Begin typing your search above and press return to search.

అందరు డెడ్ లైన్లు పెట్టేవారేనా ?

By:  Tupaki Desk   |   12 Nov 2021 7:30 AM GMT
అందరు డెడ్ లైన్లు పెట్టేవారేనా ?
X
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి డెడ్ లైన్లు పెట్టేవారు ఎక్కువైపోతున్నారు. మొన్నటికి మొన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఒక డెడ్ లైన్ పెట్టారు. తాజాగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి (?) నారా లోకేష్ డెడ్ లైన్ విధించారు. తామేంటి ? తమ స్ధాయి ఏమిటి ? ప్రభుత్వానికి డెడ్ లైన్ పెట్టేంత సీన్ తమకుందా అని కూడా చూసుకోవటంలేదు. నోటికొచ్చింది మాట్లాడేయటం, డెడ్ లైన్ పెడుతున్నట్లు బెదిరించేస్తున్నారంతే. ఎయిడెడ్ విద్యాసంస్ధల విషయంలో లోకేష్ ప్రభుత్వానికి డెడ్ లైన్ విధించారు.

ప్రధాన ప్రతిపక్ష నేత హోదాలో చంద్రబాబునాయుడు ప్రభుత్వానికి డెడ్ లైన్ పెడుతున్నట్లు బెదిరించినా అదో అర్ధముంది. మాజీ ముఖ్యమంత్రి కాబట్టి చంద్రబాబు డెడ్ లైన్ విధించారంటే ఏదోలే అనుకోవచ్చు. కానీ పవన్, లోకేష్ కూడా ప్రభుత్వానికి డెడ్ లైన్లు విధించటమే మరీ క్యామిడీగా ఉంది. జగన్ కు వ్యతిరేకంగా ఎవరేది మాట్లాడినా అచ్చేసేయటానికి మీడియా ఉంది కదాని వీళ్ళు రెచ్చిపోతున్నారు. నిజానికి ప్రభుత్వం చంద్రబాబు బెదిరింపులనే చాలా లైటుగా తీసుకుంటోంది. ఇక పవన్, లోకేష్ లను పట్టించుకుంటుందా ?

విశాఖస్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణపై పవన్ ప్రభుత్వానికి డెడ్ లైన్ పెడితే ఏమైంది ? ఏమీకాలేదు. పవన్ బెదిరింపులను ప్రభుత్వం అసలు లెక్కేచేయలేదు. పవన్ తనను తాను చాలా ఎక్కువగా ఊహించుకోవటంతోనే సమస్యంతా వస్తోంది. ఒకవైపేమో తాను వైసీపీని నమ్మేది లేదని చెబుతునే మరోవైపు డెడ్ లైన్ పెట్టడం ఏమిటో పవన్ కే తెలియాలి. ఏదో సినిమాలో డైలాగులకు జనాలు చప్పట్లు కొడుతున్నారు కదాని నిజజీవితంలో కూడా సినిమా డైలాగులే చెబితే ఎవరు పట్టించుకోరన్న విషయం పవన్ కు అర్ధం కావటంలేదు. తాను విధించిన డెడ్ లైన్ దాటిపోయినా పవన్ ఏమీ మాట్లాడలేదు.

అంతో ఇంతో అభిమానుల మద్దతున్న పవన్ పరిస్ధితే ప్రభుత్వం ముందు ఇలాగుంటే ఇక లోకేష్ పరిస్ధితి ఏమిటో చెప్పాల్సిన పనేలేదు. లోకేష్ నాయకత్వానికి పార్టీలోనే మద్దతు లేదు. టీడీపీని వదిలేసిన నేతలంతా చెప్పిన విషయం లోకేష్ వల్లే పార్టీ దెబ్బతినేసిందని. తన నాయకత్వ లక్షణాలను పెంచుకోవటంలో శ్రద్ధచూపాల్సిన చినబాబు ఏకంగా జగన్నే బెదిరిస్తున్నారు. వ్యవసాయ విద్యుత్ కు మీటర్లు బిగిస్తే ఉద్యమం చేస్తామన్నారు. తర్వాత ఏనాడైనా ఆ విషయాన్ని పట్టించుకున్నారా ?

ఒకటిరెండు కాదు చాలా విషయాల్లో లోకేష్ వ్యవహారం ఇలాగే ఉంటుంది. ఏదో నోటికొచ్చినట్లు మాట్లాడేసి తర్వాత అడ్రస్ లేకుండా పోతారు. తన హెచ్చరికలను ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవాలంటే ఏ అంశం మీదైనా పెట్టిన డెడ్ లైన్ కు లోకేష్ కూడా కట్టుబడుండాలి. చెప్పింది చేసి చూపాలి. ప్రైవేటు రంగంలోని ఎయిడెడ్ విద్యాసంస్ధలను ప్రభుత్వంలోకి విలీనం చేసేందుకు లేదని లోకేష్ హెచ్చరించారు. సదరు జీవోను ఉపసంహరించుకోవటానికి ప్రభుత్వానికి వారం రోజుల గడువిచ్చారు. మరి వారం తర్వాత ఏమి చేస్తారు ? తెలీదు. ప్రభుత్వమేమో వెనక్కు తగ్గేది లేదని తెగేసిచెప్పింది. మరి తర్వాత లోకేష్ ఏమి చేస్తారో చూడాలి.