Begin typing your search above and press return to search.

రజనీ.. రాజకీయ రచ్చ లేపాడుగా!

By:  Tupaki Desk   |   26 Jan 2020 6:41 AM GMT
రజనీ.. రాజకీయ రచ్చ లేపాడుగా!
X
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాల్లో చాలా అగ్రెసివ్‌ గా ఉండే పాత్రలు చేస్తారు కానీ.. సాధారణ జీవితంలో ఆయన చాలా మెతక. ఎవరినీ విమర్శించడు. ఘాటైన వ్యాఖ్యలు చేయడు. రాజకీయాల్లోకి రాబోతున్నట్లు ప్రకటన చేశాక కూడా ఆయన ఇదే ఒరవడి కొనసాగిస్తూ వచ్చారు. కానీ త్వరలోనే పార్టీని మొదలుపెట్టబోతున్న ఆయన.. వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో వ్యక్తిగా మారిపోయారు. ఆయన వ్యాఖ్యలతో తమిళనాట రాజకీయంగా పెద్ద దుమారమే రేగింది. రజనీకాంత్‌ ఇటీవల జరిగిన ఒక కార్యక్రమంలో ద్రవిడులు అభిమానించే పెరియార్‌ గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వారి ఆగ్రహానికి గురయ్యారు. 1971లో పెరియార్‌ ఆధ్వర్యంలో మూఢ నమ్మకాలకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళన ర్యాలీలో ఆయన హిందూ దేవుళ్ల చిత్ర పటాలను అవమానించేలా ప్రవర్తించారన్న విషయాన్ని రజనీ ప్రస్తావించారు. ఈ వ్యాఖ్యలతో వివాదం రాజుకుంది.

పెరియార్‌ ను ఆరాధించేవాళ్లు, ఆయన స్ఫూర్తితో రాజకీయ పార్టీలు పెట్టి నడుపుతున్న వాళ్లు రజనీపై మండి పడుతున్నారు. ఆయనపై పలు ప్రాంతాల్లో కేసులు నమోదవుతున్నాయి. తన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాలన్న డిమాండ్‌కు రజనీకాంత్‌ తలొగ్గలేదు. పత్రికల్లో చదివిందీ - విన్నదే తాను చెప్పానని.. కాబట్టి తాను క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదని రజనీ తేల్చి చెప్పారు. దీంతో రజనీకి వ్యతిరేకంగా ఆందోళన ఉద్ధృతమవుతోంది. తాజాగా రజనీకాంత్‌‌ను హత్య చేస్తామంటూ బెదిరింపులు కూడా వస్తున్నాయట. దీనిపై రజనీ వర్గానికి చెందిన కిషోర్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రజనీకాంత్‌ ను ప్రాణాలతో ఉండనివ్వమంటూ ఇటీవల జరిగిన ఓ ఆందోళన కార్యక్రమంలో హెచ్చరికలు జారీ చేయడాన్ని ప్రస్తావిస్తూ అతను పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఈ గొడవ పెద్దదవుతుండటంతో రజనీకి భద్రత కూడా పెంచారు.