Begin typing your search above and press return to search.

దావూద్ అడ్ర‌స్ దొరికింది

By:  Tupaki Desk   |   22 Aug 2015 6:19 AM GMT
దావూద్ అడ్ర‌స్ దొరికింది
X
ముంబైలో 1993లో జ‌రిగిన వ‌రుస బాంబు పేళుళ్ల కేసులో ప్ర‌ముఖ సూత్ర‌ధారి అయిన దావూద్ షేక్ ఇబ్ర‌హీం ఎక్క‌డ ఉన్న‌ది భార‌త నిఘా అధికారులు బ‌ట్ట‌బ‌య‌లు చేశారు. దావూద్ పాకిస్తాన్ క‌రాచీలోని క్లిఫ్టార్ రోడ్డులో ఉంటున్న‌ట్టు నిఘా వ‌ర్గాలు గుట్టు ర‌ట్టు చేశాయి.

దావూద్ భార్య మెహ్జాబీన్ పేరు మీద ఉన్న 2015 ఏప్రిల్ నెల టెలీఫోన్ బిల్లు ద్వారా దావూద్‌ అడ్ర‌స్‌, టెలీఫోన్ నెంబ‌ర్‌ ను కూడా వీరు స్వాధీనం చేసుకున్న‌ట్టు స‌మాచారం.

దీంతో దావూద్ ఇప్ప‌టివ‌ర‌కు పాకిస్తాన్‌ లో లేడ‌ని బుకాయిస్తూ చెపుతున్న పాకిస్తాన్ అబద్ధం ఆడుతోంద‌ని కూడా వెల్ల‌డైంది. 1993 ముంబై బాంబు పేళుళ్ల త‌ర్వాత దావూద్ పాకిస్తాన్‌ కు పారిపోయాడు. అప్ప‌టి నుంచి పాక్‌ లోనే దావూద్ మాకాం ఉంటున్నాడు. 1996లో పాక్ దావూద్‌ కు పాస్‌ పోర్ట్ కూడా మంజూరు చేసింది. దావూద్‌ కు ఉన్న ముగ్గురు కూతుళ్ల‌లో ఒక కుమార్తెను పాక్ క్రికెట్ జ‌ట్టు మాజీ కెప్టెన్ జావెద్ మియాందాద్ కుమారుడు జునాయిద్‌ కు ఇచ్చి వివాహం చేశాడు. దావూద్‌ కు ఒక కుమారుడు కూడా ఉన్నాడు.

భార‌త ఇంటిలిజెన్స్ వ‌ర్గాలు సంపాదించిన స‌మాచారం ప్ర‌కారం దావూద్ ‘డి-13, బ్లాక్-4, కరాచీ డెవలెప్‌ మెంట్ అథారిటీ, ఎస్‌ సీహెచ్-5, క్లిఫ్టన్’ అన్న చిరునామాలో ఉంటున్నట్టు తెలిసింది. దావూద్‌కు ఉన్న మూడు పాస్ పోర్టుల్లో ఒక‌టి షేక్ దావూద్ హ‌స‌న్ పేరిట ఉంది. ఈ పాస్ పోర్టుల‌ను ఉప‌యోగించుకుని దావూద్ త‌ర‌చు దుబాయ్‌-పాక్ మ‌ధ్య ప్ర‌యాణాలు చేస్తుంటాడ‌ని కూడా నిఘావ‌ర్గాల‌కు స‌మాచారం అందింది.

తాజాగా దావూద్ ఫొటో చూస్తుంటే అది దావూద్ ప్లాస్టిక్ స‌ర్జ‌రీ చేయించుకున్న త‌ర్వాత తీసిన ఫొటోగా క‌నిపిస్తోంది. దావూద్ పాక్‌ లోనే ఉన్నాడ‌న్న వార్త‌ల‌పై అమెరికా తీగ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. పాక్ ఉగ్ర‌వాదాన్ని ప్రోత్స‌హించే చ‌ర్చ‌ల‌ను మానుకోవాల‌ని హెచ్చ‌రిక‌లు జారీ చేసింది. ఇప్ప‌టికైనా పాక్ దావూద్‌ ను ఇండియాకు తీసుకొచ్చేందుకు స‌హ‌క‌రిస్తుందో లేదా త‌న వ‌క్ర‌బుద్ధిని కంటిన్యూ చేస్తుందో చూడాలి.