Begin typing your search above and press return to search.

బాలీవుడ్ నటిని దావూద్ పెళ్లి చేసుకున్నారా?

By:  Tupaki Desk   |   18 Nov 2015 10:22 AM IST
బాలీవుడ్ నటిని దావూద్ పెళ్లి చేసుకున్నారా?
X
అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం మరోసారి వార్తల్లోకి వచ్చారు. దావూద్ కు సంబంధించిన అత్యంత ఆసక్తికరమైన అంశాలను బయటపెడుతూ.. సీబీఐ మాజీ డిప్యూటీ డైరెక్టర్.. ఢిల్లీ మాజీ పోలీస్ కమిషనర్ నీరజ్ కుమార్ తాజాగా ఒక పుస్తకం రాశారు. దీన్ని ప్రముఖ ప్రచురణ సంస్థ పెంగ్విన్ విడుదల చేయనుంది. ‘‘మై కన్వర్జెషన్స్ విత్ దావూద్ ఇబ్రహీం’’ అన్న పేరు మీద రచించిన పుస్తకంలో.. ‘‘డయల్ డీ ఫర్ డాన్’’ అన్న అధ్యాయంలో పలు ఆసక్తికరమైన అంశాలు పేర్కొన్నట్లు చెబుతున్నారు.

ఈ పుస్తకంలో సంచలనం రేకెత్తించే అంశాలు చాలానే ఉన్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ నటిని మాఫియా డాన్ పెళ్లాడినట్లుగా చెబుతున్నారు. ఆ నటితో ఒక కుమారుడ్ని దావూద్ కన్నాడని చెబుతున్నారు. ప్రస్తుతం ఆ కుర్రాడ్ని బెంగళూరులో నటి సోదరి పెంచుతున్నట్లుగా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో దావూద్ రహస్యంగా పెళ్లాడిన ఆ బాలీవుడ్ నటి ఎవరన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

మరోవైపు.. దావూద్ తనతో మూడుసార్లు మాట్లాడినట్లుగా నీరజ్ కుమార్ ఈ పుస్తకంలో పేర్కొన్నట్లు సమాచారం. రిటైర్ మెంట్ కు ముందు కూడా తన ఫోన్ కు దావూద్ ఫోన్ చేసినట్లుగా ఆయన వెల్లడించారు. నీరజ్ ఫోన్ కు దావూద్ చేసిన ఫోన్ కాల్ గురించి ప్రస్తావిస్తూ.. తాను ఆ ఫోన్ కాల్ ను అస్సలు ఊహించలేదన్నారు. ఈ సందర్భంగా దావూద్ తనతో మాట్లాడిన మాటల్ని చెప్పుకొస్తూ.. ‘‘ఏంటి సార్ ఇది. మరికొన్ని రోజుల్లో రిటైర్ అవుతూ కూడా.. ఇంకా నన్ను వెంటాడమేనా? ఇప్పటికైనా నన్ను వెంటాడటం మానుకోవచ్చుగా’’ అని పేర్కొన్నట్లుగా చెబుతున్నారు.

దావూద్ తనకు చేసిన ఫోన్ నెంబరు.. అతగాడి వ్యక్తిగత నెంబరుగా ఆయన భావిస్తున్నట్లు చెబుతున్నారు. విడుదలకు ముందే పలు ఆసక్తికర అంశాలతో సంచలనం రేకెత్తిస్తోన్న ఈ పుస్తకం.. విడుదలయ్యాక మరిన్ని సంచలనాలు ఖాయమన్న మాట బలంగా వినిపిస్తోంది.