Begin typing your search above and press return to search.

ఓటమి.. బండి, రేవంత్, కిషన్ లకు కలిసొచ్చింది

By:  Tupaki Desk   |   9 July 2021 6:30 AM GMT
ఓటమి.. బండి, రేవంత్, కిషన్ లకు కలిసొచ్చింది
X
ఓటమి గెలుపునకు నాంది అంటారు.. ఓడిపోతేనే గెలుపు విలువ తెలుస్తుంది.. ఓడిపోయామని అక్కడే ఆగిపోతే మీ లక్ష్యాన్ని చేరలేము.. ఒక్కోసారి ఓటమి మన తలరాతను మారుస్తుంది.. అందలం ఎక్కిస్తుంది. అందుకే ఓటమి మన మంచికే అనుకోవాలి.. ఓడితే వచ్చే విజయానికి తలుచుకొని కష్టపడాలి. అప్పుడే అందలం దక్కుతుంది.. ఓడిపోయామని ఆగిపోయామా? అంతే సంగతులు.. మీరు వెనకబడినట్టే.. ఇప్పుడు ఓటమి ఎదురైనా.. దాన్ని సోపానంగా భావించి ఎదిగి నిరూపించారు ముగ్గురు వ్యక్తులు.. బండి సంజయ్, రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డిలు ఎమ్మెల్యేలుగా ఓడి ఎంపీలుగా గెలిచి అందలమెక్కారు. తెలంగాణనే లీడ్ చేసే స్థాయికి ఎదిగారు..

- గంగుల చేతిలో ఓడిన బండి సంజయ్.. ఎంపీగా గెలిచి.. బీజేపీ చీఫ్ గా..
సీఎం కేసీఆర్ 2018లో ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. అప్పుడు కరీంనగర్ ఎమ్మెల్యే సీటులో ఇప్పుడున్న మంత్రి గంగుల కమలాకర్ టీఆర్ఎస్ తరుఫున నిలబడ్డారు. అప్పటివరకు బీజేపీ కార్పొరేటర్ గా ఉన్న బండి సంజయ్ కు ప్రమోషన్ వచ్చి గంగులపై బీజేపీ తరుఫున ఎమ్మెల్యేగా పోటీచేశారు. నాడు స్వల్ప తేడాతో ఓడిపోయారు. తృటిలో విజయాన్ని చేజార్చుకున్నారు. గంగులను దాదాపు ఓడించినంత పనిచేశారు. ఆ ఓటమి తర్వాత బండిసంజయ్, బీజేపీ కార్యకర్తలు పెట్టుకున్న కన్నీళ్లు అందరినీ కరిగించాయి. ఆ వీడియోలు వైరల్ అయ్యాయి. పాపం.. బండి సంజయ్ వరుసగా రెండు సార్లు ఓడిపోయాడన్న సానుభూతి ప్రజల్లో వ్యక్తమైంది. అంతకుముందు కూడా ఇలానే ఓడిపోవడంతో బండిపై ప్రజల్లో ఓ రకమైన సింపతీ వ్యక్తమైంది. ఈ క్రమంలోనే 2019 పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ ఎంపీగా బండి సంజయ్ ను బరిలోకి దించింది అధిష్టానం.. వరుసగా ఓడించిన జనాలు సానుభూతితో బండి సంజయ్ ను గెలిపించారు.. టీఆర్ఎస్ సీనియర్ వినోద్ లాంటి గట్టి ప్రత్యర్థిని బండి సంజయ్ ఓడించాడు. ఎమ్మెల్యేగా ఓటమియే బండి కి కలిసివచ్చింది.. ఎంపీగా గెలిపించింది. తర్వాత తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా మార్చింది.. బండి దూకుడుతో బీజేపీ తెలంగాణలో విజయాలు అందుకుంది. తిరుగులేని నాయకుడిగా బండిని నిలబెట్టింది.

