 12న సరెండర్‌ కావాలని రాఘవను సుప్రీంకోర్టు ఆదేశించింది. అనారోగ్య కారణాలతో మాగుంట రాఘవకు ఢిల్లీ హైకోర్టు రెండు వారాల మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసిన విషయం తెలిసిందే. మాగుంట రాఘవ ఒంగోలు వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి కుమారుడు.

రా«ఘవకు మధ్యంతర బెయిల్‌ ఇస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) సుప్రీంలో సవాల్‌ చేసింది. ఈ పిటిషన్‌పై సుప్రీం కోర్టులో ఈ రోజు విచారణకు రాగా.. రాఘవ మధ్యంతర బెయిల్‌ రద్దు చేస్తూ తీర్పునిచ్చింది.

తన అమ్మమ్మకు అనారోగ్యం కారణంగా రాఘవకు ఢిల్లీ హైకోర్టు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది. దీన్ని సవాల్‌ చేస్తూ ఈడీ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. మధ్యంతర బెయిల్‌ కోసం రాఘవ చూపిన కారణాలు సరైనవి కాదని ఈడీ వాదించింది. కాగా ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో ఫిబ్రవరి 10న రాఘవను ఈడీ అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. సౌత్‌ గ్రూప్‌ లో కీలక పాత్రధారిగా రాఘవను ఈడీ పేర్కొంది. ఢిల్లీలో పలు జోన్లకు రాఘవ ప్రాతినిధ్యం వహిస్తున్నారని ఈడీ అభియోగాలు మోపింది.

ఈ నేపథ్యంలో ఢిల్లీ మద్యం కేసులో నిందితుడిగా ఉన్న మాగుంట రాఘవకు బెయిల్‌ మంజూరుపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఢిల్లీ హైకోర్టు 15 రోజుల మధ్యంతర బెయిల్‌ ఇవ్వడాన్ని ఈడీ సుప్రీంకోర్టులో సవాల్‌ చేసింది. రాఘవ మోసపూరితంగా బెయిల్‌ పొందారని, బెయిల్‌ విషయంలో కోర్టుకు అబద్ధాలు చెప్పారని ఈడీ వాదించింది.

దీని పై విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం.. మాగుంట రాఘవ ఇప్పటికే బెయిల్‌ పై విడుదలైనందున దాని కాలాన్ని ఐదు రోజులకు కుదిస్తున్నామని తెలిపింది. ఈనెల 12న స్థానిక కోర్టు ముందు హాజరుకావాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.