Begin typing your search above and press return to search.

సోషల్ మీడియాలో డిగ్రీ పట్టాలు...మోడీతోనే మైండ్ గేమ్

By:  Tupaki Desk   |   2 April 2023 6:25 PM GMT
సోషల్ మీడియాలో డిగ్రీ పట్టాలు...మోడీతోనే మైండ్  గేమ్
X
నరేంద్ర మోడీ ప్రపంచ నాయకుడిగా ఎదిగారు. ఆయనకు ఇంటా బయటా గత దశాబ్ద కాలంగా ఎదురులేకుండా ఉంది. నరేంద్రమోడీ రాజకీయ ఇంద్రజాలంతో దేశంలోని విపక్షాలు కట్టకట్టుకుని పక్కకు పోతున్నాయి. గడచిన తొమ్మిదేళ్ళ దేశ రాజకీయం చూస్తే మోడీ ముందు తరువాత అన్నంతగా విభజించబడింది.

ఎన్నిక ఏదైనా దున్నేయడమే అన్నట్లుగా బీజేపీ దూకుడు చేస్తోంది అంటే మోడీ వ్యూహాలూ ఆయన చాతుర్యమే కారణం అని అంతా అంటారు. అలాంటి మోడీని ఓడించాలి అంటే ముందు ఆయన ఇమేజ్ ని దెబ్బతీయాలన్నదే విపక్షాల లేటెస్ట్ తంత్రం. ఇక రాహుల్ గాంధీ సైతం విదేశాలకు ఈ మధ్య వెళ్ళి భారత దేశంలో ప్రజాస్వామ్యం మేడి పండు చందమని, మాట్లాడే స్వేచ్చ లేదని మోడీ సర్కార్ పరువు తీసేశారు

ఇక మోడీకి దేశంలో విపక్షాలలో గట్టి ప్రత్యర్ధిగా ఉన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆయన సొంత రాష్ట్రం గుజరాత్ లోనే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఆప్ సత్తా చూపించారు. ఇపుడు సమాచార హక్కు చట్టం కింద మోడీ ఎంతదాకా చదువుకున్నారో తెలుసుకోవాలని ఉందంటూ వివరాలు కోరారు.

అయితే దాని మీద గుజరాత్ హై కోర్టు మోడీ విద్యార్హతలు ఇపుడు ప్రకటించాల్సిన అవసరం లేదని పేర్కొంది. అంతే కాదు ఈ కేసు ఫైల్ చేసిన అరవింద్ కేజ్రీ వాల్ కి ఇరవై అయిదు వేల రూపాయలు అపరాధ రుసుము విధించడంతో ఇపుడు అది దేశవ్యాప్తంగా చర్చగా మారిపోయింది.

నిజానికి భారత దేశంలో ఎన్నికల్లో ఎవరైనా పోటీ చేయవచ్చు. దానికి చదువు అవసరం అయితే లేదు. అయితే ఎవరైనా ఎన్నికల అఫిడవిట్ లో తమ విద్యార్హతలు కనుక తప్పుగా రాస్తే అది పెద్ద వివాదం అవుతుంది. ఇపుడు మోడీ విషయంలో అలాంటి పాయింట్ నే పట్టుకుంటున్నాయి విపక్షాలు మోడీ పాట్నా విశ్వవిద్యాలయంలో డిగ్రీ చేశారని, అలాగే ఢిల్లీ విశ్వవిద్యాలయంలో పీజీ చదివారని అంటారు.

మరి అది నిజమైన పక్షంలో ఆయన తన పీజీ ఎడ్యుకేషన్ గురించి ఎందుకు బాహాటంగా చెప్పుకోరు అన్నదే అరవింద్ కేజ్రీవాల్ కీలకమైన ప్రశ్నగా ఉంది. మోడీ ఏమి చదివారు అన్నది భారత జాతికి తెలియాల్సి ఉందని ఆయన అంటున్నారు. ఇక ఈ ఇష్యూ ఇపుడు సోషల్ మీడియాలో టాప్ రేపుతోంది. ఒక విధంగా డిగ్రీ సర్టిఫికేట్లను సోషల్ మీడియాలో పరిచేస్తూ ఇవీ మా విద్యార్హతలు మీవేంటి మోడీ సాబ్ అని విపక్షాలు నిలదీస్తున్నాయి.

అలా కనుక చూస్తే దేశంలోని విపక్షాలు చాలా రాష్ట్రాలలో ఈ రకంగా సోషల్ మీడియాలో తన ఎడ్యుకేషన్ వివరాలు బహిర్గతపరుస్తున్నారు. అలా మోడీని కార్నర్ చేస్తూ వత్తిడి పెంచుతున్నారు. బీయారెస్ అధినేత కేటీయార్ కూడా తన విద్యార్హతలను సోషల్ మీడియాలో పెట్టారు.

మోడీ తన ఎన్నికల అఫిడవిట్లో తప్పుడు సమాచారం ఇచ్చారని విపక్షాలు అంటున్నాయి. లేకపోతే ఎందుకు ఆయన తన డిగ్రీ సర్టిఫికేట్లను బయటపెట్టారు అనందే వారి విమర్శ. ఇపుడు రాజకీయ నాయకులే కాదు, మేధావులు ప్రముఖులు నెటిజన్లు కూడా తమ డిగ్రీ పట్టాలను సోషల్ మీడియాలో పెట్టి మరీ హడావుడి చేస్తున్నారు. దీంతో మోడీ మీద బీజేపీ మీద వత్తిడి అయితే ఒక రేంజిలో పడుతోంది. ఒక విధంగా ఇది విపక్షాలు మోడీ మీద ఆడుతున్న మైండ్ గేం గా చెబుతున్నారు. దీని మీద బీజేపీ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాల్సిందే.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.