Begin typing your search above and press return to search.

సన్ 'రైజింగ్' మొదలు..ఢిల్లీపై గెలుపు బాట

By:  Tupaki Desk   |   30 Sep 2020 4:15 AM GMT
సన్ రైజింగ్ మొదలు..ఢిల్లీపై గెలుపు బాట
X
వరుసగా రెండు మ్యాచ్ లలో ఓడి డీలా పడ్డ సన్ రైజర్స్ హైదరాబాద్ ఎట్టకేలకు గెలుపు బోణీ కొట్టింది. లో స్కోర్ సాధించినా అద్భుతమైన బౌలింగ్ తో చెలరేగి 15 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. మాంచి ఫామ్ లో ఢిల్లీ బ్యాట్స్ మెన్ ని కట్టడి చేసింది. రషీద్‌ ఖాన్‌ (3/14) తన లెగ్‌స్పిన్‌తో ముప్పుతిప్పలు పెడుతూ శ్రేయాస్‌, ధవన్‌, పంత్‌ వికెట్లు తీశాడు. ముందుగా బ్యాటింగ్‌ కు చేసిన సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ 20 ఓవర్లలో 4 వికెట్లకు 162 పరుగులు చేసింది. బెయిర్‌ స్టో (48 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌తో 53), వార్నర్‌ (33 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 45), విలియమ్సన్‌ (26 బంతుల్లో 5 ఫోర్లతో 41) రాణించారు. రబాడ, మిశ్రాలకు చెరో రెండు వికెట్లు దక్కాయి. ఆ తర్వాత ఛేదన లో ఢిల్లీ జట్టు హైదరాబాద్ బౌలర్లు కట్టు దిట్టంగా బౌలింగ్ చేయడంతో 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 147 పరుగులు చేసి ఓడింది. ధవన్‌ (34), పంత్‌ (28) మాత్రమే ఆకట్టుకున్నారు. మూడు ప్రధాన వికెట్లు తీసిన రషీద్ ఖాన్ మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ గా నిలిచాడు.

బౌలర్ల మ్యాచ్ ఇది

ఐపీఎల్లో వరుసగా 200 పరుగులు చేసినా ఇతర జట్లు ఛేదిస్తున్నాయి. అలాంటిది సన్ రైజర్స్ బౌలర్లు చెలరేగి మ్యాచ్ ను కాపాడు కున్నారు. రషీద్ ఖాన్ మూడు వికెట్లు తీయగా భువనేశ్వర్ రెండు వికెట్లు తీశాడు.

ఆకట్టుకున్న విలియమ్సన్‌

హైదరాబాద్ ఆడిన తొలి రెండు మ్యాచ్ లలో విలియమ్సన్‌ కి ఛాన్స్ ఇవ్వలేదు. అందుకే బ్యాటింగ్ లో కాస్త వీక్ గానే కనిపించింది. విలియమ్సన్‌ ఈ సీజన్ లో ఆడిన తొలి మ్యాచ్ లోనే 26 బంతుల్లో 41 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. బెయిర్‌స్టోతో కలిసి మూడో వికెట్‌కు 52 పరుగులు జత చేశాడు.

మ్యాచ్ హైలైట్స్

* తొలి ఐపీఎల్‌ మ్యాచ్‌ ఆడిన టీనేజర్‌ అబ్దుల్‌ మసద్‌ 4,6తో 19వ ఓవర్‌లో 13 పరుగులు వచ్చాయి.

* చివరి ఓవర్‌లో రబాడ కేవలం నాలుగు పరుగులే ఇచ్చి విలియమ్సన్‌ను అవుట్‌ చేశాడు.

* చాన్నాళ్ల తర్వాత టీమిండియా మాజీ ఓపెనర్ ధావన్ కాస్త ఆత్మవిశ్వాసంతో కనిపించాడు.34 పరుగులతో జట్టులో అత్యధిక పరుగులు చేశాడు.

* హైదరాబాద్ కెప్టెన్ వరుసగా ఈ మ్యాచ్ లో కూడా రాణించాడు. మెరుపు బ్యాటింగ్ తో 45(33 బంతుల్లో ) పరుగులు చేశాడు. బెయిర్ స్టో అర్ధ సెంచరీతో మెరిశాడు.