Begin typing your search above and press return to search.

మాతో ఖ‌ర్చు పెట్టించి..వేరే వారికి టికెట్లు ఇస్తారా?

By:  Tupaki Desk   |   18 March 2019 7:17 AM GMT
మాతో ఖ‌ర్చు పెట్టించి..వేరే వారికి టికెట్లు ఇస్తారా?
X
ఈసారి ఎన్నిక‌ల్లో సీటు మీకే.. పార్టీ సంగ‌తి మీరు చూసుకోండి. మీ సంగ‌తి మేం చూసుకుంటామంటూ సుద్దులు చెప్పి.. తీరా టికెట్లు ఇచ్చేనాటికి షాకులు ఇస్తారా? అంటూ మండిప‌డుతున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ నేత‌లు. గోదావ‌రి జిల్లాల‌కు సంబంధించి ప‌లువురు వైఎస్సార్ కాంగ్రెస్ నేత‌లు త‌మ‌కు టికెట్లు రాక‌పోవ‌టంపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

ఆదివారం ఉద‌యం ఒకేసారి 175 మంది అభ్య‌ర్థుల జాబితాను విడుద‌ల చేసిన పార్టీ.. ప‌లువురు ఆశావాహుల‌కు షాకుల మీద షాకులు ఇచ్చింది. టికెట్లు ఇస్తామ‌ని చెప్పి విప‌రీతంగా డ‌బ్బు ఖ‌ర్చు పెట్టించార‌ని.. ఇప్పుడేమో.. హెలికాఫ్ట‌ర్ నేత‌ల‌కు పార్టీ టికెట్లు ఇవ్వ‌టంపై వారు క‌త్తులు నూరుతున్నారు. ఇన్నాళ్లు నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీని బ‌తికించిన త‌మ‌ను వ‌దిలేసి.. ఇప్పుడు వ‌చ్చిన నేత‌ల‌కు టికెట్లు ఇస్తారా? అంటూ మండిప‌డుతున్నారు.

రానున్న ఎన్నిక‌ల్లో టికెట్లు ఇచ్చేది నియోజ‌క‌వ‌ర్గ కో-ఆర్డినేట‌ర్ల‌కే నంటూ ఆశ‌లు క‌ల్పించిన పార్టీ ఇప్పుడేమో ఆ విష‌యాన్ని వ‌దిలేసి..కొత్త‌గా పార్టీలో చేరిన వారికి టికెట్ల‌ను క‌న్ఫ‌ర్మ్ చేసిన తీరుపై ప‌లువురు నేత‌లు ఆగ్ర‌హంతో ఉన్నారు. పెద్దాపురం టికెట్ త‌న‌కు ఇస్తాన‌ని చెప్పి కోఆర్డినేట‌ర్ ప‌ద‌వి ఇచ్చార‌ని.. తీరా ఇప్పుడేమో రీసెంట్ గా పార్టీలో చేరిన తోట వాణికి క‌న్ఫ‌ర్మ్ చేశారంటూ ద‌వులూరు దొర‌బాబు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

త‌మ స‌త్తా ఏమిట‌న్న‌ది రానున్న ఎన్నిక‌ల్లో చూపిస్తామ‌ని చెబుతున్నారు. ఇలాంటి ప‌రిస్థితి ఒక్క దొర‌బాబుకు మాత్ర‌మే ప‌రిమితం కాలేదు. ఇదే రీతిలో సామ‌ర్ల‌కోట‌లోనూ ఇలాంటి ప‌రిస్థితే ఉంది. పెద్దాపురం అసెంబ్లీ కుద‌ర‌క‌పోతే కాకినాడ ఎంపీ టికెట్ ఇస్తామ‌ని చెప్పి..ఆ విష‌యంలోనూ హ్యాండిచ్చార‌ని వాపోతున్నారు దొర‌బాబు.

ఇక‌.. కాకినాడ ఎంపీ టికెట్ కోసం బంగారం లాంటి ఉద్యోగానికి వాలంట‌రీ రిటైర్మెంట్ ఇచ్చి మ‌రీ వ‌స్తే.. అందుకు భిన్నంగా రెండు రోజుల క్రితం పార్టీలో చేరిన మాజీ ఎమ్మెల్యే వంగా గీత‌కు ఎంపీ టికెట్ ను క‌న్ఫ‌ర్మ్ చేయ‌టం ఏమిటంటూ అశోక్ అనే వైఎస్సార్ కాంగ్రెస్ నేత తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్నారు. త‌మ‌ను తిప్ప‌లు పెట్టిన పార్టీకి త‌మ స‌త్తా ఏమిటో తెలిసేలా చేస్తామ‌ని కారాలు మిరియాలు నూరుతున్నారు. మండ‌పేట అసెంబ్లీ టికెట్ విష‌యంలోనూఇలాంటి ప‌రిస్థితే చోటు చేసుకుంద‌ని టికెట్ పై గ‌తంలో హామీ పొందిన పితాని అన్న‌వ‌రం వాపోతున్నారు. మ‌రి.. ఇలాంటి అసంతృప్తిదారుల్ని జ‌గ‌న్ ఎలా ఓదారుస్తారో చూడాలి.