Begin typing your search above and press return to search.

వార్నర్ కూడా ఏడ్చేశాడు..

By:  Tupaki Desk   |   31 March 2018 6:42 AM GMT
వార్నర్ కూడా ఏడ్చేశాడు..
X
బాల్ టాంపరింగ్ వివాదం ఆస్ట్రేలియా క్రికెట్‌ను మామూలుగా ప్రభావితం చేయలేదు. ఈ దెబ్బకు ఆస్ట్రేలియా క్రికెట్ పరువు మొత్తం గంగలో కలిసిపోయింది. ఈ ఘటనపై ఆ దేశంలో ప్రజల నుంచి తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. దీంతో మామూలుగా బాల్ టాంపరింగ్ చేస్తే ఒక్క మ్యాచే నిషేధం పడుతుంది కానీ.. క్రికెట్ ఆస్ట్రేలియా మాత్రం టాంపరింగ్‌కు బాధ్యులైన స్టీవెన్ స్మిత్.. డేవిడ్ వార్నర్‌ లపై ఏడాది.. టాంపరింగ్ చేసిన బాన్‌క్రాఫ్ట్‌పై 9 నెలలు నిషేధం విధించింది.

ఈ ఉదంతంతో తమ జీవితాలే తల్లకిందులైపోవడంతో ఆ ముగ్గురూ తీవ్రంగా కుమిలిపోతున్నారు. ఇప్పటికే స్టీవెన్ స్మిత్.. బాన్ క్రాఫ్ట్ మీడియా ముందుకొచ్చి కన్నీటి పర్యంతం అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వార్నర్ కుడా మీడియాను కలిశాడు. మాట్లాడుతున్నపుడు ఉద్వేగాన్ని ఆపుకోలేక కన్నీళ్లు పెట్టుకున్నాడు. తాను చేసింది చాలా పెద్ద తప్పని ఇప్పుడే తెలుస్తోందని.. ప్రజల నుంచి ఈ స్థాయిలో ఆగ్రహం ఉంటుందని తాను ఊహించలేదని వార్నర్ చెప్పాడు.

అందరూ తలదించుకునేలా ప్రవర్తించానని.. ఈ పరిస్థితి నుంచి కుదురుకోవడానికి తనకు కొంత సమయం కావాలని వార్నర్ అన్నాడు. తాను మళ్లీ జీవితంలో ఆస్ట్రేలియా తరఫున క్రికెట్ ఆడలేకపోవచ్చేమో అని వార్నర్ ఆవేదన వ్యక్తం చేయడం గమనార్హం. క్రికెట్ ఆస్ట్రేలియా విధించిన నిషేధంపై సవాలు చేస్తారా అని అడిగితే.. ఇప్పుడేమీ చెప్పలేనని.. తన కుటుంబ సభ్యులు.. శ్రేయోభిలాషులతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని వార్నర్ అన్నాడు.

వీడియో కోసం క్లిక్ చేయండి