Begin typing your search above and press return to search.

సైకిల్ తొక్కితే శీలం చేడిపోదూ...!

By:  Tupaki Desk   |   24 Sep 2016 5:09 AM GMT
సైకిల్ తొక్కితే శీలం చేడిపోదూ...!
X
సైకిల్ తొక్కడం వల్ల శీలం చేడిపోదు.. సైకిల్ తొక్కడం మా జన్మ హక్కు.. అంటూ సైకిల్ తెగ తొక్కేస్తున్నారు ఇరాన్ మహిళలు. కాలుష్యం వదిలే బైక్ లు - కార్లను వదిలి ప్రపంచమంతా సైకిళ్లను ఆశ్రయించే దిశగా అడుగులు వేస్తుంటే.. తమను సైకిల్ తొక్కొద్దనడం ఏమిటి అని వారంతా ప్రశ్నిస్తున్నారు. దీనికి కారణం ఆ దేశమతాధిపతి అయతొల్లా అలీ ఖమేనీ జారీ చేసిన పత్వానే. దీనిపై దేశవ్యాప్తంగా మహిళలు ఆ విషయాన్ని సీరియస్ గా తీసుకుని సైకిళ్లు తొక్కడం మొదలుపెట్టడంతోపాటు - వాటిని వీడియోలు తీసి ఆన్ లైన్ లో పోస్ట్ చేస్తున్నారు.

ఇరాన్ లో మహిళలు సైకిలు తొక్కవద్దని - అలాచేయడం వల్ల వారి శీలం దెబ్బతింటోందని దేశమతాధిపతి అయతొల్లా అలీ ఖమేనీ ఫత్వా జారీ చేశారు. ఇప్పుడు ఈ ఫత్వాపై మహిళలు మండిపడుతున్నారు. సైకిల్ తొక్కడంపై ఆంక్షలేమిటి.. అది తమకు జన్మతో వచ్చిన హక్కు అని వాదిస్తున్నారు. ఇప్పటికే ఈ ఫత్వాకు నిరసనగా ఇరాన్ మహిళలు ఓ ఉద్యమంలా సైకిళ్లను తొక్కుతూ - వాటికి సంబందించిన వీడియోలను "ఇరానియన్‌ విమెన్‌ లవ్‌ సైక్లింగ్" హ్యాష్‌ ట్యాగ్‌ తో సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఈ వీడియోలకు - వారి ఉద్యమానికి ప్రపంచం నలుమూలల నుంచి మహిళలతోపాటు మగవాళ్ల నుంచి కూడా వారికి మద్దతు పెరుగుతోంది.

ఈ క్రమంలో ఫత్వాను కాదని సైకిల్ తొక్కుతున్న ఇరానీ మహిళలు ఫొటోలను - వీడియోలను - కామెంట్లను ఎప్పటికప్పుడు "మైస్టీల్తీ ఫ్రీడమ్" పేరుతో ఫేస్‌ బుక్ లో పోస్ట్ చేస్తున్నారు. ఇరాన్‌ లోని షిరియాజ్ వీధుల్లో సైకిల్ తొక్కుతూ దిగిన వీడియోను పాతికేళ్ల అమ్మాయి పోస్ట్ చేయగా.. రెండు రోజుల్లోనే ఈ వీడియోకు 21వేల వ్యూస్ వచ్చాయి. ఇదే క్రమంలో తన తల్లితో పాటు సైకిల్ తొక్కుతూ వీడియో తీసి.. ఇది మా హక్కు అని రాసిన ఒక అమ్మాయి వీడియోకి మూడు రోజుల్లో 1.10 లక్షల వ్యూస్ వచ్చాయి.

కాగా... ఈ ఫత్వాను ఉల్లంఘించిన వారిపై చర్య తీసుకుంటారా? లేదా? అనే చర్చ కూడా ఇప్పటికే మొదలైపోయింది. ఫత్వా ఉల్లంఘిస్తే చర్యలు తీసుకోవాలనే చట్టం ఇరాన్‌ లో లేదుగానీ, మర్యాదపూర్వక దుస్తులు మాత్రమే ధరించాలనే నిబంధన కింద అప్పడప్పుడు ఫత్వా ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటుంటారు. ఈ నిబంధనకు కూడా సరైన వివరణ అంటూ ఏమీ లేనందున, ఈ ఫత్వాలను ఉల్లంఘించిన వారిని అరెస్ట్ చేయవచ్చు లేదా చేయకపోవచ్చు. అందే ఫిర్యాదులు, దర్యాప్తు చేసే అధికారుల నిర్ణయాన్ని బట్టి రిజల్ట్ ఉంటుంది.