-కొడంగల్ లో ఓడి.. మల్కాజిగిరిలో గెలిచి.. పీసీసీ చీఫ్ గా రేవంత్
ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం ఇంట ఓడి రచ్చ గెలిచాడు. రచ్చ గెలవడమే కాదు.. ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ బాధ్యతలు సైతం అందుకునేదాకా ఎదిగాడు.. దీనికంతంటి కారణం ఏదో తెలుసా.? ‘మల్కాజిగిరి’ పార్లమెంట్ స్థానం. అవును.. తన సొంత ఊళ్లో ఓడిపోయిన రేవంత్ రెడ్డిని ఇప్పుడు ఈ స్థాయి చేర్చింది ఖచ్చితంగా మల్కాజిగిరి పార్లమెంట్ నే. రేవంత్ రెడ్డి రాజకీయం మొత్తం ఇన్నాళ్లు కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచే సాగింది. వరుసగా అక్కడి నుంచే గెలుస్తూ వచ్చారు. కానీ 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరుఫున పోటీ చేసిన రేవంత్ ను టీఆర్ఎస్ ఓడించింది. పట్టుబట్టి మరీ రేవంత్ ను ఓడించారు గులాబీ శ్రేణులు. ఇన్నాళ్లుగా రేవంత్ ను ఆదరించిన కొడంగల్ ప్రజలు టీఆర్ఎస్ సునామీలో మాత్రం కాలదన్నారు. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి రాజకీయ ఫైర్ బ్రాండ్ అయిన రేవంత్ రెడ్డి ప్రభ మసకబారింది. రేవంత్ సొంత నియోజకవర్గంలోనే గెలవలేకపోయాడన్న ఆవేదన.. ఆరోపణలు వచ్చాయి. అనంతరం ఆరునెలల అనంతరం జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో తన సొంత స్థానం నుంచి కాకుండా హైదరాబాద్ శివారు అయిన మల్కాజిగిరి నుంచి రేవంత్ రెడ్డి ఎంపీగా పోటీచేశారు. కానీ ఇక్కడి ప్రజలు ఆదరించారు. కాంగ్రెస్ పార్టీలో రేవంత్ ఎదుగుదలకు మల్కాజిగిరి వాసులు పునాది వేశారు. అక్కడి నుంచి మొదలైన రేవంత్ రెడ్డి రాజకీయం ఇప్పుడు పీసీసీ అధ్యక్షుడిగా ఎదిగే వరకు సాగింది. మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గం దేశంలోనే అతిపెద్దది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజిగిరి జిల్లాలతో కలిసి ఏర్పాటైంది. అక్షరాస్యులు అధికంగా ఉన్న నియోజకవర్గం ఇదీ. అందుకే యువతే తనను గెలిపిస్తారని రేవంత్ పోటీ చేశారు. ఏడు నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లే ఉన్నా కూడా రేవంత్ రెడ్డి ఒంటరి పోరాటం చేసి గెలిచారు. ప్రశ్నించే గొంతుకలా.. మంచి వాగ్ధాటితో రేవంత్ రెడ్డి ప్రచారం చేశారు. మల్కాజిగిరి ఎంపీగా గెలిచిన రేవంత్ రెడ్డి ప్రజా సమస్యలపై చురుకుగా స్పందిస్తూ ఆ ప్రాంత ప్రజల మనసు దోచుకుంటున్నారు. ప్రజాసమస్యలపై ఆందోళనలూ చేస్తున్నారు. ప్రజలకు జరిగే అన్యాయాన్ని ప్రశ్నిస్తున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో పీసీసీ చీఫ్ స్థాయికి చేరడం వెనుక ఖచ్చితంగా మల్కాజిగిరి ప్రజల మద్దతు ఉంది. వారి వల్లే రేవంత్ ఇప్పుడు రాజకీయంగా బలంగా నిలబడ్డారని చెప్పొచ్చు. దీన్ని బట్టి ఎమ్మెల్యే ఓటమి రేవంత్ రెడ్డికి మంచే చేసింది. ఎంపీగా గెలిపించింది.. ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ పగ్గాలు అందేలా చేసింది..

-అంబర్ పేటలో ఓడి.. సికింద్రాబాద్ లో గెలిచి.. కేంద్రమంత్రిగా కిషన్ రెడ్డి
అంబర్ పేటలో వరుసగా రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బీజేపీ నేత కిషన్ రెడ్డి మూడోసారి 2018లో ఓడిపోయాడు. టీఆర్ఎస్ సునామీలో.. కేసీఆర్ స్కెచ్చుల్లో చిత్తు అయ్యాడు. అయితే ఆ ఓటమియే ఆయనకు కలిసి వచ్చింది.. సానుభూతి పెంచింది. అనంతరం జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో స్థానిక పార్టీ టీఆర్ఎస్ ను కాలదన్ని జాతీయ పార్టీ అయిన బీజేపీని ప్రజలు ఆదరించారు. సికింద్రాబాద్ ఎంపీగా కిషన్ రెడ్డిని గెలిపించారు. అదే ఆయనకు టర్నింగ్ పాయింట్ అయ్యింది. ఇదివరకు ఆర్ఎస్ఎస్ లో పనిచేసినప్పుడు మోడీ తో సాన్నిహిత్యం, కేంద్రలో పరిచయాలతో కేంద్రహోంశాఖ సహాయ మంత్రి పదవి దక్కింది. ఇప్పుడు ఏకంగా కేబినెట్ ర్యాంకుతో పర్యాటక శాఖ వచ్చింది. దీనంతటికి కారణం ఎమ్మెల్యేగా కిషన్ రెడ్డి ఓడిపోవడమే.. ఓటమి కిషన్ రెడ్డికి మంచే చేసింది. అదే ఆయనను అందలం ఎక్కించేలా చేసిందనడంలో ఎలాంటి సందేహం లేదు.

- ఈ ముగ్గురి ప్రత్యర్థి టీఆర్ఎస్ యే.. సానుభూతియే గెలిపించింది..
ఆశ్చర్యకరంగా ఈ ముగ్గురి ప్రత్యర్థి టీఆర్ఎస్ కావడం విశేషం. కొడంగల్ లో పట్టుబట్టి మరీ రేవంత్ రెడ్డిని ఓడించింది టీఆర్ఎస్ . కానీ ఓడిన రేవంత్ పై సానుభూతి వ్యక్తమై మల్కాజిగిరిలో గెలిపించింది. అలానే బండి సంజయ్, కిషన్ రెడ్డిలు కూడా ఎమ్మెల్యేలుగా ఓడిపోయిన సానుభూతితో ఎంపీలుగా గెలిచారు. వీరిని టీఆర్ఎస్ పార్టీనే ఓడించగా.. ఎంపీలుగా గెలిచి అందలమెక్కారు. ఇలా ముగ్గురికి ఓటమి మంచి చేసింది. ఎమ్మెల్యేలుగా గెలిచి ఉంటే ఈ స్థాయికి చేరేవారు కాదేమో.. ఒక్కసారి ఓటమిని కూడా సానుకూలంగానే తీసుకోవాలని వీరి జీవితాలు మనకు గుణపాఠాలు నేర్పుతున్నాయి.