Begin typing your search above and press return to search.

కరోనా వేళ ఈ ఢిల్లీ జంట చేసే పని తెలిస్తే.. చేతులెత్తి మొక్కుతారు

By:  Tupaki Desk   |   16 May 2021 8:30 AM GMT
కరోనా వేళ ఈ ఢిల్లీ జంట చేసే పని తెలిస్తే.. చేతులెత్తి మొక్కుతారు
X
బంధాల్ని.. అనుబంధాల్ని ప్రశ్నలుగా మార్చిన పాడు కరోనాతో కలలో కూడా ఊహించనవెన్నో జరుగుతున్నాయి. ప్రాణ భయంతో సొంతోళ్లను సైతం గాలికి వదిలేస్తున్న వారెందరో. ఇలాంటివేళ.. తమకే మాత్రం సంబంధం లేకున్నా.. ఆపదలో ఉన్న వారికి సాయం చేసేందుకు ఢిల్లీకి చెందిన ఒక జంట చేస్తున్న ప్రయత్నం గురించి తెలిస్తే.. అప్రయత్నంగా చేతులెత్తి మొక్కేస్తారంతే. కొవిడ్ తో మరణించిన వారి అంతిమ సంస్కారాల గురించి పట్టించుకునే నాథుడే లేని వేళలో.. అందుకు భిన్నంగా ఢిల్లీకి చెందిన హిమాన్షు.. ట్వింకిల్ దంపతులు పెద్ద మనసుతో వ్యవహరిస్తున్న తీరు గురించి తెలిస్తే.. అభినందించకుండా ఉండలేం.

ఢిల్లీకి చెందిన 42 ఏళ్ల హిమాన్షు.. 39 ఏళ్ల ట్వింకిల్ భార్యభర్తలు. కొవిడ్ కారణంగా మరణించిన వారిని గౌరవప్రదంగా అంతిమ సంస్కారాలు జరిపేందుకు వీరు చేసే ప్రయత్నాలు అన్ని ఇన్ని కావు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అంతిమసంస్కారాల కోసం వేలాది రూపాయిలు వసూళ్లకు పాల్పడే వారికి భిన్నంగా.. ఒక్క పైసా కూడా తీసుకోకుండా అంతిమసంస్కారాల కోసం అంబులెన్సు సాయం చేస్తున్నారు. ఈ దంపతులకు 12 అంబులెన్సులు ఉన్నాయి.

తమ వద్ద పని చేసే సిబ్బంది పాటు.. ఈ ఇద్దరు దంపతులు కూడా వాహనాన్ని నడుపుతుంటారు. కొవిడ్ వైద్యం కోసం తీసుకెళుతూ మార్గమధ్యంలో మరణిస్తే.. అలాంటి వారి సమాచారాన్ని తెలుసుకొని తమ వాహనాల్లో వారిని శశ్మానాలకు చేరుస్తున్నారు. ఇందుకు వారు ఒక్క పైసా వసూలు చేయటం లేదు. ఢిల్లీతో పాటు.. చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ అంబులెన్సు సేవల్ని అందించేందుకు వారు సిద్దంగా ఉంటున్నారు. రోజుకు తక్కువలో తక్కువ పాతిక మంది రోగుల వరకు అంబులెన్సు సేవల్ని ఉచితంగా అందిస్తున్న ఈ జంట చేసే సేవ ఎంత చెప్పినా తక్కువే అవుతుంది.