Begin typing your search above and press return to search.

సరదాగా చేసిన ఫ్రాంక్ లో ముగ్గురు కుర్రాళ్ల మరణం.. దోషిగా తేలిన ఎన్ ఆర్ఐ

By:  Tupaki Desk   |   1 May 2023 11:17 AM GMT
సరదాగా చేసిన ఫ్రాంక్ లో ముగ్గురు కుర్రాళ్ల మరణం.. దోషిగా తేలిన ఎన్ ఆర్ఐ
X
ఒక చిలిపి చేష్ట మూడు ప్రాణాలు పోయేలా చేస్తే.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. కోలుకోవటానికి నెలల టైం పట్టింది. దాదాపు మూడేళ్లకు పైనే జరిగిన ఈ విషాద ఉదంతానికి సంబంధించిన కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత సంతతి వ్యక్తిని న్యాయస్థానం దోషిగా తేల్చింది. అమెరికాలోని కాలిఫోర్నియాలో చోటు చేసుకున్న ఉదంతానికి సంబంధించి న్యాయస్థానం తీర్పు సంచలనంగా మారింది.

2020 జనవరి 19న కాలిఫోర్నియాలోని రివర్ సైడ్ కౌంటీలో భారత సంతతికి చెందిన అనురాగ్ చంద్ర ఇంట్లో ఉన్నాడు. రాత్రి వేళలో కొందరు టీనేజర్లు అతడి ఇంటి డోర్ బెల్ మోగించి ఆటపట్టించారు. ఆ సమయానికే అనురాగ్ చంద్ర 12బీర్లు తాగి మత్తులో ఉన్నాడు.

తనను ఆట పట్టించేందుకు చేసిన ఆ టీనేజ్ కుర్రాళ్ల చర్యతో సీరియస్ అయ్యాడు. ఇంటి బెల్ కొట్టి.. ఆ తర్వాత కారులో వెళ్లిపోతున్న వారి తీరుపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ.. తన కారుతో వారిని పట్టుకునే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో అతను గంటకు 159కిమీ వేగంతో కారును నడిపాడు.

ఈ క్రమంలో అతడి కారు ఆటపట్టించటానికి డోర్ బెల్ కొట్టిన కుర్రాళ్లు ఉన్న కారును బలంగా ఢీ కొట్టింది. ఈ ఉదంతంలో ముగ్గురు టీనేజర్లు (సుమారు పదహారేళ్ల వయసు) ఘటనాస్థలంలోనే మరణించగా.. మరో ముగ్గురికి గాయాలయ్యాయి.

ఈ ఉదంతాన్ని కేసు నమోదు చేసిన పోలీసులు అరెస్టు చేశారు. అయితే.. తనను ఆట పట్టించటానికి కుర్రాళ్లు ప్రయత్నించిన సమయంలో తాను మత్తులో ఉన్నాని.. ఆ టైంలో ఇంట్లోని వారి భద్రత గురించి భయపడినట్లుగా పేర్కొన్నారు.

డోర్ బెల్ కొట్టి.. తన వెన్ను చరచి కారులో పారిపోయిన వారిని పట్టుకునే ప్రయత్నం చేశానని.. మద్యం మత్తులో ఉన్న కారణంగా అసలేం జరిగిందో తనకు గుర్తు లేదన్నారు. కుర్రాళ్లు ప్రయాణిస్తున్న కారును ఒక్కసారిగా బ్రేక్ వేయటంతో తన కారు వారిని ఢీ కొట్టినట్లుగా పేర్కొన్నారు. దీంతో.. కారు చెట్టుకు ఢీ కొనటంతో ముగ్గురుకుర్రాళ్లు అక్కడికక్కడే మరణించారు.

ఈ కేసు విచారణ సందర్భంగా తాను ఏ తప్పు చేయలేదని అనురాగ్ చంద్ర తరఫు లాయర్లు వాదించారు. తన కారుతో వారి కారును ఢీ కొట్టాలన్న ఉద్దేశం తనకు లేదని పేర్కొన్నప్పటికీ కోర్టు అతడు చేసిన తప్పును చూపిస్తూ.. దోషిగా తేల్చింది.

ముగ్గురు యువకుల హత్యను తీవ్రంగా పరిగణిస్తున్నట్లుగా రివర్ సైడ్ కౌంటీ డిస్ట్రిక్ట్ అటార్నీ పేర్కొన్నారు. ఈ ఉదంతానికి ముందు అనురాగ్ చంద్ర మీద గృహ హింసకు సంబంధించి నేరారోపణలు ఉన్నాయి. దోషిగా తేలిన నేపథ్యంలో అతనికి పెరోల్ అవకాశం ఉండదని. .యావజ్జీవ కారాగార శిక్ష పడే అవకాశం ఉందంటున్నారు. జులై 14న శిక్షను విధిస్తారని చెబుతున్నారు.