Begin typing your search above and press return to search.

దీప 'పడవ' ప్రయాణం ఎలా సాగుతుందో?

By:  Tupaki Desk   |   28 March 2017 7:14 AM GMT
దీప పడవ ప్రయాణం ఎలా సాగుతుందో?
X
అమ్మ జయలలిత మరణంతో ఖాళీ అయిన ఆర్కే నగర్‌ కు ఏప్రిల్ 12న ఉప ఎన్నిక జరగనుండడం తెలిసిందే... ఇక్కడ భారీ సంఖ్యలో అభ్యర్థులు బరిలో నిలవడంతో ఫలితం ఎలా ఉంటుందో చూడాలి. మొత్తం 62 మంది బరిలో నిలిచారు. 62 మంది వరకు అభ్యర్థులు ఉంటే ఈవీఎం వాడే అవకాశం ఉండడంతో ఇక్కడ బ్యాలట్ వాడాల్సిన అవసరం తప్పింది. కాగా జయలలిత పార్టీ అన్నాడీఎంకేలో వర్గపోరు నేపథ్యంలో ఎన్నికల సంఘం రెండు వర్గాల్లో ఎవరికీ అన్నాడీఎంకే గుర్తు ‘రెండు ఆకులు’ కేటాయించకపోవడంతో అమ్మ గుర్తులు ఉన్నా, ఆమె పార్టీ గుర్తు లేకుండానే ఇక్కడ ఎన్నిక జరగనుంది.

నిజానికి మొత్తం 70 నామినేషన్లు దాఖలైనా సోమవారం తుది రోజున ఎనిమిదిమంది స్వతంత్ర అభ్యర్థులు ఉపసంహరించుకోవడంతో 62 మందే బరిలో మిగిలారు. వీరిలో ఆరుగురు అభ్యర్థులు ప్రధాన పార్టీలకు చెందిన వారు కాగా, మిగిలిన వారంతా ఇండిపెండెంట్లు కావడం గమనార్హం.

కాగా ఇక్కడ జయ మేనకోడలు దీప బరిలో దిగారు. తాను స్థాపించిన 'ఎంజీఆర్‌ అమ్మా దీప పేరవై' తరుపున ఆర్కేనగర్ నుంచి ఆమె పోటీ చేస్తున్నారు. ఎన్నికల కమిషన్ ఆమెకు పడవ గుర్తు కేటాయించింది. అన్నాడీఎంకె ప్రధాన కార్యదర్శి చిన్నమ్మ శశికళ వర్గానికి ఈ ఎన్నికల్లో ఎన్నికల కమిషన్ టోపీ గుర్తును కేటాయించారు. పన్నీర్ సెల్వం వర్గానికి విద్యుత్ స్తంభాల గుర్తు ఇచ్చారు. ఈ మూడు గుర్తుల్లో ఏది జనంలోకి బలంగా వెళ్లగలుగుతుందన్న దానిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. దీప అత్త సెంటిమెంటు పండితే గెలిచే ఛాన్సుంటుందని భావిస్తున్నారు. అదేసమయంలో అమ్మకు అనుంగు అనుచరుడైన పన్నీర్ సెల్వంపై సింపథీతో ఆయన వర్గం అభ్యర్థిని గెలిపిస్తారో చూడాలి.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/