Begin typing your search above and press return to search.

నాడు సోనియమ్మ మీద కేసులు పెట్టలేదే?

By:  Tupaki Desk   |   20 Jan 2016 10:48 AM IST
నాడు సోనియమ్మ మీద కేసులు పెట్టలేదే?
X
యాకూబ్ మెమన్ లాంటి ఉగ్రవాది కార్యకలాపాలకు పాల్పడి.. వివిధ కోర్టుల్లో అతను చేసిన నేరం రుజువయ్యాక ఉరి తీస్తే అతనికి మద్దుతుగా ర్యాలీ చేసే వారిని ఏమనాలి? దాన్ని వ్యతిరేకించిన వ్యక్తిపై తెల్లవారుజామున 30 మంది కలిసి వెళ్లి మూకుమ్మడిగా దాడి చేస్తే ఏమనాలి? అలాంటి వ్యక్తి ఆత్మహత్య చేసుకుంటే.. దానికి కారణంగా కేంద్రమంత్రులు రాజీనామా చేయాలా? వారిపై కేసులు పెట్టాలా? ఇలా ప్రశ్నలు వేసుకుంటూ వెళితే.. నోటి వెంట మాట రాకుండా పోతుంది.

జాతి వ్యతిరేక కార్యకలాపాలకు (ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొని అమాయకుల ప్రాణాలు తీసిన వ్యక్తిని జాతి వ్యతిరేకి అని అనుకుండా ఉండగలమా?) పాల్పడిన విద్యార్థులపై విచారణ జరిపి.. చర్యలు తీసుకోవాలని కోరటం తప్పు అవుతుందా? అందుకు కేంద్రమంత్రుల మీద కేసులు పెట్టి.. వారిని పదవుల నుంచి తొలగించాలని డిమాండ్ చేయటం ఏమిటి? ఇలాంటివన్నీ కాంగ్రెస్ పార్టీ లాంటి పార్టీ డిమాండ్ చేయటం ఏమిటి? ఈ ఉదంతాన్ని కాసేపు పక్కన పెట్టి మరో విషయంలోకి వెళదాం.

2004 సార్వత్రిక ఎన్నికల సమయంలో తెలంగాణ ప్రాంతాన్ని ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటిస్తామంటూ సోనియమ్మ అండ్ కో స్వయంగా ఎన్నికల ప్రచార సభల్లో మాట ఇచ్చారు. ఎన్నికల్లో విజయం సాధించిన కేంద్రంలో సర్కారు ఏర్పాటు చేసిన సోనియా.. ఐదేళ్ల తమ పదవీ కాలంలో తెలంగాణ రాష్ట్రంగా ఏర్పాటు చేయలేదు. 2009 ఎన్నికల్లోనూ ఆశలు చూపించిన వారు.. ఆ తర్వాత కూడా తామిచ్చిన హామీని పట్టించుకోలేదు.

దాదాపు వెయ్యికి పైగా తెలంగాణ యువత ఆత్మహత్యలకు పాల్పడటం.. ఉద్యమం మరింత వేడెక్కటంతో తెలంగాణ రాష్ట్రం ఇవ్వక తప్పింది కాదు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఉద్యమ సమయంలో వందలాది మంది విద్యార్థులు.. యువకులు తెలంగాణ కోసం ఆత్మహత్య చేసుకున్నారు. మరి.. వారి ఆత్మహత్యలకు కారణం సోనియా అండ్ కో అంటూ లేఖలు కూడా రాశారు.

గతాన్ని కాసేపు పక్కన పెట్టి.. వర్తమానంలోకి వద్దాం. తాజాగా రోహిత్ ఆత్మహత్యకు సంబంధించి కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ మీద కేసు పెట్టారు. మరి.. అంతమంది తెలంగాణ యువత ఆత్మహత్య చేసుకోవటానికి కారణమైన సోనియమ్మ మీద ఒక్క కేసంటే ఒక్క కేసు ఎందుకు నమోదు చేయలేదు? అంటే.. సోనియమ్మ విషయంలో ఒకలా? కేంద్రమంత్రి దత్తాత్రేయ విషయంలో మరోలా వ్యవహరించటం ఎంతవరకూ సబబు?