Begin typing your search above and press return to search.

కొత్త జిల్లాలలో వికేంద్రీకరణ మంత్రం...?

By:  Tupaki Desk   |   5 Feb 2022 5:30 PM GMT
కొత్త జిల్లాలలో వికేంద్రీకరణ మంత్రం...?
X
కొత్త జిల్లాలు ఏపీలో మరో పదమూడు ఏర్పాటు అయ్యాయి. వాటికి సంబంధించి నోటిఫికేషన్ ప్రకటించిన తరువాత నుంచి ఎక్కడ చూసినా మంటలే రాజుకుంటున్నాయి. ప్రజల ఆకాంక్ష అలాంటిది. ఒక విధంగా తేనె తుట్టెను ప్రభుత్వం కదిపింది అనుకోవాలి. ప్రతీ నియోజకవర్గం కూడా మాకే జిల్లా కావాలని డిమాండ్ చేస్తూ వస్తోంది. దాంతో ఒక్క లెక్కన ఆందోళనలు చోటు చేసుకుంటున్నాయి.

అనంతపురం జిల్లాలోని హిందూపురాన్ని కొత్త జిల్లాగా ప్రకటించమని సినీ నటుడు, ఎమ్మెల్యే బాలక్రిష్ణ ఆందోళన బాట పట్టారు. జిల్లా చేయకపోయారో ఊరుకోమని కూడా వైసీపీ పెద్దలను హెచ్చరించారు. ఇక రాయలసీమ‌ను చూస్తే పద్నాలుగు జిల్లాలుగా చేయమని అక్కడ నేతలు డిమాండ్ చేస్తున్నారు. గోదావరి జిల్లాల విషయానికి వస్తే రెండు కాస్తా ఆరు అయినా కూడా ఎవరికీ సంతృప్తి లేదు. దాంతో మరిన్ని డిమాండ్లు వచ్చి పడుతున్నాయి.

ఇంకో వైపు కొందరు నేతల పేరు మీద జిల్లాలను ఏర్పాటు చేయాలని కూడా కోరుతున్నారు. ఇదిలా ఉంటే కొత్త జిల్లా విషయంలో ప్రభుత్వం కూడా సరికొత్త ఆలోచనలు చేస్తోంది అంటున్నారు. అదెలా అంటే ప్రభుత్వ ఆఫీసులను వికేంద్రీకరించడం ద్వారా చాలా వరకూ ఈ సమస్యలను అధిగమించగలమని భావిస్తోంది.

ఇంతకు ముందు అయితే జిల్లా కలెక్టర్ ఆఫీస్ తో పాటు ఎస్పీ ఆఫీస్, ముఖ్య‌మైన భవనాలు అన్నీ కూడా జిల్లా కేంద్రంలోనే ఉండేవి. అయితే ఇపుడు వైసీపీ సర్కార్ ఆ పద్ధతిని మార్చాలనుకుంటోంది. దీని వల్ల తమ ప్రాంతానికి ఏమి వచ్చిందని ఆలోచించేవారికి కూడా ఆనందం కలుగుతుంది, అభివృద్ధి కనిపిస్తుంది అని అంటున్నారు.

ఇక మీదట కలెక్టర్ ఆఫీస్ ని ఒక చోట ఉంచితే మరో చోట ఎస్పీ ఆఫీస్ ని ఉంచుతారు. అలాగే ఆ జిల్లాలో పారిశ్రామిక అవకాశాలు ఉన్న చోట ఆయా కార్యాలయాలు ఏర్పాటు చేస్తారు. అనకాపల్లి జిల్లా విషయమే తీసుకుంటే అనకాపల్లిలో కేవలం కలెక్టర్ ఆఫీసే ఉండబోతోందిట.

తమకూ జిల్లా కావాలని ఆందోళన చేస్తున్న నర్శీపట్నంలో ఎస్పీ ఆఫీస్ పెడతారు. అదే విధంగా వ్యవసాయశాఖ, నీటిపారుదలశాఖ, ఉద్యానవనశాఖ, అటవీశాఖ సహా ఆ ప్రాంత ప్రత్యేకతలకు తగినట్లు నర్సీపట్నంలో జిల్లా కార్యాలయాల ఏర్పాటుకున్న అవకాశాలను అధికారులు పరిశీలిస్తున్నట్లు సమాచారం ఉంది.

ఇలా వికేంద్రీకరించాలనుకొవడం వెనక మరో ఆలోచన కూడా ఉందని అంటున్నారు. వేర్వేరు చోట్ల ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేయడం ద్వారా కార్యాలయాలకు భవనాల సమస్య ఏర్పడదన్న కోణం నుంచి ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలిసింది. ఈ విధానం ద్వారా ప్రతీ నియోజక‌వర్గంలో ఒక జిల్లా ఆఫీస్ అయినా ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లుగా చెబుతున్నారు.

మొత్తానికి మూడు రాజధానులు మూడు ప్రాంతాలకు అనుగుణంగా పాలన వికేంద్రీకరణ అన్న వైసీపీ ప్రభుత్వం దాని కంటే ముందు జిల్లాల స్థాయిలలో వికేంద్రీకరణ మంత్రాన్ని ఎంచుకుంటోంది అని అంటున్నారు. చూడాలి మరి ఇది ఎంతవరకూ ఫలిస్తుందో.