Begin typing your search above and press return to search.

'డిగ్రీ'లో తెలుగు మీడియం బంద్ !

By:  Tupaki Desk   |   15 Jun 2021 6:30 AM GMT
డిగ్రీలో తెలుగు మీడియం బంద్ !
X
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని డిగ్రీ కళాశాలల్లో 2021-22 విద్యా సంవత్సరం నుంచి తెలుగు మీడియం కథ దాదాపుగా ముగిసిపోయినట్లే. రాష్ట్రంలో ఇక నుంచి డిగ్రీ విద్యార్థులు తెలుగులో చదివే అవకాశం ఉండదు. డిగ్రీ కాలేజీలన్నీ పూర్తిగా ఇంగ్లీష్ మీడియంలోకి మారిపోనున్నాయి. అన్ని ప్రైవేటు ఎయిడెడ్, అన్‌ ఎయిడెడ్‌ కాలేజీలు తెలుగు మాధ్యమం కోర్సులను ఇంగ్లీష్ మీడియం లోకి మార్చుకోవాలని ఉన్నత విద్యా మండలి సూచించింది. ఈ మేరకు మండలి కార్యదర్శి ప్రొఫెసర్‌ బి. సుధీర్‌ ప్రేమ్‌కుమార్‌ సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఉన్నత విద్యపై ఫిబ్రవరి 2న సీఎం జగన్‌ నిర్వహించిన సమీక్షలో తీసుకున్న నిర్ణయం మేరకు ఈ విద్యా సంవత్సరం నుంచి డిగ్రీ కళాశాలలు ఆంగ్ల మాధ్యమంలోనే కోర్సులను నిర్వహించాలని ఉన్నత విద్యామండలి సోమవారం ప్రకటన విడుదల చేసింది.

ఇకపై నాలుగేళ్ల డిగ్రీ కోర్సులను ఇంగ్లీష్ మీడియంలో నిర్వహిస్తేనే ఆమోదించనున్నట్లు స్పష్టం చేసింది. ప్రస్తుతం తెలుగు మీడియంలో కోర్సులు నిర్వహిస్తున్న ప్రైవేటు కళాశాలలు మీడియం మార్పునకు ఈ నెల 18 నుంచి 28 వరకు ప్రతిపాదనలు సమర్పించాలని ఉన్నత విద్యా మండలి సూచించింది.

ప్రతిపాదనలు సమర్పించకపోతే కళాశాలలు కోర్సులను నిర్వహించేందుకు వీలుండదని పేర్కొంది. అలా ఇవ్వని పక్షంలో 2021–22 నుండి ఆయా కోర్సుల నిర్వహణకు అనుమతులివ్వలేమని స్పష్టంచేసింది. గడువు దాటాక ఎలాంటి ప్రతిపాదనలను స్వీకరించబోమని పేర్కొంది. అలాగే, అన్‌ ఎయిడెడ్‌ ప్రోగ్రాములలో నిర్వహణ సాధ్యంకాని, నిర్వహించని యూజీ ప్రోగ్రాములను ఉపసంహరించుకోవాలనుకునే ప్రైవేట్‌ అన్‌ ఎయిడెడ్‌ డిగ్రీ కాలేజీలు, ప్రైవేట్‌ ఎయిడెడ్‌ డిగ్రీ కాలేజీలు తమ ప్రతిపాదనలను కూడా ఈనెల 18 నుంచి 28లోగా సమర్పించాలని సూచించింది. ఇప్పటికే తెలుగు మీడియం చదువుతున్న 65,981 మంది విద్యార్థులు యధాతథంగా ఆయా కోర్సుల్లో కొనసాగుతారు. 2021–22 విద్యా సంవత్సరం నుంచి కొత్తగా చేరే విద్యార్థులకు మాత్రమే ఇంగ్లిష్‌ మీడియం అమలవుతుంది. గతేడాది నిర్వహించిన ఆన్‌లైన్‌ ప్రవేశాల్లో 1,336 డిగ్రీ కళాశాలల్లో 2.60 లక్షల మంది చేరారు. వీరిలో 65 వేల మంది తెలుగు మీడియం ఎంచుకున్నారు. వీరిలో ఎక్కువ మంది బీఎస్సీ కోర్సును ఎంపిక చేసుకున్నారు.