Begin typing your search above and press return to search.

పాక్ ‘పాపం’ పండనుందా?

By:  Tupaki Desk   |   11 Dec 2015 4:34 AM GMT
పాక్ ‘పాపం’ పండనుందా?
X
అంతర్జాతీయ తీవ్రవాది.. పాకిస్థానీ అమెరికన్ అయిన డేవిడ్ హెడ్లీ అప్రూవర్ గా మారిపోయారు. ఇంతకీ ఈ హెఢ్లీ ఎవరంటారా? వందలాది మంది ఉసురు తీసిన ముంబయి పేలుళ్లతో సంబంధం ఉన్న వారిలో డేవిడ్ హెడ్లీ ఒకరు. అతగాడు తాజాగా అప్రూవర్ గా మారిపోయేందుకు తన సంసిద్ధత వ్యక్తం చేశారు. తీవ్రవాద కార్యకలాపాలతో అమెరికాలోని జైలులో 35 ఏళ్ల శిక్ష అనుభవిస్తున్న అతను.. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముంబయి టాడా కోర్టు అతన్ని విచారించింది. ఈ సందర్భంగా తనకు క్షమాభిక్ష ప్రసాదిస్తానంటే తాను అప్రూవర్ గా మారిపోవటానికి సిద్ధమేనని హెడ్లీ పేర్కొన్నారు.

దీనికి ప్రభుత్వం తరఫు న్యాయవాది సమ్మతి తెలపటంతో హెడ్లీ నోరు విప్పటం ఖాయమైనట్లే. హెడ్లీ అప్రూవర్ గా మారి.. నోరు విప్పితే కలిగే ప్రయోజం ఏమిటన్న సందేహం కలగొచ్చు. కానీ.. భారత్ వరకూ హెడ్లీ అప్రూవర్ గా మారటం వల్ల ప్రయోజనం ఎంతో. ఉగ్రవాదాన్ని పెంచి పోషించే పాక్ దుష్ట పన్నాగాల్ని హెడ్లీ నోటి గుండానే చెప్పించ్చు. పాక్ సర్కారు అండదండలతో నడిచే ఆ దేశ సీక్రెట్ సర్వీసు అయిన ఐఎస్ఐతో హెడ్లీకి భారీగానే సంబంధాలు ఉన్నాయి.

ఈ నేపథ్యంలో హెడ్లీ అప్రూవర్ గా మారటంతో ముంబయి దాడికి సంబంధించిన కుట్ర వ్యవహారం మొత్తం బయటకు రానుంది. ఎవరెవరు ఈ వ్యవహారంలో భాగస్వామ్యమైన విషయం బయటకు వస్తుంది. అదే జరిగితే పాక్ దుర్మార్గం ప్రపంచం మొత్తానికి తెలిసే వీలుంది. సరిహద్దుల్లో పొగబెడుతూ.. ఉగ్రవాదం మీద నంగనాచి మాటలు చెప్పే పాక్ మాటలకు.. చేసే పాపాలకు సంబంధం లేదన్న విషయం హెడ్లీ నోట వెంట రావటం ఖాయమంటున్నారు. హెడ్లీ అప్రూవర్ గా మారటం ముంబయి దాడి కేసులో ఒక కీలకమలుపుగా చెప్పొచ్చు.