Begin typing your search above and press return to search.

కామంధుడు రఫీకి ఉరి.. ఇంకేన్నాళ్లకు?

By:  Tupaki Desk   |   25 Feb 2020 9:44 AM GMT
కామంధుడు రఫీకి ఉరి.. ఇంకేన్నాళ్లకు?
X
మానవత్వాన్ని మరిచి మానవ మృగాళ్లలాగా ప్రవర్తించే కామంధులను ఉరి తీయడంలో ప్రభుత్వాలు ఎందుకు మీనమేషాలు లెక్కిస్తున్నాయో అర్థం కావడం లేదన్న ఆవేదన బాధితుల్లో వ్యక్తమవుతోంది. కామంధులను పోలీసులు పట్టుకొని కోర్టులో దోషులుగా నిరూపించి ఉరి శిక్ష పడేలా పోరాడినా అంతిమంగా ఫలితం లేకుండా పోతుంది. న్యాయస్థానాలు కామంధులకు ఉరిశిక్ష విధించినప్పటికీ వాటిని అమలు చేయడంలో నిబంధనలు అడ్గువస్తున్నాయి..

‘వందమంది దోషులు తప్పించుకున్నా పర్వాలేదుగానీ.. ఒక నిర్దోషికి మాత్రం శిక్ష పడకూడదు’ ఇది భారత శిక్షాస్మృతి ప్రాథమిక లక్ష్యం. ఇదే కామంధుల పాలిట వరంలా మారుతోంది. చట్టంలోని అన్ని లోసుగులను ఉపయోగించుకుంటూ శిక్ష నుంచి తప్పించుకోవాలని చూస్తున్నారు. ఇలాంటి వాళ్లందరికీ ‘నిర్భయ’ కేసు నిందితులు రోల్ మోడల్ గా నిలుస్తున్నారు.

నిర్భయ కేసులో నిందుతులకు ఉరి శిక్ష పడి ఆరేళ్లు గడిచిపోయాయి. నేటికి వారికి శిక్ష అమలు కాలేదు. ఇటీవల నిర్భయ తల్లి ఇంకెన్నాళ్లు న్యాయం కోసం కోర్టుల చుట్టూ తిరగాలంటూ కన్నీటి పర్యంతమైంది. దోషులకు ప్రాణం కాపాడుకునేందుకు అన్ని అవకాశాలిచ్చే న్యాయస్థానాలు బాధితులకు ఎందుకు న్యాయం చేయడం లేదని ప్రశ్నిస్తున్నారు. నిర్భయ కేసులో నిందితులకు ఉరి శిక్షను కోర్టు విధించినప్పటికీ దానిని అమలు చేయలేకపోతోంది. నిర్భయ దోషులు కోర్టును సైతం తప్పుదోవ పట్టిస్తూ శిక్ష నుంచి తప్పించుకోవాలని చూస్తున్నారు. రాష్ట్రపతి క్షమాభిక్ష, ఆరోగ్య సమస్యలు, ఒకరికి తర్వాత ఒకరి పిటిషన్లు వేస్తూ ఉరిశిక్ష అమలును వీలైనంత కాలం పొడగించుకుంటూ పోతున్నారు.

నిర్భయ నిందితులు చట్టం నుంచి దోషులు ఎలా తప్పించుకోవాలని నేర్పుతున్నారా అనే సందేహం కలుగమానదు. ఇప్పటికే ఈ కేసులో దోషులు చట్టంలోని అన్ని అవకాశాలు ఉపయోగించుకున్నారు. ఇక ఉపయోగించుకునే అవకాశాలు కూడా లేకపోవడంతో త్వరలోనే నిర్భయ దోషులకు ఉరి పడుతుందని చెబుతున్నారు.

*కామంధుడు రఫీ ఉరి శిక్ష అమలు ఎన్నడు..
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన కామంధుడు రఫీ ఉరి కేసు కూడా నిర్భయ కేసు మాదిరిగా అవుతుందా? అనే ప్రశ్న తలెత్తుతోంది. చిత్తూరు జిల్లాలో ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసి హత్యచేసిన సంఘటన సంచలనం సృష్టించింది. ఈ కేసులోని మహ్మద్ రఫీకి కోర్టు చిత్తూరు జిల్లా కోర్టు ఉరి శిక్ష విధించింది. ఆంధ్రప్రదేశ్ లో ఫోక్సో యాక్ట్ కింద కామంధుడికి విధించిన తొలి ఉరి శిక్ష ఇదే. అయితే ఈ ఉరి శిక్షను హైకోర్టు ఆమోదించాల్సి ఉంది. నిర్భయ కేసులో దోషులకు ఆరేళ్లయిన ఉరి శిక్ష అమలుకాక బాధితులు ఇంకా కోర్టు చుట్టూ తిరుగుతున్నారు. ఒకవేళ రఫీ కేసులో హైకోర్టు ఉరి శిక్షను ఆమోదించిందినప్పటికీ ఈ కామంధుడికి తప్పించుకోవడానికి బోలెడన్నీ అవకాశాలు ఉన్నాయి.

సుప్రీం కోర్టు, రాష్ట్రపతి క్షమాభిక్ష, ఆరోగ్య సమస్యలు వంటి సాకుతో ఉరి అమలును పొడగించుకునే అవకాశం ఉంది. దీంతో కామంధుడు రఫీకి ఇప్పట్లో ఉరి శిక్ష అమలుకాకపోవచ్చనే సందేహాలు ఉన్నాయి. కామంధుల విషయంలో తక్షణ న్యాయం జరిగితే ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయి. కానీ దోషులుగా తేలిన తర్వాత కూడా సంవత్సరాల కొద్ది జైల్లో వీఐపీలా పోషించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వాలు దోషులు తప్పించుకోకుండా కఠిన చట్టాలు తీసుకోవాలని అవసరం ఎంతైనా ఉందని అంటున్నారు.