Begin typing your search above and press return to search.

కేజ్రీవాల్‌ కు అమిత్ షా బ‌హిరంగ స‌వాల్!

By:  Tupaki Desk   |   1 Feb 2020 6:16 AM GMT
కేజ్రీవాల్‌ కు అమిత్ షా బ‌హిరంగ స‌వాల్!
X
మ‌రి కొద్ది రోజుల్లో జ‌ర‌గ‌నున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో దేశ రాజ‌ధానిలో రాజ‌కీయ వేడి రాజుకుంది. ప్ర‌ధాన పోటీదారులైన బీజేపీ, ఆప్ నేతల మధ్య మాట‌ల యుద్ధం తార‌స్థాయికి చేరింది. మ‌రోసారి అధికారాన్ని చేజిక్కించుకోవాల‌ని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ...ఈ సారి ఎలాగైనా ఢిల్లీ గ‌ద్దెనెక్కాల‌ని బీజేపీ హోరాహోరీగా ప్ర‌చారం చేస్తున్నాయి. ప్ర‌ధాని మోడీ, హోం మంత్రి అమిత్ షాల‌కు కొర‌క‌రాని కొయ్య‌గా మారిన `క్రేజీ` కేజ్రీవాల్‌కు అడ్డుక‌ట్ట వేసేందుకు బీజేపీ అధిష్టానం వ్యూహాలు ర‌చిస్తోంది. ఈ క్ర‌మంలోనే కేజ్రీవాల్‌ కు అమిత్ షా బ‌హిరంగ స‌వాల్ విసిరారు. యమునా నది శుభ్రంగా ఉందంటూ కేజ్రీ చేసిన వ్యాఖ్య‌ల‌కు అమిత్ షా కౌంట‌ర్ ఇచ్చారు. కేజ్రీవాల్ ఉత్త‌ మాటలు క‌ట్టిపెట్టి య‌మునా న‌దిలో ఓసారి మున‌కేస్తే న‌ది శుభ్రంగా ఉంద‌ని తాము నమ్ముతామని సవాల్ విసిరారు.

అబ‌ద్దాలు చెప్ప‌డంలో కేజ్రీవాల్ దిట్ట‌ని షా ఎద్దేవా చేశారు. యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లోని గంగానదిలో కేజ్రీవాల్ ఓ సారి సుబ్బ‌రంగా స్నానం చేసి రావాల‌ని కూడా షా స‌ల‌హా ఇచ్చారు. త‌న ఛాలెంజ్‌ను కేజ్రీవాల్ స్వీక‌రిస్తే నదులను ఎలా శుభ్రంగా ఉంచుకోవాలో ఇట్టే తెలిసిపోతుంద‌ని చ‌మ‌త్క‌రించారు. ప్రధాని మోడీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌లు గంగా నదిని స్వ‌చ్ఛంగా మార్చేందుకు ఎంతో కృషి చేశారని షా గుర్తు చేశారు.ఏడాదికి రూ. 178 కోట్ల లాభాలతో నడిచిన ఢిల్లీ జల్ బోర్డు....కేజ్రీ పాల‌న‌ లో ఏడాదికి రూ. 800 కోట్ల నష్టాన్ని చవి చూస్తోందని షా ధ్వ‌జ‌మెత్తారు. ఢిల్లీలో వెయ్యి కొత్త పాఠశాలలు, 50 కొత్త కాలేజీలు, 15 లక్షల సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేస్తామన్న హామీల‌ను కేజ్రీ నెర‌వేర్చ‌లేద‌ని చుర‌ల‌క‌లంటించారు. ఇప్పటి వరకు ఏర్పాటు చేసిన 1.50 లక్షల సీసీటీవీ కెమెరాల లో 1.25 లక్షల కెమెరాలకు కేంద్ర నిధులే వాడార‌ని ఎద్దేవా చేశారు.