Begin typing your search above and press return to search.

లేట్ తో ఫ్లైట్ మిస్‌.. ప్రాణం ద‌క్కింది!

By:  Tupaki Desk   |   11 March 2019 7:19 AM GMT
లేట్ తో ఫ్లైట్ మిస్‌.. ప్రాణం ద‌క్కింది!
X
రెండు నిమిషాల ఆల‌స్యం. ఆయ‌న ప్రాణాలు ద‌క్కేలా చేశాయి. వినేందుకు విచిత్రంగా అనిపించినా ఇది నిజం. కేవ‌లం రెండు నిమిషాల ఆల‌స్యంగా ఎయిర్ పోర్ట్‌కు వెళ్ల‌టంతో ఒక పెద్ద మ‌నిషిని ఫ్లైట్ ఎక్కేందుకు అనుమ‌తించ‌లేదు అక్క‌డి భ‌ద్ర‌తా సిబ్బంది. దీంతో ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ నిర‌స‌న కూడా చేప‌ట్టారు. అంతేనా.. ఆయ‌న నిర‌స‌న నేప‌థ్యంలో భ‌ద్ర‌తా సిబ్బంది ఆయ‌న్ను అదుపులోకి తీసుకున్నారు.

ఫ్లైట్ మిస్ అయినందుకు ర‌చ్చ ర‌చ్చ చేసిన ఆ పెద్దాయ‌న ఇప్పుడు సంతోషంతో కేరింత‌లు కొడుతున్నాడు. ఫ్లైట్ లోకి అనుమ‌తించ‌నందుకు ఆయ‌న ప‌డుతున్న ఆనందం అంతా ఇంతా కాదు. దేవుడు త‌న ప‌క్షాన ఉండ‌టంతో తాను బ‌తికి ఉన్న‌ట్లుగా ఆయ‌న చెబుతున్నారు. ఇంత‌కూ ఎందుకిలా అంటారా? అక్క‌డికే వ‌స్తున్నాం.

ఇథియోపియా దేశానికి చెందిన బోయింగ్ 737 మ్యాక్స్ 8 ఫ్లైట్ ఆదివారం బ‌య‌లుదేరి కాసేప‌టికే కుప్ప‌కూలిపోవ‌టం.. అందులోప్ర‌యాణిస్తున్న 157 మంది దుర్మ‌ర‌ణం పాలు కావ‌టం తెలిసిందే. అడిస్ అబాబా ఎయిర్ పోర్ట్ నుంచి కెన్యాలోని నైరోబీకి బ‌య‌లుదేరిన విమానం.. టేకాఫ్ అయిన ఆరు నిమిషాల‌కే బిషోప్టు ప‌రిస‌రాల్లో కూలిపోయిన ఉదంతం తెలిసిందే.

ఈ ఫ్లైట్ లో గ్రీస్ కు చెంది అంటోనిస్ మావ్రోపోలోస్ అనే పెద్దాయ‌న ప్ర‌యాణించాల్సి ఉంది. ఆయ‌న ఎవ‌రో కాదు.. అంత‌ర్జాతీయ సాలిడ్ వేస్ట్ అసోసియేష‌న్ కు అధ్య‌క్షుడు. ఐక్య‌రాజ్య‌స‌మితి ప‌ర్యావ‌ర‌ణం గురించి నిర్వ‌హించే కార్య‌క్ర‌మంలో పాల్గొన‌టానికి నైరోబీ వెళ్లాల్సి ఉంది. అయితే.. ఆయ‌న రెండు నిమిషాల ఆల‌స్యంగా ఎయిర్ పోర్ట్ కు చేరుకున్నారు. దీంతో.. ఆయ‌న్ను డిపార్చ‌ర్ గేటులోకి అనుమ‌తించ‌లేదు అక్క‌డి సిబ్బంది.

ఈ నేప‌థ్యంలో ఆయ‌న నిర‌స‌న‌కు దిగారు. త‌న‌ను ఫ్లైట్లోకి అనుమ‌తించాల‌ని ఆయ‌న డిమాండ్ చేసినా.. రూల్స్ కు భిన్నంగా తాము వ్య‌వ‌హ‌రించ‌మ‌ని తేల్చి చెప్పారు అక్క‌డి సిబ్బంది. ఇది జ‌రిగిన కాసేప‌టికే ఫ్లైట్ కూలిపోవ‌టం.. అందులో ప్ర‌యాణిస్తున్న వారు భారీగా మృత్యువాత ప‌డ‌టంతో ఆయ‌న ఒక్క‌సారిగా షాక్ తిన్నారు.

కాస్తంత కోలుకున్నాక‌.. తన అనుభ‌వాన్ని ఫేస్ బుక్ లో పేర్కొన్నారు. ఈ దుర్ఘ‌ట‌న‌లో మ‌ర‌ణించిన వారిలో కెన్యా.. ఇథియోపియా.. కెన‌డా..చైనా..అమెరికా.. ఇట‌లీ.. ఫ్రాన్స్.. బ్రిట‌న్.. ఈజిఫ్టు.. నెద‌ర్లాండ్‌.. స్లోవేకియా.. భార‌త్ కు చెందిన ప్ర‌యాణికులు ఉన్నారు. మృతి చెందిన వారిలో న‌లుగురు భార‌తీయులు ఉండ‌గా.. వారిలో ఒక‌రు తెలుగు మ‌హిళ కూడా ఉన్న‌ట్లు గుర్తించారు. రెండు నిమిషాలు ఆల‌స్యంగా ఎయిర్ పోర్ట్ కు వెళ్ల‌టంతో మృత్యువును మిస్ అయిన పెద్దాయ‌న‌.. ఫ్లైట్ మిస్ కావ‌టం త‌న ల‌క్కీగా పేర్కొన్నారు.