Begin typing your search above and press return to search.

ఢిల్లీ లిక్క‌ర్ స్కాం.. ఏ4గా అభిషేక్‌.. 10వేల పేజీల ఛార్జిషీట్.. ఆప్ జాడ‌లేదే!

By:  Tupaki Desk   |   25 Nov 2022 4:30 PM GMT
ఢిల్లీ లిక్క‌ర్ స్కాం.. ఏ4గా అభిషేక్‌.. 10వేల పేజీల ఛార్జిషీట్.. ఆప్ జాడ‌లేదే!
X
దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన ఢిల్లీ లిక్క‌ర్ కుంభ‌కోణానికి సంబంధించి తాజాగా సీబీఐ అధికారులు ఛార్జిషీటును ప్ర‌త్యేక కోర్టులో దాఖ‌లు చేశాయి. ఏకంగా 10 వేల పేజీల‌తో కూడిన ఈ ఛార్జిషీటులో మొత్తం 9 మంది కీల‌క నిందితులు ఉన్నార‌ని సీబీఐ స్ప‌ష్టం చేసింది. అయితే, ఈ కేసును దాదాపు రెండు నెల‌లుగా విచారిస్తున్న సీబీఐ.. ఈ ఛార్జి షీటులో ఆది నుంచి విమ‌ర్శ‌లు ఎదుర్కొంటున్న ఢిల్లీ ప్ర‌భుత్వానికి సంబంధించిన ఏ ఒక్క‌రి పేరును చేర్చ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.

సీబీఐ దాఖ‌లు చేసిన‌ ఈ చార్జిషీట్లో తొమ్మిది మంది పేర్లను నమోదు చేసింది. ప్ర‌ధానంగా సీబీఐ దాఖ‌లు చేసిన‌ తొలి ఛార్జిషీట్లో అభిషేక్ బోయిన్‌పల్లి, విజయ్ నాయర్‌ సహా ఏడుగురి పేర్లను నమోదు చేశారు. ఛార్జ్‌షీట్‌లో ఏ-1 కుల్దీప్ సింగ్, ఏ-2గా నరేంద్ర సింగ్ పేర్లు ఉండగా... ఛార్జ్‌షీట్‌లో ఏ-3 విజయ్‌నాయర్, ఏ-4 అభిషేక్ బోయిన్‌పల్లిగా చేర్చారు. ఛార్జిషీట్‌లో సమీర్ మహేంద్రు, రామచంద్ర పిళ్లై, ముత్తా గౌతమ్‌ పేర్లు కూడా ఉన్నాయి.

ఛార్జిషీట్‌లో అప్పటి ఆబ్కారీశాఖ డి‌ప్యూటీ కమిషనర్‌ కుల్దీప్‌సింగ్‌, అప్పటి ఆబ్కారీశాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ నరేందర్ సింగ్‌ పేర్లు కూడా నమోదయ్యాయి. మద్యం స్కామ్‌లో సీబీఐ 10 వేల పేజీల ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. సీబీఐ ఛార్జ్‌షీట్‌పై ఈ నెల 30న రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టు నిర్ణయించనుంది. సీబీఐ ఛార్జిషీట్‌ను ఆమోదించాలో లేదో ప్రత్యేక కోర్టు విచారించనుంది. తదుపరి కేసు విచారణ నవంబర్ 30కి రౌస్‌ అవెన్యూ కోర్టు వాయిదా వేసింది.

ఆప్ రియాక్ష‌న్ ఇదే..

సీబీఐ దాఖ‌లు చేసిన తొలి ఛార్జిషీట్‌పై ఆప్ నేత‌లు స్పందించారు. త‌మ‌పై బీజేపీ అనేక ఆరోప‌ణ‌లు చేసింద‌ని, ఏకంగా.. మంత్రి ఇంట్లో త‌నిఖీలు కూడా చేశార‌ని, కానీ, ఆయ‌న పాత్ర‌ను మాత్రం నిరూపించ‌లేక పోయార‌ని విమ‌ర్శ‌లు గుప్పించింది. బీజేపీ ఉద్దేశ పూర్వ‌కంగానే త‌మ‌పై దాడి చేస్తోంద‌ని నాయ‌కులు ఆరోపించారు. బీజేపీ చేస్తున్న ఈ దాడులు.. కేవ‌లం రాజ‌కీయాల కోస‌మేన‌ని, ఢిల్లీలో రాజ‌కీయం చేసి, గుజ‌రాత్‌లో గెలుపొందాల‌నే కుట్ర ఉంద‌ని దుయ్య‌బ‌ట్టారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.