Begin typing your search above and press return to search.

అంతిమ సంస్కారాలకు డబ్బుల్లేవని..మృతదేహాన్ని నదిలో పడేశారు !

By:  Tupaki Desk   |   1 July 2020 5:30 PM GMT
అంతిమ సంస్కారాలకు డబ్బుల్లేవని..మృతదేహాన్ని నదిలో పడేశారు !
X
అనారోగ్యంతో మరణించిన ఓ గిరిజన మహిళ మృతదేహానికి అంత్యక్రియలు జరిపేందుకు డబ్బుల్లేక ఆమె మృతదేహాన్ని నదిలో పడేసిన విషాద ఉదంతం మధ్యప్రదేశ్ రాష్ట్రంలో వెలుగుచూసింది. ఈ ఘటన పై పూర్తి వివరాలు చూస్తే .. భోపాల్ నగరానికి 672 కిలోమీటర్ల దూరంలోని సిధీ జిల్లాకు చెందిన ఓ గిరిజన మహిళ గత 30 రోజులుగా అనారోగ్యంతో బాధపడుతుండటంతో అంబులెన్సు కోసం పిలవగా రాలేదు. దీంతో గిరిజన మహిళను ఎడ్లబండిలో సిధీ జిల్లా కేంద్ర ఆసుపత్రికి తీసుకువచ్చారు. గిరిజన మహిళను పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె మరణించినట్లు చెప్పారు.

దీంతో మృతదేహాన్ని అంబులెన్సులో తీసుకువద్దామని మున్సిపల్ కార్పొరేషన్ అధికారులను సంప్రదిస్తే, ఆదివారం కాబట్టి అంబులెన్సు పంపించమని చెప్పడంతో ఎడ్లబండిపైనే మృతదేహాన్ని తిరిగి గ్రామానికి తీసుకువచ్చారు. దహన సంస్కారాలు చేసేందుకు డబ్బు లేదని కుటుంబసభ్యులు ఎడ్లబండిలో మహిళ మృతదేహాన్ని తీసుకువెళ్లి సోన్ నదిలోకి విసిరేశారు. మృతదేహాన్ని నదిలో విసిరేసిన వీడియో క్లిప్ సోమవారం సోషల్ మీడియాలో వైరల్ అయింది.

తన భార్య మృతదేహానికి దహన సంస్కారాలు చేసేందుకు తమ వద్ద డబ్బులేక సన్ నదిలో పడేశామని, కాని దీన్ని తాము వీడియో తీయ లేదని మృతురాలి భర్త మహేష్ కల్ చెప్పారు. దారిన పోయేవారెవరో మృతదేహాన్ని నదిలో పడేస్తుండగా వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారని, దీంతో కొందరు అధికారులు వచ్చి తనకు రూ.5వేల ఆర్థికసాయం చేశారని మహేష్ కల్ చెప్పారు. దహనసంస్కారాల కోసం డబ్బులేక మృతదేహాన్ని నదిలో పారేసిన ఘటన దురదృష్టకరమని సిధీ జిల్లా అదనపు మెజిస్ట్రేట్ డీపీ బార్మాన్ చెప్పారు. మృతదేహాల దహనం చేయడానికి ప్రభుత్వ పథకం ఉందని తెలియక వారు అలా చేసి ఉంటారని, ఈ ఘటనపై దర్యాప్తు చేస్తామని బార్మన్ చెప్పారు.