Begin typing your search above and press return to search.

గంగానదిలో మృతదేహాలు పడేస్తే మీరేం చేస్తున్నారు?

By:  Tupaki Desk   |   14 May 2021 10:30 AM GMT
గంగానదిలో మృతదేహాలు పడేస్తే మీరేం చేస్తున్నారు?
X
ఇటీవల గంగానదిలోకి మృతదేహాలు కొట్టుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. దాదాపు 52 మృతదేహాలు గంగానదిలోకి కొట్టుకొని వచ్చాయి. ఆ మృతదేహాలు కోవిడ్​ బారిన పడి చనిపోయిన వారివన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. కరోనా మృతదేహాలను దహనం చేసేందుకు కూడా లక్షల రూపాయలు ఖర్చు అవుతున్నాయి. చాలా శ్మశానాల్లో అంత్యక్రియలు అనేది ఓ వ్యాపారంలా మారింది. కోవిడ్​ వచ్చింది మొదలు.. బాధితులను ఆస్పత్రులకు తీసుకెళ్లడం.. చికిత్స అందించడం.. చివరకు అంత్యక్రియలు చేయడం కూడా వ్యాపారంలా మారిపోయింది.

ఇదిలా ఉంటే ఇటీవల గంగానదిలోకి కరోనా మృతదేహాలు కొట్టుకురావడం చర్చనీయాంశం అయ్యింది. ఈ ఘటనపై తాజాగా కేంద్ర మానవహక్కుల కమిషన్​ సీరియస్​ అయ్యింది. బీహార్​, యూపీ ప్రభుత్వాలపై ఫైర్​ అయ్యింది. గంగానదిలోకి మృతదేహాలు కొట్టుకొచ్చిన ఘటనపై ఉత్తరప్రదేశ్, బిహార్ ప్రభుత్వాలతో పాటు కేంద్ర జల్ శక్తి మంత్రిత్వ శాఖకు కేంద్ర మానవహక్కల కమిషన్​ నోటీసులు జారీ చేసింది. ఈ విషయంపై నాలుగు వారాల్లోపు నివేదికను అందించాలని ఆదేశించింది.

గంగానదిలోకి మృతదేహాలు కొట్టుకురావడం అంటే ‘క్లీన్ గంగా ప్రాజెక్టు’ మార్గదర్శకాలను ఉల్లంఘించినట్లేనని మానవ హక్కుల కమిషన్ అభిప్రాయపడింది.ఉత్తరప్రదేశ్‌లోని బలియా జిల్లాలో దాదాపు 52 మృతదేహాలు గంగా నదిలో కొట్టుకొచ్చాయి. ఉజియార్, కల్హాదియా, బరౌలి ప్రాంతాల్లోని గంగా నది తీరాల్లోకి, బిహార్‌లోని చౌసా పట్టణంలో ఉన్న గంగా నది తీరానికి దాదాపు 71 మృతదేహాలు కొట్టుకొచ్చాయి. ఈ ఘటనకు సంబంధించి కొన్ని వీడియోలు కూడా బయటకు వచ్చాయి.

అయితే ఈ ఘటనపై పూర్తి నివేదిక అందించాలని కేంద్ర మానవహక్కుల కమిషన్​ పేర్కొన్నది. కొందరు అంబులెన్స్​ డ్రైవర్లు మృతదేహాలను గంగలో పడేస్తున్నట్టు వీడియోలు బయటకు వచ్చాయి.మరోవైపు ఇవన్నీ కరోనా డెడ్​బాడీలు అన్న ప్రచారం కూడా సాగింది. దీంతో కేంద్ర మానవహక్కుల కమిషన్​ స్పందించింది. ఈ ఘటనపై ఆయా ప్రభుత్వాలు ఎలా స్పందిస్తాయో? వేచి చూడాలి.