Begin typing your search above and press return to search.

అమ్మను నేరుగా నిలదీసిందట

By:  Tupaki Desk   |   15 Dec 2016 2:36 PM GMT
అమ్మను నేరుగా నిలదీసిందట
X
అమ్మగా సుపరిచితురాలైన జయలలితకు సంబంధించిన ఆసక్తికర అంశాలు బయటకు వస్తున్నాయి. జయలలిత సోదరుడి కుమార్తె అయిన దీప తాజాగా ఒక మీడియా సంస్థతో మాట్లాడుతూ.. అమ్మకు సంబంధించిన ఆసక్తికర అంశాల్ని చెప్పుకొచ్చారు. తనకు.. తన మేనత్తతో ఉన్న రిలేషన్ గురించి చెప్పుకొచ్చిన ఆమె.. పలు అంశాల గురించి చెప్పుకొచ్చారు.

దీపావళి రోజున తాను పుట్టానని (1974లో).. తాను పుట్టినప్పుడు మేనత్త జయలలిత తమ అమ్మానాన్నల వద్దే ఉన్నట్లు దీప చెప్పారు. తన పేరును సైతం జయలలితే పెట్టారని.. దీప అంటే వెలుతురు అన్న అర్థంతో తన పేరును పెట్టినట్లు వెల్లడించారు. తామంతా కలిసి ఉండేవారమని.. చిన్నతనంలో మేనత్త సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనేవారని.. ఆమే తనకు రోల్ మోడల్ గా పేర్కొన్నారు.

కష్టపడి పని చేసే తత్వం.. నిస్వార్థంగా పని చేసే లక్షణాలు తనకెంతో నచ్చాయని.. తాము పోయెస్ గార్డెన్ నుంచి వెళ్లిపోయాక.. కొత్త వాళ్లు అందులోకి వచ్చారని పేర్కొన్నారు. 1991లో తొలిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత తమ కుటుంబంతో మేనత్త లంచ్ చేశారని.. అప్పుడు తనకు 16 ఏళ్లుగా చెప్పుకొచ్చారు. తన నాన్నను మేనత్త అందరికి పరిచయం చేస్తూ.. తన సోదరుడని పేర్కొన్నారని.. అప్పుడు తనను చూసి ఆమె చాలా సంతోషించారన్నారు.

ఆ సమయంలో తానేం చదువుతున్న విషయాల్ని అడిగి తెలుసుకున్న వైనాన్ని తాను ఎప్పటికీ మరవలేనని చెప్పారు. ఆ తర్వాత తాము తమ మేనత్తను చాలాసార్లు కలుసుకునేదానినని చెప్పారు. ముఖ్యమైన కార్యక్రమాలన్నింటికీ తమకు ఆహ్వానం వచ్చేదన్న దీప.. తన తండ్రి మరణించినప్పుడు మేనత్త వచ్చి ఓదార్చారని.. తర్వాత తమ కుటుంబానికి.. మేనత్త కుటుంబానికి సంబంధాలు తెగిపోయాయన్నారు.

1997లో జైలుకు వెళ్లిన సమంయలో తాను జైలుకు వెళ్లి పరామర్శించానని.. ఆ సందర్భంగా తన మేనత్త తనతో.. ‘‘నువ్వు చిన్నపిల్లవి. ఇక్కడకు రావొద్దు. నేను బయటకు వచ్చాక కలుద్దాం’’ అని చెప్పారని.. ఆమె విడుదలయ్యాక పోయెస్ గార్డెన్ కు వెళ్లినా కలవలేదన్నారు. పోయెస్ గార్డెన్ కు వెళ్లినప్పుడు గార్డులు తనన బలవంతంగా బయటకు పంపేవారని.. ఈ సందర్భంగా చాలా అవమానాలు పొందినట్లుగా వెల్లడించారు. 2002లో రెండోసారి ముఖ్యమంత్రి అయినప్పుడు కలిశానని.. కుటుంబాన్ని ఎందుకు దూరంగా ఉంచావని నిలదీశానని.. ఆ సమయంలో మేనత్త తనతో ఐదారు గంటలు ఉన్నట్లు వెల్లడించారు. తానో ముఖ్యమైన కార్యక్రమానికి వెళ్లాల్సి ఉందని.. తర్వాత కలుద్దామని చెప్పారని.. ఆ తర్వాత ఆమె మళ్లీ కలవలేదని వాపోయారు.

దీప ఇంటర్వ్యూ ఇలా ఉంటే.. హైదరాబాద్ లో అమ్మ ఆస్తులకు సంబంధించి ఆసక్తికర పరిణామం ఒకటి చోటు చేసుకుంది. హైదరాబాద్ లో ఉన్న జయలలిత ఆస్తులను ప్రభుత్వఆస్తులుగా ప్రకటించాలని కోరుతూ హైకోర్టులో ప్రజాహిత వాజ్యం ఒకటి దాఖలైంది. హిందూ వారసత్వ చట్టం 1956ప్రకారం.. జయ ఆస్తులను ప్రభుత్వ ఆస్తులుగా ప్రకటించాలని కోరుతూ.. గరీబ్ గైడ్ స్వచ్ఛంద సంస్థ పిటీషన్ దాఖలు చేసింది. ఈ ఆస్తుల్లో ఆమె బంధువులు.. స్నేహితులు జోక్యం చేసుకోకుండా ఉండేలా ఆదేశాలు ఇవ్వాలని పిటీషినర్ పేర్కొనటం గమనార్హం. ఈ పిటీషన్ లో ప్రతివాదులుగా కేంద్ర హోం.. ఆర్థిక మంత్రిత్వ శాఖల కార్యదర్శులు.. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి.. హైదరాబాద్ జిల్లా కలెక్టర్.. జయలలిత నెచ్చెలి శశికళలను చేర్చారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/