Begin typing your search above and press return to search.

అప్పుల ఆంధ్రప్రదేశ్.. చెప్పింది కేంద్ర గణాంకాలు!

By:  Tupaki Desk   |   16 March 2023 10:04 AM GMT
అప్పుల ఆంధ్రప్రదేశ్.. చెప్పింది కేంద్ర గణాంకాలు!
X
వెలిగిపోతున్నాం.. వెలిగిపోతున్నాం.. అనుకుంటే సరిపోదు కదా. నిజంగానే ఆ మాటలకు తగ్గ వెలుగు ఉండాలి కదా? కొవ్వొత్తి తనకు తాను తోపుగా భావిస్తే ఏమవుతుంది? అలానే తాము చేపట్టిన డెవలప్ మెంట్ నమూనా గురించి పాలకులు డబ్బా కొట్టుకుంటే వినేందుకు బాగానే ఉన్నా.. గణాంకాల్లో మార్పు అయితే ఉండదు కదా? ఇప్పుడు అలాంటి పరిస్థితే ఏపీలోనూ నెలకొంది. కేంద్రం విడుదల చేసిన గణాంకాల ప్రకారం చూస్తే.. దేశంలో మరే రాష్ట్రంలో లేనంతగా ఏపీ ప్రజలు అప్పుల్లో మునిగిపోయారు.

ఏపీలోని ప్రజల్లో 18 ఏళ్లకు పైబడిన ప్రతి లక్ష మందిలో 46,330 మంది సంస్థాగతంగానో.. వ్యక్తుల ద్వారానో అప్పు తీసుకున్న కొత్త విషయం బయటకు వచ్చింది. తాజాగా విడుదలైన 78వ జాతీయ నమూనా సర్వే ఈ షాకింగ్ నిజాన్ని బయటకు తీసుకొచ్చింది. దేశవ్యాప్తంగా 8469 గ్రామీణ.. 5797 పట్టణ ప్రాంతాల్లోని 2.76 లక్షల మంది నుంచి సేకరించిన వివరాల్ని మదింపు చేయగా.. షాకింగ్ అంశాలు వెలుగు చూశాయి.

దేశంలో మరే రాష్ట్రంలోనూ లేని రీతిలో ఏపీలో ఉన్నట్లుగా అప్పుల్లో ప్రజలు మరే రాష్ట్రంలో లేరన్న విషయం బయటకు వచ్చింది. అప్పుల విషయంలో ఏపీ మొదటి స్థానంలో నిలిస్తే.. తెలంగాణ రాష్ట్రం రెండో స్థానంలో నిలిచింది.

తెలంగాణలో ప్రతి లక్ష మందిలో 39,358 మంది ఏదో ఒకరకంగా అప్పులు చేసినట్లుగా వెల్లడైంది. కాకుంటే ఏపీతో పోలిస్తే తెలంగాణలో పరిస్థితి కాస్త మెరుగ్గా ఉన్నట్లే. కాకుంటే.. దేశ వ్యాప్తంగా చూస్తే.. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు అప్పుల్లో మునిగిపోవటం ఆందోళన కలిగించే అంశమే.

అప్పుల విషయంలో దక్షిణాదిలో ఏపీ తర్వాత తెలంగాణ.. ఆ రాష్ట్రాల తర్వాత కేరళ.. తమిళనాడు రాష్ట్రాలు నిలిచాయి. ఇక.. ఏపీ ప్రజల అప్పుల భాగోతానికి సంబంధించి మరింత లోతుగా వెళితే.. ఏపీలోని పురుషులతో పోలిస్తే మహిళలు అప్పుల్లో ముందున్నారు. ప్రతి లక్ష మందిలో 51 శాతం మహిళలు.. 46 శాతం పురుషులు అప్పుల్లో ఉన్నారు. పట్టణాల్లో 35 వాతం మహిళలు.. 45 శాతం పురుషులు రుణ భారంలో ఉన్నారు.

ఏపీతో పోలిస్తే తెలంగాణలో పరిస్థితి భిన్నంగా ఉంది. ఇక్కడ మహిళలతో పోలిస్తే పురుషులే అప్పుల భారంలో ఉన్నారు. దేశంలో పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ లో మహిళలు అతి తక్కువ సంఖ్యలో అప్పు తీసుకోవటం గమనార్హం.

అక్కడి గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి లక్ష మంది మహిళల్లో 1791 మంది మాత్రమే అప్పు తీసుకోగా.. పట్టణ ప్రాంతాల్లో 1186 మంది మాత్రమే అప్పు తీసుకోవటం చేసినట్లుగా తెలుస్తోంది. ఏమైనా అప్పుల భారం ఇంత భారీగా ఉన్న వేళ.. ఏపీ ప్రజలు తమ గురించి తాము కాస్తంత ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందన్నది మర్చిపోకూడదు


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.