Begin typing your search above and press return to search.

హైకోర్టు జడ్జిలపై దూషణ కేసు.. సీబీఐ విచారణ వేగవంతం

By:  Tupaki Desk   |   23 Nov 2020 6:45 AM GMT
హైకోర్టు జడ్జిలపై దూషణ కేసు.. సీబీఐ విచారణ వేగవంతం
X
ఏపీ హైకోర్టు జడ్జిలను దూషించిన కేసులో సీబీఐ విచారణను వేగవంతం చేసింది. సోషల్ మీడియాలో హైకోర్టు న్యాయమూర్తులను అసభ్య పదజాలంతో దూషించి పోస్టింగ్ లు పెట్టిన కేసులో సీబీఐ దూకుడు పెంచింది. తొలిరోజు విచారణకు హైకోర్టు న్యాయవాది వివి లక్ష్మీనారాయణ హాజరయ్యారు. ఆయనను సుమారు గంటన్నరపాటు సీబీఐ అధికారులు విచారణ జరిపారు.

హైకోర్టు న్యాయమూర్తులపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తూ దూషణలకు దిగుతున్నారని గతంలో హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ కు న్యాయవాది లక్ష్మీనారాయణ లేఖ రాశారు. లేఖతోపాటు సోషల్ మీడియాలో పెట్టిన పోస్టింగ్ లు కూడా రిజిస్ట్రార్ జనరల్ కు లక్ష్మీనారాయణ అందజేశారు.

న్యాయవాది లక్ష్మీనారాయణ లేఖ ఆధారంగా అప్పట్లో పోలీసులకు హైకోర్టు రిజిస్ట్రార్ ఫిర్యాదు చేశారు. లక్ష్మీనారాయణ ఫిర్యాదు ఆధారంగా విచారణను ప్రభుత్వం అప్పట్లో సీఐడీకి బదలాయించింది.

సీఐడీ విచారణ పట్ల అసంతృప్తి వ్యక్తం చేసిన హైకోర్టు ఈ కేసును సీబీఐకి అప్పగించింది. సీబీఐ ప్రస్తుతం రంగంలోకి దిగింది. విచారణలో భాగంగా తన వద్ద ఉన్న వివరాలను సీబీఐ అధికారులకు అందజేసినట్టు న్యాయవాది లక్ష్మీనారాయణ తెలిపారు.

విచారణ అనంతరం లక్ష్మీనారాయణ మీడియాతో మాట్లాడారు. వైసీపీ సోషల్ మీడియా పోస్టింగ్ లు పెట్టిన వారిని కాపాడుకుంటాం అన్న వైసీపీ నేత వ్యాఖ్యలపై సీబీఐ విచారణ జరపాలన్నారు.ఈ కేసులో వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తదితరులను కూడా సీబీఐ విచారించే అవకాశం ఉందని అన్నారు.