అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం మీద ఒక జాతీయ మీడియా ఛానల్ ప్రసారం చేసిన కథనం ఇప్పుడు సంచలనంగా మారింది. తీవ్ర అనారోగ్యంతో దావూద్ ఉన్నారని.. చావుబతుకుల మధ్య కొట్టు మిట్టాడుతున్నట్లుగా సదరు కథనం పేర్కొంది. అంతేకాదు.. అతని కాళ్లకు సోకిన వ్యాధితో రెండు కాళ్లను తీసేయనున్నట్లుగా కూడా కథనంలో పేర్కొన్నారు. కరాచీలోని లియాఖత్ జాతీయ ఆసుపత్రిలో దావూద్ కు సైనిక ఆసుపత్రి వైద్యులు చికిత్స అందిస్తున్నట్లు సదరు మీడియా ఛానల్ తన కథనంలో పేర్కొంది.
అయితే.. ఈ కథనాన్ని దావూద్ ప్రధాన అనుచరుడు చోటా షకీల్ తీవ్రంగా ఖండిస్తున్నాడు. తాజాగా ప్రసారమైన కథనంలోని అంశాలన్నీ కట్టుకథలుగా తేల్చేసిన చోటా.. దావూద్ పూర్తి ఆరోగ్యంతో.. ఫిట్ గా ఉన్నట్లుగా తేల్చాడు. మీడియా సంస్థల దగ్గరున్న సమాచారం తప్పుడు సమాచారంగా పేర్కొన్నాడు. ఒకవేళ ఫిట్ గా ఉంటే.. ఏదో ఒక రహస్య వీడియోను విడుదల చేయొచ్చుగా?