Begin typing your search above and press return to search.

ప్రభుత్వాల మధ్యలో నలుగుతున్న ఢిల్లీ పోలీసులు

By:  Tupaki Desk   |   2 March 2020 10:30 AM GMT
ప్రభుత్వాల మధ్యలో నలుగుతున్న ఢిల్లీ పోలీసులు
X
కేంద్ర పాలిత ప్రాంతంగా ఉన్న ఢిల్లీలో శాంతిభద్రతల పరిరక్షణ కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంటుంది. కానీ ఢిల్లీకి అసెంబ్లీ కూడా ఉన్న కేంద్ర పాలిత ప్రాంతం. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం రెండు ఢిల్లీ కేంద్రంగా సాగుతాయి. అయితే ఈ రెండు ప్రభుత్వాలు ఒకే ప్రాంతంలో ఉండడంతో తరచూ వివాదాలు, విబేధాలు తలెత్తుతున్నాయి. తాజాగా ఢిల్లీలో జరిగిన పరిణామాలను ఢిల్లీ ప్రభుత్వం కేంద్ర తీరును ఎండగట్టింది. కేంద్ర బలగాలు పంపాలని ఏకంగా ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కోరాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే శాంతిభద్రతలు కేంద్ర పరిధిలోనే ఉంటాయి.

ఇటీవల ఢిల్లీలో నాలుగు రోజుల పాటు చెలరేగిన అల్లర్లలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. దాదాపు 40 మంది దాక చనిపోవడం కలకలం రేగింది. ప్రజల, ప్రభుత్వ ఆస్తులకు భారీగా నష్టం వాటిల్లింది. అయితే ఇక్కడ అల్లర్లు చెలరేగడానికి కారణం పోలీసుల వైఖరే కారణమని సర్వత్రా చర్చ సాగుతోంది. ఎందుకంటే అల్లర్లు మొదలైనప్పుడు వెంటనే చర్యలు తీసుకుని ఉంటే ఇంత పరిణామాలు చోటుచేసుకుని ఉండేవి కాదని అందరూ పేర్కొంటున్నారు. ఆ సమయం లో ఢిల్లీలో అమెరికా అధ్యక్షుడు డొనల్డ్ ట్రంప్ పర్యటిస్తున్నారు. ఆ సమయంలో కేంద్ర ప్రభుత్వం ట్రంప్ పర్యటనలో నిమగ్నమైంది. ట్రంప్ పర్యటన సందర్భంగా పకడ్బందీ బందోబస్తు ఏర్పాటుచేసినా ఆ సమయంలోనే అల్లర్లు చెలరేగడం తో అంతర్జాతీయం గా చర్చనీయాంశమైంది. దీనిపై ట్రంప్ కూడా స్పందించాల్సి ఉండగా నోరు కట్టేసుకుని అది అంతర్గత విషయం... ప్రధాని మోదీతో చర్చకు రాలేదు అని ప్రకటించారు.

అయితే ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నప్పుడు వెంటనే స్పందించాల్సిన ఢిల్లీ పోలీసులు ఆదేశాలు రాక మిన్నకున్నట్లు చెబుతున్నారు. దిల్లీ పోలీసులు నిరసనకారులపై ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. రాజకీయ జోక్యంతో స్పందించే ఢిల్లీ పోలీసులు ఆందోళన సమయంలో చేతకాకుండా నిల్చున్నారు. అన్నిటికీ పూర్తిగా నాయకుల ఆదేశాలపై ఆధారపడిన దిల్లీ పోలీసులకు ఇటీవల హింస సమయంలో ఏం చేయాలో అర్థం కాలేదు. దిల్లీ పోలీసుల పనితీరులో రాజకీయ జోక్యం చాలా ఉందని తెలుస్తోంది. కొన్ని రోజులుగా దిల్లీ పోలీసుల పగ్గాలు మొత్తం నార్త్ బ్లాక్ తన చేతుల్లో ఉంచుకున్నట్టు అనిపిస్తోంది. కీలక నిర్ణయాలన్నీ హోంమంత్రి అమిత్ షా స్వయంగా తీసుకుంటున్నారు.

ఈ జోక్యంతోనే సరైన నిర్ణయాలు తీసుకోలేక పోతున్నారని సర్వత్రా మాట్లాడుకుంటున్నారు. పోలీస్ వ్యవస్థను ఈ విధంగా రాజకీయాలు వాడుకుంటుండడంతో చివరకు ప్రజలు, పోలీసులు బలవ్వాల్సిన పరిస్థితులు ఏర్పడడం సిగ్గుచేటు. ఈ విధంగా ఢిల్లీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం వైఖరి వలన ఢిల్లీ పోలీసులు చిక్కుకున్నారు. కేంద్రం తీసుకున్న నిర్ణయాలతో రాష్ట్ర ప్రభుత్వం చిక్కుల్లో పడుతోంది. కేవలం శాసనపరమైన అధికారులు ఉన్నా ఢిల్లీని కేంద్ర ప్రభుత్వం పోలీసు శాఖతో ఆడించాలని చూస్తోంది. ఆ విధంగానే గతంలో.. ప్రస్తుతం పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఏది ఏమున్నా ఢిల్లీ పోలీసులు ఇరు ప్రభుత్వాల మధ్య నలిగిపోతూ తీవ్ర విమర్శల పాలవుతున్నారు.