Begin typing your search above and press return to search.

ఢిల్లీ అల్లర్ల విషాదం: మురికి కాలువల్లో మృతదేహాలు

By:  Tupaki Desk   |   2 March 2020 4:38 AM GMT
ఢిల్లీ అల్లర్ల విషాదం: మురికి కాలువల్లో మృతదేహాలు
X
అల్లర్లు సద్దుమణగడంతో ఢిల్లీలో దారుణాలు వెలుగుచూస్తున్నాయి. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా, అనుకూలంగా దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన హింసలో దాదాపు 45మందికి పైగా అసువులు బాసారు. ఇంకా చాలా మంది మిస్ అయ్యారు. వారంతా ఏమయ్యారు.? ఎక్కడున్నారనేది పోలీసులు వెతుకుతున్నారు.

అయితే అల్లర్లు సద్దుమణిగి ప్రజాజీవితం కుదటపడి ఎవరి ఇంటికి వారు వచ్చేశారు. ఈ నేపథ్యంలోనే దారుణాలు వెలుగుచూస్తున్నాయి. అల్లర్లలో చంపేసి మురికి కాలువల్లో శవాలను పడేసిన తీరు అందరినీ కంటతడిపెట్టిస్తోంది. ఈశాన్య ఢిల్లీలో అల్లర్లు జరిగిన ప్రాంతాల్లో మురుగు కాలువలు అల్లర్ల దారుణాలకు సాక్ష్యంగా నిలుస్తున్నాయి.

అల్లర్లలో చనిపోయిన వారి మృతదేహాలు మురుగు కాలువల్లో తేలుతుండడం చూసి స్థానికులు కంటతడి పెడుతున్నారు. అల్లరి మూకలు కొందరిని హత్య చేసి శవాలను నాలాలలో పడేశారని తెలుస్తోంది.

అంకిత్ శర్మ అనే ఐబీ ఆఫీసర్ ను ఏకంగా ఆరుగంటల పాటు శరీరంలోని అన్ని అవయవాలపై 400 కత్తిపోట్లు పొడిచి పేగులు బయటకు తీసి నరకం చూపించి చంపి చాంద్ బాగ్ మురికి కాలువలో పడేశారు. ఎంత దారుణంగా అల్లర్లు జరిగాయో ఊహించడానికే భయం వేస్తోంది. ఈ పరస్పర దాడుల్లో భారీగా ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లింది. ఇప్పటివరకే 45మంది చనిపోగా వందలాది మంది గల్లంతయ్యారు.

చాలా మంది మృతదేహాలు మురికికాలువల్లో దొరికాయి. ఇక తీవ్రగాయాలతో ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూ మరణిస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఘర్షణలు కాస్తా తగ్గుముఖం పట్టినా పరిస్థితి మాత్రం నివురుగప్పిన నిప్పులా ఉంది. పూర్తిగా అదుపులోకి రాలేదు.

ఈ అల్లర్లలో భారీగా ఆస్తులు ధ్వంసమయ్యాయి. 144 సెక్షన్ విధించారు. ఈ అల్లర్లకు బాధ్యులుగా 150మందిని అరెస్ట్ చేశారు. మరో 400మందిని అదుపులోకి తీసుకున్నారు.

కాగా అల్లర్లు జరిగిన సమయంలో అల్లరిమూకలు పెద్ద ఎత్తున ఆస్తులను, వస్తువులను, షాపుల్లో విలువైన సామగ్రిని తస్కరించారు. అంతేకాదు.. పెద్ద పెద్ద సంచులలో మనుషులను చంపి కుక్కి తీసుకెళ్లడం చూశామని తెలిపారు.