Begin typing your search above and press return to search.

జూబ్లీ హిల్స్ అత్యాచార ఘటనకు సంబంధించిన ఫొటోలు డిలీట్ చేయండి

By:  Tupaki Desk   |   3 Aug 2022 2:51 PM GMT
జూబ్లీ హిల్స్ అత్యాచార ఘటనకు సంబంధించిన ఫొటోలు డిలీట్ చేయండి
X
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన జూబ్లీహిల్స్ బాలిక గ్యాంగ్ రేప్ కేసులో పోలీసులు సంచలన ఆదేశాలిచ్చారు. అత్యాచార ఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో ఉంచారంటూ మైనర్ బాలిక తల్లిదండ్రులు మహిళా భద్రతా విభాగంలో ఫిర్యాదు చేశారు. బాలికతో ఐదుగురు కలిసి అసభ్యంగా ప్రవర్తిస్తున్న వీడియోలు.. ఆమె మెడపై గాయమైన ఫొటోలను ఇన్ స్టాగ్రామ్ లో ఉంచారని.. వాటిని తొలగించాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.

దీంతో మహిళా భద్రతా విభాగం ఈ కేసును హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు బదిలీ చేసింది. జువైనల్ యాక్ట్ కింద సైబర్ క్రైం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనలో బాలిక ఫొటోలు, వీడియోలను తొలగించాలని ఇన్ స్టాగ్రామ్ ఖాతాదారులకు నోటీసులు అందించారు.

ఈ ఏడాది మే 28న హైదరాబాద్ లో జరిగిన అత్యాచార ఘటన సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. బాలికపై సాదుద్దీన్ సహా మరో నలుగురు మైనర్ బాలురు సామూహిక అత్యాచారం చేశారు. జూన్ 2న మైనర్ బాలిక కారులో ప్రయాణిస్తుండగా నిందితుల అసభ్యంగా ప్రవర్తించిన ఫొటోలు వీడియోలు బయటకు వచ్చాయి. ఆ వీడియోలను చాలా మంది ఫేస్ బుక్ లో షేర్ చేశారు. వాటిని తొలుత ఫేస్ బుక్ లో అప్ లోడ్ చేసిన పాతబస్తీకి చెందిన వ్యక్తికి సైబర్ క్రైం పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఇన్ స్ట్రాగ్రామ్ లోనూ అప్ లోడ్ కావడంతో పోలీసులు ఐటీ వివరాలు సేకరిస్తున్నారు.

ఈ బాలిక గ్యాంగ్ రేప్ ఘటనల్లో ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలపై కేసులు నమోదయ్యాయి. జూబ్లీహిల్స్ లో మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం ఘటనలో బాధితురాలి వివరాలను దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు వెల్లడించారని ఆరోపిస్తూ న్యాయవాది కే. కొమ్మిరెడ్డి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, సెంట్రల్ డీసీపీలకు ఫిర్యాదు చేశారు. దీనిపై ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సెక్షన్ 228(ఏ) కింద కేసు నమోదు చేశారు. .

తొలుత ఈ వీడియోలను మీడియా ముఖంగా బయటపెట్టింది దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావునే. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయని మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ ఘటనలో వారి తల్లిదండ్రులు తాజాగా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వీటిని షేర్ చేసిన నెటిజన్లకు నోటీసులు ఇస్తున్నారు.