Begin typing your search above and press return to search.

అగ్ర రాజ్యంలో టి20 లీగ్.. సత్య నాదెళ్ల జట్టుకు ఢిల్లీ క్యాపిటల్స్ సాయం

By:  Tupaki Desk   |   18 March 2023 6:00 AM GMT
అగ్ర రాజ్యంలో టి20 లీగ్.. సత్య నాదెళ్ల జట్టుకు ఢిల్లీ క్యాపిటల్స్ సాయం
X
ఆస్రేలియాలో ఓ లీగ్.. పాకిస్థాన్ లో ఓ లీగ్.. భారత్ లో మరో లీగ్.. బంగ్లాదేశ్ లో ఇంకో లీగ్.. దక్షిణాఫ్రికాలోనూ మరో లీగ్.. కరీబియన్ దీవుల్లో ఇంకో లీగ్.. శ్రీలంకలోనూ లీగే.. ఇదీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న టి20 క్రికెట్ లీగ్ ల కథ. అన్నీ కలిపితే ఓ పదైనా ఉంటాయేమో.. వీటిలో చాలా దేశాల్లో ఆర్థిక పరిస్థితులు ఆశాజనకంగా లేవు. ఉదాహరణకు పాకిస్థాన్, లంక, బంగ్లాదేశ్. కానీ క్రికెట్ ఆదరణకు మాత్రం కొదవలేదు. అందుకే అక్కడ లీగ్ లు విజయవంతం అవుతున్నాయి. మరి ఆటకు ఆట.. డబ్బుకు డబ్బు.. అన్నీ ఉన్న అమెరికాలో లీగ్ ఎందుకు లేదు..? పొరుగునే ఉన్న కరీబియన్ దీవుల్లో.

క్రికెట్ ఎప్పుడో శిఖరాగ్రానికి వెళ్తే అమెరికాకు ఏమైంది?

బాస్కెట్ బాల్ కాదు క్రికెట్ బాల్ అగ్రరాజ్యమైన అమెరికాలో బాస్కెట్ బాల్ కు అమిత ఆదరణ. అధిక సమయం పట్టడమో ఏమో కాని.. క్రికెట్ కు ప్రాచుర్యం లభించలేదు. టెస్టులు, వన్డేల హయాంలో అమెరికా క్రికెట్ కు దూరంగానే ఉంది. కానీ, టి20ల కాలం వచ్చాక క్రమంగా దగ్గరవుతోంది. ఇందులో భాగంగానే వెస్టిండీస్-భారత్ మధ్య మ్యాచ్ లకు ఆతిథ్యం ఇస్తోంది. ఇక అమెరికా సొంత జట్టును తయారు చేసుకుని అంతర్జాతీయంగా ఎదిగే ప్రయత్నాల్లోనూ ఉంది. అటు మహిళల క్రికెట్ లోనూ ఉనికి చాటుతోంది. మనవారే ఎక్కువ. సహజంగా క్రికెట్ అంటే చెవి కోసుకుంటారు భారత ఉపఖండ ప్రజలు. ఇక అమెరికా క్రికెట్ లోనూ మన వారిదే ఆధిపత్యం. కొందరు పాకిస్థానీలు సహా 80-90 శాతం భారత సంతతి వారే అమెరికా జట్లలో ఉంటున్నారు. ఇటీవల అమెరికా అండర్19 జట్టు అయితే అంతా భారతీయులే అన్నట్లుగా కనిపించింది. అంతెందుకు.. భారత అండర్ 19 జట్టు కెప్టెన్ గా టైటిల్ సాధించిన ఢిల్లీ బ్యాట్స్ మన్ ఉన్ముక్త్ చంద్ అమెరికా వెళ్లిపోయి అక్కడ క్రికెట్ ఆడుతున్నాడు.

