Begin typing your search above and press return to search.

అందరూ కనెక్ట్ అయ్యే పథకాన్ని స్టార్ట్ చేసిన ఢిల్లీ సీఎం

By:  Tupaki Desk   |   5 Dec 2019 5:54 AM GMT
అందరూ కనెక్ట్ అయ్యే పథకాన్ని స్టార్ట్ చేసిన ఢిల్లీ సీఎం
X
ఇవాల్టి రోజున మొబైల్ ఫోన్ లేనోడు కనిపించడు. ఒకటి కాదు రెండు స్మార్ట్ ఫోన్లతో తిరగటం ఒక ఎత్తు అయితే.. క్షణం తీరిక లేకుండా ఆ మొబైల్ ఫోన్లలో ఏదో ఒకటి చూసే తీరు అంతకంతకూ పెరుగుతోంది. దీంతో.. మొబైల్ ఫోన్ లో ఇంటర్నెట్ కు అవసరమైన మొబైల్ డేటా ఇప్పుడు తప్పనిసరి అయ్యింది. నిద్ర లేచించి మొదలు రాత్రి పడుకునే వరకూ.. తిన్నా తినకున్నా.. తమ చేతుల్లోని స్మార్ట్ ఫోన్లలో మాత్రం డేటాకు కొదవ లేకుండా చూసుకునే ట్రెండ్ అంతకంతకూ పెరుగుతోంది.

ఇలాంటివేళ.. అందరిని ఆకర్షించేలా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తాజాగా సరికొత్త పథకాన్ని అమల్లోకి తెచ్చారు. వాస్తవానికి మిగిలిన రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పోలిస్తే కేజ్రీవాల్ చాలా ముందుంటారని చెప్పాలి. సగటు జీవికి డేటా అవసరాన్ని 2015లోనే గుర్తించిన ఆయన.. అప్పట్లో ఎన్నికల హామీ కింద డేటాను అందిస్తామని చెప్పారు

అయితే.. ఆ హామీని ఇప్పటివరకూ అమలు చేయలేదు. మరికొద్ది రోజుల్లో ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్న వేళ.. గత ఎన్నికల్లో తాను ఇచ్చిన హామీ కేజ్రీవాల్ మాష్టారికి గుర్తుకు వచ్చినట్లుంది. అంతే.. తాజాగా ఆయన సదరు పథకాన్ని పట్టాలకు ఎక్కించేశారు. మరికొద్ది రోజుల్లో ఎన్నికలు వస్తున్న వేళ.. అందరూ కనెక్ట్ అయ్యే ఉచిత మొబైల్ డేటా పథకానికి తెర తీశారు.

తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం ఢిల్లీ మహానగరంలోని ప్రజలు ఇకపై ప్రతి నెలా 15 జీబీ మొబైల్ డేటాను ఉచితంగా పొందనున్నారు. ఢిల్లీ వ్యాప్తంగా 11వేల హాట్ స్పాట్ లను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించిన సీఎం.. అందుకు సంబంధించిన పనులు వేగంగా సాగుతున్నట్లు చెప్పారు. ఈ నెల 16న వంద హాట్ స్పాట్ లను స్టార్ట్ చేస్తామంటున్నారు. స్పీడ్ కూడా ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉచిత మొబైల్ డేటా పథకానికి మించింది మరింకేమీ ఉంటుంది? మరి.. సీఎం కేజ్రీవాల్ ఐడియాను రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎవరు ముందుగా అందిపుచ్చుకుంటారో చూడాలి.