Begin typing your search above and press return to search.

షాకింగ్: వైసీపీ ఎమ్మెల్సీ కారులో డెడ్ బాడీ.. అసలేమైంది?

By:  Tupaki Desk   |   20 May 2022 3:22 AM GMT
షాకింగ్: వైసీపీ ఎమ్మెల్సీ కారులో డెడ్ బాడీ.. అసలేమైంది?
X
షాకింగ్ ఉదంతం ఒకటి చోటు చేసుకుంది. ఏపీ అధికారపక్షం వైసీపీకి చెందిన ఎమ్మెల్సీ అనంతబాబు కారులో యువకుడి డెడ్ బాడీ ఉండటం.. దాన్ని నేరుగా ఆయన వారింటికి తీసుకురావటం ఇప్పుడు సంచలనంగా మారింది. అసలేం జరిగిందన్న దానిపై ఎమ్మెల్సీ వినిపిస్తున్న వాదనకు.. డెడ్ బాడీ ఉన్న తీరుకు ఏ మాత్రం పొంతన లేదన్న మాట వినిపిస్తోంది. రోడ్డు ప్రమాదంలో మరణించినట్లుగా చెబుతున్న యువకుడు.. అనంతబాబు వద్ద కారు డ్రైవర్ గా పని చేసినట్లు చెబుతున్నారు. నిజంగానే రోడ్డు ప్రమాదంలో మరణించి ఉంటే.. నేరుగా ఆసుపత్రికి తీసుకెళ్లటం.. ప్రొసీజర్ ప్రకారం చేపట్టాల్సిన చర్యల్ని వదిలేసి.. తన కారులో డెడ్ బాడీని తీసుకొని మృతుడి ఇంటికి నేరుగా తీసుకురావటంపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

కాకినాడ జిల్లా టూ టౌన్ పరిధిలోని వివేకానంద పార్క్ వీధిలో ఎమ్మెల్సీ అనంతబాబు కారులో యువకుడి (సుబ్రమణ్యం) మృతదేహం ఇప్పుడు కలకలాన్ని రేపుతోంది. అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లుగా భావిస్తున్న ఈ ఉదంతంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దాదాపు ఐదేళ్ల పాటు ఎమ్మెల్సీ బాబు వద్ద మృతుడు కారు డ్రైవర్ గా పని చేసినట్లు చెబుతున్నారు. బాధిత కుటుంబ సభ్యులు చెబుతున్న దాని ప్రకారం.. గురువారం రాత్రి పదిన్నర గంటలకు అనంతబాబు వచ్చిన ఆయన కారులోనే తమ కొడుకును ఇంటి నుంచి బయటకు తీసుకెళ్లారని చెబుతున్నారు.

అర్థరాత్రి ఒంటి గంట సమయంలో మీ అబ్బాయి టిఫిన్ కోసం బైక్ మీద వెళుతుంటే రోడ్డు ప్రమాదం జరిగి చనిపోయాడంటూ.. డెడ్ బాడీని ఇంటికే నేరుగా తన కారులో తీసుకొచ్చిన ఎమ్మెల్సీ తీరు విస్మయానికి గురి చేస్తోంది. డెడ్ బాడీని ఇంటి వద్ద వదిలి వెళ్లేందుకు అనంతబాబు ప్రయత్నించటం.. ఆ సందర్భంగా బాధిత కుటుంబం ఆయన్ను అడ్డుకోవటంతో.. కారులోనే డెడ్ బాడీని వదిలేసి.. పరారీ అయినట్లుగా మృతుడి కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

ఇదే ఉదంతానికి సంబంధించి మరో వాదన బలంగా వినిపిస్తోంది. గురువారం రాత్రి ఎమ్మెల్సీ అనంతబాబు అనుచరులు మృతుడి ఇంటికి వచ్చారని.. అతడ్ని తమతో తీసుకెళ్లినట్లు చెబుతున్నారు.గురువారం అనంతబాబు పుట్టిన రోజు కావటంతో.. ఆయన అనుచరులు పార్టీలో మునిగి తేలారని.. ఈ సందర్భంగా ఏదో తేడా వచ్చి అతడిపై దాడి జరిగినట్లుగా అబిప్రాయపడుతున్నారు. ఒకవేళ అలాంటిదే జరిగిందని భావించినా.. ప్రాణాలు వదిలిన ప్రాంతానికి చెందిన పోలీసులకు సమాచారం ఇవ్వాల్సిందిపోయి.. అదేమీ చేయకుండా డెడ్ బాడీని ఇంటికే నేరుగా తీసుకురావటం ఏమిటి? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

బాధితుడి కుటుంబ సభ్యుల ఆరోపణలకు సంబంధించి మరో అంశం కనిపిస్తోంది. మరణించిన యువకుడి కాళ్లు.. చేతులు విరిచి మట్టిలో దొర్లించి మరీ కొట్టి చంపినట్లుగా స్పష్టమవుతుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. తమ వాదనకు తోడుగా మృతుడి ఒంటి మీద దెబ్బల్ని చూపిస్తున్నారు. తమ కుమారుడ్ని ఎమ్మెల్సీ చంపేశారని.. తమకు న్యాయం చేయాలని.. బాధ్యుల్ని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

సాధారణంగా అనూహ్యంగా మరణం చోటు చేసుకున్నప్పుడు పోలీసులకు సమాచారం ఇవ్వటం.. ప్రొసీజర్ ను ఫాలో కావటం కనిపిస్తుంది. అందుకు భిన్నంగా అలాంటిదేమీ లేకుండా డెడ్ బాడీని అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్సీ తన కారులో మృతుడి ఇంటికి తీసుకొచ్చి వదిలేసి వెళ్లాలని భావించటంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఉదంతంపై మరింత క్లారిటీ రావాల్సిన అవసరం ఉందని చెప్పక తప్పదు.