అగ్రరాజ్యంలో ఢిల్లీ జట్టు. అమెరికాలోనూ క్రికెట్‌ను విస్తరించడానికి తమవంతు సహకారం అందించనుంది ఇండియన్ ప్రీమియర్ లీగ్ జట్టు దిల్లీ క్యాపిటల్స్. దీనిలో భాగంగా మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల భాగస్వామిగా ఉన్న ఫ్రాంచైజీతో జట్టు కట్టింది. ప్రపంచవ్యాప్తంగా క్రికెట్‌ విస్తరణ కోసం భారీస్థాయిలో లీగ్‌లు జరుగుతున్నాయి. ఐపీఎల్‌, బిగ్‌బాష్ లీగ్‌, అబుదాబి టీ10 లీగ్‌, దక్షిణాఫ్రికా లీగ్‌.. ఇలా సందడి నెలకొంది. తాజాగా అమెరికాలోనూ క్రికెట్‌ ఖ్యాతిని పెంచేందుకు కొత్తగా టీ20 ఫ్రాంచైజీ లీగ్‌ క్రికెట్ సిద్ధమవుతోంది. మేజర్ లీగ్‌ క్రికెట్ (MLC) పేరిట ఈ ఏడాది జులైలో ప్రారంభించేందుకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఈ క్రమంలో దిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ కీలక నిర్ణయం తీసుకుంది. మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్య నాదెళ్లతో జట్టు కడుతున్నట్లు ప్రకటించింది. టెక్ దిగ్గజం సత్య నాదెళ్లకు భాగస్వామ్యం ఉన్న సియాటెల్‌ ఫ్రాంచైజీతో దిల్లీ క్యాపిటల్స్‌ కలిసి పనిచేయనుంది. 'సీయాటెల్‌ ఆర్కాస్‌' పేరుతో ఎంఎల్‌సీలో ఆడనుంది. "దిల్లీ క్యాపిటల్స్ సహ యజమాని జీఎంఆర్‌ గ్రూప్‌ త్వరలోనే సీయాటెల్ ఆర్కాస్‌తో జట్టు కట్టనుంది. ప్రపంచ స్థాయి క్రికెట్‌ జట్టును తయారు చేసేందుక అవసరమైన సహకారం అందించనుంది" అని MLC ఓ ప్రకటనలో పేర్కొంది. మేజర్‌ లీగ్‌ క్రికెట్‌ టోర్నీలో ముంబయి ఇండియన్స్‌, చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ ఫ్రాంచైజీలకు కూడా భాగస్వామ్యాలు ఉన్నాయి.

కలిసొచ్చిన సుదీర్ఘ అనుభవం "దిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీకి ఐపీఎల్‌లో సుదీర్ఘ అనుభవం ఉంది. ఆరుసార్లు ప్లేఆఫ్స్‌ చేరుకొంది. 2021 సీజన్‌లో పాయింట్ల పట్టికలో అగ్రస్థానం సాధించింది. పసిఫిక్ నార్త్‌ వెస్ట్‌ ప్రాంతంలో క్రికెట్‌ను విస్తరించడానికి ఉత్సాహంగా ఉన్నాం. మా జట్టుకు ఆర్కాస్‌ పేరు పెట్టడం వెనుక కారణం ఉంది. స్థానిక కమ్యూనిటీని ప్రతిబింబించేలా పెట్టడం జరిగింది. క్రీడా స్ఫూర్తి చాటేందుకు సహాయ పడుతుంది " అని ఆర్కాస్‌ ఇన్వెస్టర్ గ్రూప్ తెలిపింది. ఈ గ్రూప్‌లో సత్య నాదెళ్లతోపాటు మడ్రోనా వెంచర్స్ ఎండీ సోమ సోమసెగర్, ఐసెర్టిస్ సీఈవో సమీర్ బోడాస్, గ్రేట్ పాయింట్‌ వెంచర్స్ మేనేజింగ్‌ పార్టనర్ అశోక్ కృష్ణమూర్తి, మైక్రోసాఫ్ట్ మాజీ సీనియర్ ఎగ్జిక్యూటివ్‌ సంజయ్‌ పార్థసారథి ఉన్నారు. ఆర్కాస్‌తో జట్టుకట్టడంపై దిల్లీ క్యాపిటల్స్ సహ యజమాని కిరణ్‌ కుమార్‌ గ్రంథి ఆనందం వ్యక్తం చేశారు. "అంతర్జాతీయంగా క్రికెట్‌ వృద్ధి చెందడానికి పుష్కలమైన అవకాశాలు కలిగిన దేశాల్లో అమెరికా ఒకటని మా భావన. సీటల్‌ ఆర్కాస్‌తో కలిసి పని చేయడం వల్ల మెరుగైన ఫలితాలను సాధిస్తామనే నమ్మకం ఉంది" అని తెలిపారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.