Begin typing your search above and press return to search.

అనుమ‌తి లేకుండా తాకితే ఎంత పెద్ద శిక్ష అంటే?

By:  Tupaki Desk   |   22 Jan 2018 5:03 AM GMT
అనుమ‌తి లేకుండా తాకితే ఎంత పెద్ద శిక్ష అంటే?
X
ఢిల్లీ అద‌న‌పు సెష‌న్స్ కోర్టు ఆస‌క్తిక‌ర తీర్పును ఇచ్చింది. ఆడ‌వారిని అనుమ‌తి లేకుండా తాకితే ఎంత పెద్ద నేర‌మ‌న్న విష‌యాన్ని చెప్ప‌ట‌మే కాదు.. అందుకు ఎంత భారీ శిక్ష అనుభ‌వించాలో ఉంటుంద‌న్న‌ది తాజా తీర్పుతో స్ప‌ష్టం చేశారు. వ‌య‌సును చూసుకోకుండా ప‌సి పిల్ల‌లు మొద‌లు పండు ముస‌లి వారిపైనా ఇటీవ‌ల కాలంలో జ‌రుగుతున్న లైంగిక దాడులు.. వేధింపుల న‌డుమ తాజా తీర్పు సంచ‌ల‌నంగా మారింది.

దాదాపు మూడేళ్ల క్రితం జ‌రిగిన ఒక నేరంపై తీర్పునిచ్చిన న్యాయ‌మూర్తి.. అనుమ‌తి లేకుండా తాకిన ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న నిందితుడికి ఐదేళ్ల జైలుశిక్ష‌ను విధిస్తూ తీర్పు వెల్ల‌డించారు. పోకిరీలు.. లైంగిక విప‌రీత బుద్ధులు ఉన్న వారి కార‌ణంగా అన్ని వ‌య‌స్సుల మ‌హిళ‌లు బాధితులుగా మార‌ట‌మే కాదు.. తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న‌ట్లుగా ఢిల్లీ అద‌న‌పు సెష‌న్స్ న్యాయ‌మూర్తి సీమా మైని వ్యాఖ్యానించారు. వ‌య‌సుతో సంబంధం లేకుండా అన్ని వ‌య‌స్కుల మ‌హిళ‌లు ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నార‌న్నారు.

2014లో యూపీకి చెందిన ఛావిరామ్ అనే వ్య‌క్తి ర‌ద్దీగా ఉన్న ఉత్త‌ర ఢిల్లీలోని మార్కెట్లో తొమ్మిదేళ్ల బాలిక‌ను అభ్యంత‌ర‌క‌రంగా తాకిన‌ట్లుగా ఆరోప‌ణ‌లు ఎదుర్కొన్నాడు. అయితే.. తాను ఆ పాడు ప‌ని చేయ‌లేద‌ని.. ఆ ప‌ని చేసి వ్య‌క్తి పారిపోయాడ‌ని.. స‌ద‌రు బాలిక త‌న‌ను వేలెత్తి చూప‌టంతో త‌న‌ను నిందితుడిగా మార్చార‌ని ఛావిరామ్ వాదించాడు.

అయితే.. అత‌డి వాద‌న‌ను అంగీక‌రించ‌ని కోర్టు ఛావిరామ్‌ ను దోషిగా నిర్ధారించింది. తొమ్మిదేళ్ల బాలిక‌ను అభ్యంత‌ర‌క‌రంగా తాకినందుకు ఐదేళ్ల క‌ఠిన కారాగారా శిక్ష‌ను విధించ‌టంతో పాటు రూ.10వేలు జ‌రిమానాను చెల్లించాల‌ని పేర్కొంది.

ఈ తీర్పు సంద‌ర్భంగా న్యాయ‌మూర్తి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఆడ‌వారి దేహం వారి సొంత‌మ‌ని.. దానిపై పూర్తి హ‌క్కులు వారికే ఉన్నాయ‌న్నారు. ఆమె అనుమ‌తి లేకుండా మ‌రెవ‌రూ ఆమె దేహాన్ని తాక‌కూడ‌ద‌ని.. అది ఏ అవ‌స‌ర‌మైనా? అని స్ప‌ష్టం చేశారు. మ‌హిళ‌ల వ్య‌క్తిగత హ‌క్కును కాల‌రాస్తూ వారిపై దాడికి పాల్ప‌డ‌టం ద్వారా లైంగిక సంతృప్తి పొందాల‌నుకోవ‌టం త‌ప్పుగా తేల్చారు.

మ‌రో కేసులో లైంగిక దాడికి పాల్ప‌డిన కేసులో మూడేళ్ల జైలుశిక్ష‌ను విధించారు ఢిల్లీ అద‌న‌పు సెష‌న్స్ న్యాయ‌మూర్తి సురేష్ కుమార్ గుప్తా. త‌న‌పై జారీ చేసిన తీర్పును కొట్టివేయాల‌ని కోరుతూ 20 ఏళ్ల యువ‌కుడి విన‌తిని న్యాయ‌మూర్తి తిర‌స్క‌రించారు. త‌న కుటుంబానికి తానే జీవ‌నాధార‌మ‌ని చెప్పిన నిందితుడి వాద‌న‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకోని కోర్టు.. ఇలాంటి విష‌యాల్లో జాలి చూపించే ప్ర‌స‌క్తే లేద‌ని తేల్చి చెప్పింది. ఏమైనా.. మ‌హిళ‌ల‌పై లైంగిక వేధింపుల‌కు గురి చేసే వారి విష‌యంలో కోర్టు క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించ‌టంపై ప‌లువురు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు.