Begin typing your search above and press return to search.

దేశంలో క్రిస్టియన్ల ఆగ్రహం..కోపం బీజేపీపైనేనా?

By:  Tupaki Desk   |   22 May 2018 6:04 AM GMT
దేశంలో క్రిస్టియన్ల ఆగ్రహం..కోపం బీజేపీపైనేనా?
X
ఢిల్లీ ఆర్చ్ బిషప్ అనిల్ జోసెఫ్ థామస్ కౌటో క్రిస్టియన్ కమ్యూనిటీలకు రాసిన లేఖ కలకలం రేపుతోంది. ప్రతి శుక్రవారం చర్చిల్లో దేశంలో 2019లో కొత్త గవర్నమెంట్ రావాలని ప్రార్థించాలని ఆయన లేఖలో కోరారు. ప్రజాస్వామిక విలువలను పాటించే ప్రభుత్వం రావాలని అందరూ కోరుకోవాలని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం దేశంలో అల్లకల్లోల వాతావరణం ఉందని.. దేశంలో భారత రాజ్యాంగం నిర్ధేశించిన ప్రజాస్వామ్య సూత్రాలు పాటించడం లేదని.. అందుకే కొత్త గవర్నమెంట్ దేశంలో రావాలని ప్రార్ధించాలని సూచించారు.

అనిల్ జోసెఫ్ తన లేఖలో దేశంలోని పరిస్థితులపై ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో లౌకిక వ్యవస్థకు ముప్పు వాటిల్లుతోందని.. మనం 2019లో కొత్త ప్రభుత్వాన్ని కోరుకుందామని.. మే 13, 2018 నుంచి ప్రార్ధనలు ప్రారంభిద్దామని.. అంతేకాదు.. మెరుగైన ప్రభుత్వం కోసం ప్రతి శుక్రవారం ఉపవాసం కూడా ఉండాలని.. ఇది మన జాతికి మేలు చేస్తుందని’ కోరారు.

ఢిల్లీ బిషప్ రాసిన లేఖ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ప్రధాని మోడీ అనుసరిస్తున్న పద్ధతులే క్రిస్టియన్ల కోపానికి కారణమై ఉండొచ్చని ప్రతిపక్ష కాంగ్రెస్ నాయకులు విమర్శిస్తున్నారు. దేశంలో మైనార్టీలకు జరుగుతున్న అన్యాయంపై తాము చాలా రోజులుగా గళమెత్తామని.. కానీ ఇప్పుడు క్రిస్టియన్ల బిషప్ లేఖ చూశాక దేశంలోని మైనార్టీల్లో గూడు కట్టుకున్న వ్యతిరేకత బహిర్గతమైందని కాంగ్రెస్ అంటోంది. మొత్తానికి క్రిష్టియన్ బిషప్ రాసిన లేఖ మోడీ సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వాన్ని వేలెత్తి చూపుతోందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి..