Begin typing your search above and press return to search.

మృతుల‌ లెక్క‌లు దాచ‌గ‌ల‌రు.. శ‌వాల‌ను దాచ‌గ‌ల‌రా?

By:  Tupaki Desk   |   12 May 2021 4:30 PM GMT
మృతుల‌ లెక్క‌లు దాచ‌గ‌ల‌రు.. శ‌వాల‌ను దాచ‌గ‌ల‌రా?
X
దేశంలో కొవిడ్ క‌ల్లోలం దారుణ ప‌రిస్థితుల‌ను సృష్టిస్తోంది. క‌నీసం ద‌హ‌న సంస్కారాల‌కు కూడా నోచుకోక గంగాన‌దిలో తేలియాడుతున్న మృత‌దేహాలు.. భీతావ‌హ దృశ్యాల‌ను క‌ళ్ల‌కు క‌డుతున్నాయి. న‌దిలో ప‌డేసిన శ‌వాలు.. తీరానికి కొట్టుకొచ్చిన దృశ్యాలు.. వైర‌ల్ అయిన సంగ‌తి తెలిసిందే. అయితే.. మ‌రిన్ని శవాలు బ‌య‌ట‌ప‌డిన‌ట్టు స‌మాచారం. ఈ దారుణ ప‌రిస్థితిపై బాలీవుడ్ ప్ర‌ముఖులు తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఈ ప‌రిస్థితి కార‌ణ‌మైన స‌ర్కారు చ‌ర్య‌ల‌ను సైతం నేరుగా దునుమాడారు.

ఈ విష‌య‌మై బాలీవుడ్ నటుడు.. ఫిల్మ్ మేక‌ర్‌ ఫర్హాన్ అక్తర్ సోష‌ల్ మీడియాలో ట్వీట్ చేశారు. ''మృత‌దేహాలను చూస్తే హృదయ విదారకంగా ఉంది. వైరస్ ఏదో ఒక రోజు ఓడిపోతుంది. కానీ.. వ్యవస్థలో ఈ వైఫల్యాలకు మాత్రం జవాబుదారీతనం ఉండాలి. అప్పటి వరకు ఈ మహమ్మారి అధ్యాయం ముగిసిన‌ట్టు కాదు.'' అని ఆగ్ర‌హం వ్య‌క్తంచేశారు.

ఇక బాలీవుడ్ నటి-చిత్రనిర్మాత పూజా భట్ కూడా తీవ్ర స్థాయిలో స్పందించారు. మృత‌దేహాలు న‌దిలో తేలియాడ‌డంపై క‌ల‌త చెందిన ఆమె స‌ర్కారు తీరుపై ఆగ్ర‌హం వ్య‌క్తంచేశారు. ''మీరు మృతుల సంఖ్య‌ను దాచ‌గ‌ల‌రు.. మృతదేహాలను దాచ‌గ‌ల‌రా? ఇది రాబోయే తరాల వరకు మనల్ని వెంటాడుతుంది'' అని ఘాటుగా స్పందించారు.

మరో బాలీవుడ్ నటుడు-హాస్యనటుడు జావేద్ జాఫేరి సైతం స్పందించారు ''ఇది విషాదకరమైనది మరియు భయంకరమైనది.''అని రాశారు. అంతకుముందు బాలీవుడ్ ప్రముఖులు ఊర్మిళ, శేఖర్ సుమన్ కూడా ఈ పరిస్థితిపై తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

కాగా.. సోమవారం బక్సర్ జిల్లాలోని గంగా ఒడ్డున కుళ్లిన దశలోని మృతదేహాలు సుమారు 45 లభించాయని ఉత్త‌ర ప్ర‌దేశ్ అధికారులు ప్ర‌క‌టించినట్టుగా వార్త‌లు వ‌స్తున్నాయి. బీహార్ లోని బక్సార్ తరువాత, ఉత్తర ప్రదేశ్ లోని ఘాజిపూర్ జిల్లా సమీపంలో గంగా ఒడ్డున రెండు డజన్ల మృతదేహాలను క‌నుగొన్నారు. వాటిలో కొన్ని పాక్షికంగా దహనం చేసిన‌ తరువాత నదిలో విసిరేసిన‌ట్టు స‌మాచారం.