Begin typing your search above and press return to search.

వ్యాఖ్యలు వెనక్కి తీసుకోకుంటే ఏపీ డీజీపీపై పరువునష్టం దావా

By:  Tupaki Desk   |   17 Jan 2021 4:30 AM GMT
వ్యాఖ్యలు వెనక్కి తీసుకోకుంటే ఏపీ డీజీపీపై పరువునష్టం దావా
X
గడిచిన కొద్ది రోజులుగా ఏపీలోని దేవతామూర్తుల్ని ధ్వంసం చేస్తున్న ఉదంతంపై ఏపీ డీజీపీ చేసిన వ్యాఖ్యలు రాజకీయ రగడకు కారణమైంది. తాజాగా ఆయన మాట్లాడుతూ.. ఆలయాలపై జరుగుతున్న ఘటనల్లో టీడీపీ.. బీజేపీ నేతల హస్తం ఉందన్నారు. ఇప్పటికే 17 మంది టీడీపీ నేతలు.. నలుగురు బీజేపీ నేతల హస్తం ఉందన్న ఆయన.. అందులో పదమూడు మంది టీడీపీ నేతల్ని.. ఇద్దరు బీజేపీ నేతల్ని అరెస్టు చేసినట్లుగా పేర్కొన్నారు.

అయితే.. ఆలయాల్లోని దేవతామూర్తుల్ని ధ్వంసం చేసే వ్యవహారంలో ప్రమేయం ఉందనే విషయంలో కాకుండా.. ఈ అంశాలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్న ఆరోపణలతో కేసులు నమోదు చేస్తున్నట్లు చెబుతున్నారు. డీజీపీ చేసిన వ్యాఖ్యలపై తెలుగుదేశం పార్టీతో పాటు ఏపీ బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు డీజీపీ గౌతమ్ సవాంగ్ కు లేఖ రాశారు.

రాష్ట్రంలో ఆలయాలపై దాడులు.. విగ్రహాల విధ్వంసం కేసులో తమ పార్టీ నేతల హస్తం ఉందని పేర్కొన్నారని.. దానికి సంబంధించిన ఆధారాలు చూపాలన్నారు. ఏపీ డీజీపీ చేసిన ప్రకటనతో తప్పుడు సంకేతాలు వెళుతున్నాయని.. బీజేపీ కార్యకర్తలే దాడులు చేసినట్లుగా మీడియాలో వార్తలు వస్తున్నట్లుగా ఆందోళన వ్యక్తం చేశారు. విగ్రహాలపై దాడులు చేయటానికి.. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టటానికి మధ్య తేడా చాలా ఉందన్న ఆయన.. బీజేపీ కార్యకర్తలే దాడులు చేశారనటం అర్థరహితమని మండిపడ్డారు.

ఒక రాజకీయ పార్టీకి మద్దతు ఇచ్చేలా మాట్లాడి.. తమ పార్టీకి చెడ్డపేరు వచ్చేలా ప్రకటనలు ఇవ్వటం సరికాదన్నారు. డీజీపీ చేసిన అస్పష్టమైన ప్రకటనలతో ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళతాయన్న ఆయన.. ఈ అంశంపై వివరణ ఇవ్వకుంటే పరువు నష్టం దావా వేస్తామన్నారు. ఈ అంశంపై న్యాయపరంగా ముందుకు వెళతామన్న సోము వ్యాఖ్యలపై ఏపీ డీజీపీ ఏ రీతిలో రియాక్టు అవుతారో చూడాలి.