Begin typing your search above and press return to search.

పోలీసు అధికారిపై పరువు నష్టం దావా: హోంమంత్రి

By:  Tupaki Desk   |   21 March 2021 7:38 AM GMT
పోలీసు అధికారిపై పరువు నష్టం దావా: హోంమంత్రి
X
మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ ముఖ్ పై ఇటీవల మాజీ పోలీస్ కమిషనర్ పరమ్ బీర్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. నగరంలోని బార్లు, రెస్టారెంట్లు, ఇతర సంస్థల నుంచి నెలకు 100 కోట్ల వసూలు చేయాలని మాజీ పోలీసు అధికారి సచిన్ వాజేను అనిల్ దేశ్ ముఖ్ ఆదేశించారంటూ పరం బీర్ సింగ్ తాజాగా సీఎం ఉద్దవ్ ఠాక్రేకు రాసిన లేఖలో ఆరోపించారు. ఈ లేఖ ముంబై పోలీస్ శాఖలో పెద్ద దుమారం రేపింది. వాజేకి అనిల్ టార్గెట్ నిర్ధేశించారని ఆరోపించారు.

ముఖేష్ అంబానీ ఇంటివద్ద బాంబు కేసు దర్యాప్తులో పరమ్ బీర్ సింగ్ ఎన్నో వైఫల్యాలు ఉన్నాయని.. వాటిని కప్పి పుచ్చుకోవడానికి ఆయన ఇలా తనమీద ఆరోపణలు చేస్తున్నారని అనిల్ దేశ్ ముఖ్ ఆరోపించారు. దమ్ముంటే వీటిని నిరూపించాలన్నారు.

సచిన్ , వాజే , మాన్ సుఖ్ హీరేన్ కేసులో తనను తాను రక్షించుకునేందుకు సింగ్ ఇలా నా మీద అభాండాలు వేస్తున్నారు హోంమంత్రి అన్నారు.ఈ కేసులో పరమ్ బీర్ సింగ్ తను కూడా చిక్కుకోవచ్చునని భయపడుతున్నారన్నారు.

సచిన్ గత జనవరిలో ఈ సమాచారాన్ని తనకు తెలియజేశారని సింగ్ చెబుతున్నారని.. మరి అప్పుడే ఎందుకు ఈ విషయాలను బహిర్గతం చేయలేదని ఆయన ప్రశ్నించారు. సింగ్ పై పరువునష్టం కేసు వేస్తానని.. లేనిపోని ఆరోపణలు చేసి తన ప్రతిష్టను భంగపరిచినందుకు ఊరుకోబోమని అన్నారు.

ఈ మొత్తం వ్యవహారం మహారాష్ట్రలోని శివసేన ప్రభుత్వానికి తలనొప్పిలా తయారైంది. సీఎం థాక్రే దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాల్సి ఉంది.

ఇదే అదనుగా విపక్షాలు అప్పుడే ఆయన ప్రభుత్వంపై సందేహాలు వ్యక్తం చేస్తున్నాయి. మొదట అనిల్ దేశ్ ముఖ్ రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది.