Begin typing your search above and press return to search.

రాయలసీమ నుంచి వైసీపీలోకి ఇద్దరు ఎమ్మెల్యేలు?

By:  Tupaki Desk   |   20 Feb 2018 10:31 PM IST
రాయలసీమ నుంచి వైసీపీలోకి ఇద్దరు ఎమ్మెల్యేలు?
X
కనీసం ఒక వైసీపీ ఎమ్మెల్యేను కొనుగోలు చేసి మూడు రాజ్యసభ సీట్లు సాధించాలని టీడీపీ కలలు కంటున్న వేళ ఆ పార్టీకి భారీ షాక్ తగిలే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే వైసీపీ నుంచి ఫిరాయించిన నేతల్లో కొందరు టీడీపీలో ఇమడలేక తిరిగి వైసీపీ గూటికి వచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కూడా ఇదే మాట చెప్తున్నారు. తమ పార్టీ నుంచి ఫిరాయించిన నేతలే కాకుండా మరికొందరు టీడీపీ నేతలు కూడా వైసీపీలోకి వస్తామంటూ సంకేతాలు పంపుతున్నారని ఆయన అన్నారు.

అయితే.. వైసీపీలోకి ఫిరాయించే నేతలెవరైనా టీడీపీ సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశాకే వైసీపీలో చేరాలని అన్నారు. టీడీపీలా తాము చేయబోమని... రాజీనామాలు చేసి వచ్చేవారిని మాత్రమే చేర్చుకుంటామని ఆయన అన్నారు. పార్టీ మారాలనుకునేవారు పదవులకు రాజీనామా చేసి రావాలన్నఒక మంచి పద్దతిని తాము పాటిస్తామన్నారు.

కాగా.. విజయసాయి రెడ్డి ఎవరి పేర్లూ ప్రత్యేకంగా చెప్పనప్పటికీ రాయలసీమలోని ఇద్దరు ఎమ్మెల్యేలు వైసీపీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. వైసీపీ నుంచి గెలిచిన ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు అనంతరం టీడీపీలోకి ఫిరాయించారు. అయితే.. అప్పట్లో భారీ మొత్తం ఇచ్చి వారిని పార్టీలోకి తీసుకున్న టీడీపీ అవసరం తీరాక వారిని పట్టించుకోవడం మానేయడంతో వారు మళ్లీ వైసీపీలోకి వచ్చే ప్రయత్నం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. కర్నూలు జిల్లా కోడుమూరు ఎమ్మెల్యే మణిగాంధీ.. కడప జిల్లా బద్వేల్ ఎమ్మెల్యే జయరాములు తిరిగి వైసీపీలోకి రావాలనుకుంటున్నట్లు తెలుస్తోంది.