Begin typing your search above and press return to search.

ఇష్టమైన వారితో జీవించడం మేజర్ హక్కు : ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు

By:  Tupaki Desk   |   26 Nov 2020 8:10 AM GMT
ఇష్టమైన వారితో జీవించడం మేజర్ హక్కు : ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు
X
మేజర్ అయిన మహిళ తాను కోరుకున్న వాడితో ఎక్కడైనా జీవితం గడిపే స్వేచ్ఛ ఉందని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. 20 ఏళ్ల యువతి తన భర్తతో జీవించడానికి అనుమతిస్తూ జస్టిస్ విపిన్ సంఘీ - జస్టిస్ రజినీశ్ భట్నాగర్‌ ల ధర్మాసనం బుధవారం కీలక తీర్పు వెల్లడించింది. లవ్ జిహాద్‌ కు వ్యతిరేకంగా బీజేపీ పాలిత రాష్ట్రాలు చట్టాలను తీసుకురావడంతో, తనకి నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకునే అంశంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న సమయంలో ఢిల్లీ హైకోర్టు ఈ సంచలన తీర్పుని వెల్లడించడం విశేషం.

ఈ ఘటన పై పూర్తి వివరాల్లోకి వెళ్తే ... వివాహాల్లో హిందూ - ముస్లిం అనే తేడాలను కోర్టు చూడదని - వారు మేజర్ లా కాదా అనేది మాత్రమే పరిగణన లోకి తీసుకుంటుందని ఇటీవల యూపీకి చెందిన సలామత్ - అలియా కేసులో అలహాబాద్‌‌‌‌‌‌‌‌ హైకోర్టు తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. మేజర్లకు తమ జీవితభాగస్వాములను ఎంపిక‌‌‌‌‌ చేసుకునే హక్కు ఉంటుందని - వారి స్వేచ్ఛను హరించే హక్కు ఏ ప్రభుత్వానికీ లేదని హైకోర్టు తెలిపింది. తాజాగా సులేఖా కేసులోనూ ఢిల్లీ హైకోర్టు అటువంటి తీర్పునే వెలువరించింది. ఆమె మేజర్ అని - ఇష్టపూర్వకంగానే ఇంటి నుంచి వెళ్లిపోయిందని వెల్లడించింది.

సులేఖ తన భర్త బబ్లూతో కలిసి ఉండటానికి కోర్టు అనుమతించింది. మైనర్ అయిన తమ కుమార్తెను కిడ్నాప్ చేసి, ఆమె కుటుంబం చేసిన ఆరోపణలను తోసిపుచ్చింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సులేఖను విచారించిన ధర్మాసనం.. ఆమె మేజర్ అని గుర్తించింది. తన ఇష్టపూర్వకంగానే ఇంటి నుంచి వెళ్లిపోయినట్టు చెప్పడంతో బబ్లూ నివాసం వద్ద భద్రత కల్పించాలని పోలీసులను న్యాయస్థానం ఆదేశించింది. పిటిషనర్ - సులేఖ తల్లిదండ్రులకు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవద్దని లేదా జంటను బెదిరించవద్దని సలహా ఇవ్వాలని పోలీసులకు సూచించింది. సులేఖ సోదరి హెబియస్ కార్పస్ రిట్ దాఖలు చేయడంతో అత్యవసర విచారణ చేపట్టిన ఢిల్లీ హైకోర్టు ఈమేరకు తీర్పు చెప్పింది. ప్రస్తుత నివేదిక ప్రకారం.. 2000 సంవత్సరంలో జన్మించిన సులేఖ.. ఇంటి నుంచి వెళ్లిపోయే నాటికి మేజర్.. తన ఇష్టపూర్వకంగానే బబ్లూ వెంట వెళ్లి వివాహం చేసుకుంది అని తెలిపింది. ఈ ఏడాది సెప్టెంబరు 12న సులేఖ ఇంటి నుంచి వెళ్లిపోవడంతో బబ్లూ కిడ్నాప్ చేసుంటాడని ఆమె కుటుంబం అనుమానం వ్యక్తం చేసారు.