Begin typing your search above and press return to search.

'బ్లాక్ ఫంగస్' డ్రగ్ కొరతపై ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు !

By:  Tupaki Desk   |   29 May 2021 12:30 PM GMT
బ్లాక్ ఫంగస్ డ్రగ్ కొరతపై ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు !
X
దేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. అలాగే మరోవైపు బ్లాక్ ఫంగస్‌ ముప్పు వెంటాడుతోంది. రోజుకో కొత్తరకమైన ఫంగస్ బయటకి వస్తుంది. బ్లాక్ ఫంగస్ చికిత్సకు వినియోగించే ఔషధాల కొరత వేధిస్తోంది. దీనిపై ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు కాగా విచారణ సందర్భంగా న్యాయస్థానం సంచలన వ్యాఖ్యలు చేసింది. మనం నరకంలో జీవిస్తున్నాం.. ప్రతి ఒక్కళ్లూ నరకం అనుభవిస్తున్నారు. ఇటువంటి సమయంలో సహాయం చేయాల్సిన పరిస్థితి కానీ, నిస్సాహాయులుగా ఉండిపోతున్నాం అని కోర్టు తెలిపింది. బ్లాక్ ఫంగస్ చికిత్సకు ఔషధాల కొరత, బాధితులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రస్తావిస్తూ దాఖలైన రెండు వ్యాజ్యాలపై ఢిల్లీ హైకోర్టు శుక్రవారం విచారణ చేపట్టింది.

ఈ సందర్భంగా యాంటీ ఫంగల్ ఔషధాల కొరతను అధిగమించడానికి తీసుకున్న చర్యలను తెలియజేస్తూ కేంద్రం ఒక నివేదికను అందజేసింది. దిగుమతులు, స్టాక్‌ కు సంబంధించిన పూర్తి వివరాలను అందజేయాలని హైకోర్టు ఆదేశించింది. ఈ పరిస్థితిపై నిస్సహాయతను వ్యక్తం చేసిన న్యాయస్థానం.. ఒక నిర్దిష్ట రోగికి చికిత్సకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించలేమని , ఫంగస్ వ్యాధులకు చికిత్సలో వాడే 2.30లక్షల వయల్స్ అంఫోటెరిసిన్‌- బి ఔషధాలను ఆరు దేశాల నుంచి దిగుమతికి చర్యలు చేపట్టినట్టు కేంద్రం తెలియజేయగా.. ఈ సంఖ్యను ఎంచుకోవడానికి వెనుక గల కారణాన్ని వివరించాలని హైకోర్టు స్పష్టం చేసింది. దీనికి సంబంధించిన నివేదికను సోమవారం నాటికి అందజేయాలని జస్టిస్ విపిన్ సంఘీ, జస్టిస్ జస్మీత్ సింగ్‌ల ధర్మాసనం వెల్లడించింది. కరోనా కు సంబంధించిన వివిధ అంశాలపై శుక్రవారం ఆరు గంటల పాటు ధర్మాసనం విచారించింది. విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న ఔషధాలు, దేశాల వివరాలు, ప్రస్తుత అవి ఏ దశలో ఉన్నాయి, ఎప్పుడు దేశానికి చేరుకుంటాయనేది తెలియజేయాలని కోర్టు ఆదేశించింది.