Begin typing your search above and press return to search.

న్యాయం ఆల‌స్యం.. జ‌డ్జిపై అస‌హ‌నం.. ఓ యువ‌కుడు ఏం చేశాడంటే!

By:  Tupaki Desk   |   3 Feb 2021 4:45 PM GMT
న్యాయం ఆల‌స్యం.. జ‌డ్జిపై అస‌హ‌నం.. ఓ యువ‌కుడు ఏం చేశాడంటే!
X
దేశంలో త‌మ‌కు జ‌రుగుతున్న అన్యాయాలు.. అక్ర‌మాల‌పై.. క‌క్షిదారులు న్యాయ‌స్థానాల‌ను ఆశ్ర‌యించ‌డం తేలికే. కానీ.. అక్క‌డ త‌మ‌కు జ‌రుగే న్యాయం మాత్రం కొన్ని సంవ‌త్స‌రాలు పూర్త‌యినా.. జ‌ర‌గ‌డం లేద‌నే అప‌వాదు ఎప్పటి నుంచో వినిపిస్తోంది. అయితే.. ఈ ప‌రిణామంపై ఎప్ప‌టిక‌ప్పుడు విమ‌ర్శ‌లు వ‌స్తున్నా.. న్యాయం మాత్రం వేగం పుంజుకోలేక పోతోంది. ఇలాంటి ప‌రిస్థితిలో క‌క్షిదారులు స‌హ‌నం పాటించ‌డంత‌ప్ప‌.. చేసేది ఏమీ క‌నిపించ‌డం లేదు.

అయితే.. ఓ యువ‌కుడు మాత్రం త‌న‌కు న్యాయం జ‌ర‌గ‌డం ఆల‌స్య మైపోతోంద‌నే ఆవేద‌న‌తో.. ఓ న్యాయ‌మూర్తిపై ప్ర‌మాద‌క‌ర ఆయిల్ కుమ్మ‌రించి.. హ‌త్యాయ‌త్నం చేశాడు. ఈ ఘ‌ట‌న కేళ‌లో చోటు చేసుకుంది. అయితే.. దీనిని కేవ‌లం జ‌డ్జిపై జ‌రిగిన దాడిగానే కాకుండా.. న్యాయం ఆల‌స్య‌మైపోతున్న వైనంతో క‌క్షిదారులు ఎంత‌గా ఆవేద‌న చెందుతున్నారో.. అనే కోణాన్ని క‌ళ్ల‌కు క‌డుతోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

విష‌యం ఏంటంటే..
రెండేళ్ల కిందట ఇంటి నుంచి త‌ప్పిపోయిన జ‌స్నా మరియా అదృశ్యం కేసుపై కేర‌ళ‌ హైకోర్టులో విచారణ కొనసాగుతోంది. అయితే ఈకేసు విచార‌ణ అప్ప‌టి నుంచి సాగుతూనే ఉంది. త‌ర‌చుగా విచార‌ణ సైతం వాయిదా ప‌డుతోంది. ఇప్ప‌టికే రెండేళ్లు గడవడం, ఇంకా ఈ కేసు ఓ కొలిక్కి రాక‌పోవ‌డంతో కొట్టాయం ప్రాంతానికి చెందిన ఓ యువ‌కుడు విసుగుచెందాడు. దీంతో హైకోర్టు న్యాయ‌మూర్తి శిర్సి కారుపై వాహనాలకు వినియోగించే ప్ర‌మాద‌క‌ర‌ ఆయిల్ చల్లాడు. ఈ ఘటనతో షాక్‌కు గురయిన తోటి న్యాయమూర్తులు, న్యాయవాదులు వెంటనే అతడిని పట్టుకోవాలని ఆదేశించడంతో భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకుంది. జ‌డ్జి సెక్యూరిటీ ఆఫీస‌ర్ నిందితుడిని ప‌ట్టుకుని సెంట్ర‌ల్ పోలీసుల‌కు అప్ప‌గించాడు.

కేసు ఆల‌స్య‌మే కార‌ణం..
అయితే ఆ యువకుడు జ‌స్నా కేసును త్వ‌ర‌గా తేల్చాలంటూ కొన్ని రోజులుగా హైకోర్టు ముందు నిర‌స‌న వ్య‌క్తం చేస్తున్నాడు. ఆ నిరసనలో భాగంగా ఉద‌యం జ‌డ్జి శిర్సి కారు హైకోర్టు గేటు లోప‌లికి వస్తుండగా కారుపై ఆయిల్ గుప్పాడు. అదుపులోకి తీసుకున్న పోలీసుల‌కు కూడాస‌ద‌రు యువ‌కుడు ఇదే విష‌యాన్ని వెల్ల‌డించ‌డం గ‌మ‌నార్హం. ``కోర్టులో విచారణ ఆలస్యమవడం.. తీర్పు ఎంతకీ రాకపోవడంతో అస‌హ‌నానికి గురై.. ఈ ప‌నిచేశా. నాకు ఎవ‌రినీ చంపాల‌ని లేదు`` అని ఆ యువ‌కుడు ఆవేద‌న వ్య‌క్తం చేశారు. కానీ, త‌ప్పిపోయిన జ‌స్నా.. ఈ యువ‌కుడికి ర‌క్త‌సంబంధీకురాల‌ని తెలుస్తోంది. న్యాయమూర్తి కారుపై ప్ర‌మాద‌క‌ర‌ ఆయిల్‌ పోయడంతో తెల్లటి కారు కాస్తా నల్లగా మారింది. ఇదే ఆయిల్ జ‌డ్జిపై ప‌డి ఉంటే.. ఆమె ప్రాణాలు పోయేవ‌ని అంటున్నారు పోలీసులు. మ‌రి ఈ కేసు విచార‌ణ ఆల‌స్య‌మైంద‌న్న ఆవేద‌న‌.. ఆ యువ‌కుడిని మరో కేసులో ఇరికించ‌డం గ‌మ‌నార్హం.