Begin typing your search above and press return to search.

ఈసారి గూగుల్ వంతు.. ప్లే స్టోర్ నుంచి ‘ట్రంప్’ డిలీట్

By:  Tupaki Desk   |   19 Feb 2021 5:54 AM GMT
ఈసారి గూగుల్ వంతు.. ప్లే స్టోర్ నుంచి ‘ట్రంప్’ డిలీట్
X
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటమిపాలు అయ్యాక.. చేజారే పగ్గాల్ని పట్టుకునేందుకు ఆయన చేసిన ప్రయత్నాలు అన్ని ఇన్ని కావు. అవన్నీ ప్రయాసగా మారాయే తప్పించి.. ఎలాంటి ప్రయోజనాన్ని ఇవ్వలేదు. అంతేనా.. ఆయన ఇమేజ్ ను దారుణంగా దెబ్బ తీయటమే కాదు.. సొంత పార్టీకి చెందిన పలువురు ఛీ కొట్టే వరకు వెళ్లాయి.

వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు ట్విటర్ ఘాటు నిర్ణయాన్ని తీసుకోవటం తెలిసిందే. ఆయన అకౌంట్ ను తొలగించటం లాంటి తీవ్రమైన చర్యలు చేపట్టింది. ఇదిలా ఉంటే..ఈసారి ట్రంప్ కు షాకిచ్చేందుకు ఏ మాత్రం వెనుకాడలేదు గూగుల్. 2020 అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో భాగంగా ట్రంప్ తన ప్రచార యాప్ ను విడుదల చేశారు. అయితే.. గూగుల్ విధానాల్ని ఈ యాప్ పాటించకపోవటంతో.. గూగుల్ కఠిన నిర్ణయాన్ని తీసుకుంది.

తమ ప్లే స్టోర్ నుంచి ఈ యాప్ ను తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. గత ఏడాది నవంబరులో ఈ యాప్ ను అండ్రాయిడ్.. ఐఓఎస్ వెర్షన్లలో తీసుకొచ్చారు. ఆ తర్వాత దీనికి ఎలాంటి అప్ డేట్లు లేవు. యాప్ పని చేయటం ఆగిపోవటం.. దాన్ని సరి చేయాలని యాప్ డెవలపర్ కు పలుమార్లు చెప్పినా.. వాటిని పట్టించుకోకపోవటంతో.. తమ విధానాలకు భిన్నంగా ఉన్న యాప్ పై చర్యలు చేపట్టి దాన్ని తొలగించాలని నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు.. ఇదే యాప్ యాపిల్ వెర్షన్ లో మాత్రం కంటిన్యూ అవుతోంది. ఎందుకంటే.. యాప్ లోడ్ కావటమే దీనికి కారణంగా చెబుతున్నారు.