Begin typing your search above and press return to search.

ఆత్మహత్యల్లో ఇసుక దుమారం.. రెండు చానళ్ల గుట్టు బట్టబయలు

By:  Tupaki Desk   |   6 Nov 2019 5:51 PM GMT
ఆత్మహత్యల్లో ఇసుక దుమారం.. రెండు చానళ్ల గుట్టు బట్టబయలు
X
ఏపీలో ఇసుక రాజకీయం రోజు రోజుకూ కొత్త పుంతలు తొక్కుతోంది. ఇసుక దొరకడం లేదంటూ 2.5 కిలోమీటర్ల షార్ట్ డిస్టెన్స్‌లో లాంగ్ మార్చ్ ఒకరు చేస్తుంటే మరొకరు రాష్ట్రంలో ఎవరు చనిపోయినా ఇసుక దొరక్కే చనిపోయారంటూ రంగు పూస్తున్నారు. వారికి కొన్ని మీడియా చానళ్లూ తోడయ్యాయని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇసుక ఎందుకు దొరకడం లేదో కారణాలు తాము వివరంగా చెప్పామని.. ఇసుక దొరికే ఏర్పాట్లు కూడా చేస్తున్నామని.. అయినా, దుష్ప్రచారం చేస్తున్నారని వైసీసీ నేతలు అంటున్నారు. తాజాగా రెండు టీవీ చానళ్లు ఇసుక పై శవరాజకీయాలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. గుంటూరు జిల్లాలో ఓ వ్యక్తి మరణిస్తే ఆ కుటుంబానికి రూ. 5 లక్షలు ఇస్తామని ఆశ చూపించి ఇసుక దొరక్క చనిపోయాడని చెప్పాలని బలవంతం చేశారంటూ అందుకు ఆధారాలు బయటపెట్టారు.

గుంటూరు జిల్లా బాపట్ల మండలం భర్తిపూడి గ్రామానికి చెందిన 39 ఏళ్ల రమేష్ సోమవారం ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. కొంతకాలంగా రమేష్ ఫిట్స్‌తో బాధపడుతున్నాడు. హఠాత్తుగా ఎక్కడైనా ఫిట్స్‌తో పడిపోతూ ఉండేవాడు. ఆ బాధతో సోమవారం ఇంట్లో ఉరేసుకుని చనిపోయాడని ఆ ఊరివాళ్లు చెబుతున్నారు. అయితే.. రమేశ్ ఆత్మహత్య వార్త తెలియగానే రెండు టీవీ చానళ్ల ప్రతినిధులు అక్కడకు వెళ్లారట. ‘‘ఇసుక కొరత వల్ల పనులు దొరక్క ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పండి.. మీకు 5 లక్షల రూపాయాలు ఇస్తాం’’ అని ఆ మీడియా ప్రతినిధులు తమను అడిగారని రమేష్ సోదరుడు సురేష్ ఆరోపించారు.

డబ్బు అవసరం ఉండడంతో వారు చెప్పినట్లే చేశామని.. కానీ, వారు తమను ఇలా ప్రభుత్వంపై దుష్ప్రచారం చేయడానికి వాడుకున్నారని అర్థమై అసలు కారణాన్ని ఇప్పుడు చెబుతున్నామని సురేశ్ ఇతర టీవీ చానళ్లతో చెప్పడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. తన సోదరుడికి ఫిట్స్ వ్యాది ఉందని.. దాంతో ఇబ్బంది పడుతున్న ఆయన ఆత్మహత్య చేసుకున్నాడని... తన సోదరుడు అసలు భవన నిర్మాణ కార్మికుడు కానే కాడని.. ఆయన రైతు కూలీ అని సురేశ్ చెప్పుకొచ్చాడు. ఈ వ్యవహారం బయటపడడంతో మీడియా ద్వారా టీడీపీ నేతలు తమ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారంటూ వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.