Begin typing your search above and press return to search.

డిసెంబ‌ర్ 11..గ‌ల్లీ..ఢిల్లీ హీటెక్కే రోజు

By:  Tupaki Desk   |   8 Dec 2018 9:38 AM GMT
డిసెంబ‌ర్ 11..గ‌ల్లీ..ఢిల్లీ హీటెక్కే రోజు
X
ఢిసెంబ‌ర్ 11...మ‌రో మూడ్రోజులే స‌మ‌యం. ఈ తేదీ కేవ‌లం తెలంగాణ‌లోని ఎన్నిక‌ల ఫ‌లితాల‌ను వెల్ల‌డించేది మాత్ర‌మే కాదు. గ‌ల్లీని ఢిల్లీని హీటెక్కించేది కూడా. ఎందుకంటే, అదే రోజు పార్లమెంట్ సమావేశాలు ఓ వైపు..మరోవైపు ఎన్నికల ఫలితాలు..ఒకవైపు రగడ..మరోవైపు ఉత్కంఠ...ఈ పరిస్థితి డిసెంబర్ 11న ఎదురుకానుంది. రాబోయే పార్ల‌మెంటు ఎన్నిక‌ల‌కు సెమీఫైన‌ల్స్‌ గా భావిస్తున్న ఈ ఫ‌లితాల‌ను అన్నిపార్టీలు ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకొని ముందుకు సాగుతున్న త‌రుణంలో మ‌రోవైపు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానుండ‌టంతో అంద‌రి దృష్టి డిసెంబ‌ర్ 11పై ప‌డింది.

తెలంగాణ - రాజస్థాన్ - మధ్యప్రదేశ్ - ఛత్తీస్‌ గఢ్ - మిజోరాం ఎన్నికల ఫలితాలు డిసెంబర్ 11న విడుదల కానున్న సంగతి తెలిసిందే. మోడీ ప్రభుత్వానికి ఈ ఎన్నికలు సెమీఫైనల్ గా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. బీజేపీ ఈసారి ఎన్నికలో గెలిస్తే ఆ ప్రభావం వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా ఉంటుందని అంచనా. కానీ ఎగ్జిట్ పోల్స్ మాత్రం ప్రధాన పార్టీల మధ్య టఫ్ వార్ పేర్కొంటుండగ మరికొన్ని మాత్రం కాషాయ దళం గెలుస్తుందని చెబుతున్నాయి. అయితే, ఈ ఫ‌లితాల రోజే పార్ల‌మెంటు స‌మావేశాలు మొద‌ల‌వుతుండ‌టంతో ఖ‌చ్చితంగా స‌భ‌పై ఈ ఫలితాల ప్ర‌భావం ఉంటుంద‌ని అంచ‌నా వేస్తున్నారు.

డిసెంబర్ 11న ప్రారంభమయ్యే ఈ సమావేశాలు జనవరి 10 వరకు జరుగనున్నాయని సమాచారం. మొత్తంగా పార్లమెంట్ సమావేశాల్లో 20 పనిదినాలు ఉండనున్నాయని తెలుస్తోంది. 2019లో సార్వత్రిక ఎన్నికలు ఉండటంతో బీజేపీ ప్రభుత్వం నిర్వహించే పూర్తి స్థాయి పార్లమెంట్ సమావేశం ఇదే కానుంది. ఈసారి కీలక బిల్లుల మీద ఆర్డినెన్స్‌ లు తేవాలని మోడీ ప్రభుత్వం యోచిస్తోందని..అందులో ట్రిపుల్ తలాక్ బిల్లు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. సమావేశాల్లో ప్రభుత్వాన్ని కడిగిపారేయాలని విపక్షాలు వ్యూహ రచన చేస్తున్నాయి. ఇదిలాఉండ‌గా - రాజ్యసభ ఛైర్మన్ - ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు డిసెంబర్ 10న అఖిల‌ప‌క్ష స‌మావేశం ఏర్పాటు చేశారు. లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ 11వ తేదీ ఆల్ పార్టీ మీటింగ్ ఏర్పాటు చేశారు. సమావేశాలు సజావుగా సాగేందుకు సభ్యులంతా సహకరించాలని కోరనున్నారు.