Begin typing your search above and press return to search.

తుంగభద్ర పుష్కరాలకు డేట్ ఫిక్స్.. నో స్నానాలు

By:  Tupaki Desk   |   18 Nov 2020 5:04 AM GMT
తుంగభద్ర పుష్కరాలకు డేట్ ఫిక్స్.. నో స్నానాలు
X
రెండు తెలుగు రాష్ట్రాల్లో అతి తక్కువ పరీవాహక ప్రాంతం ఉన్న తుంగభద్రకు పుష్కరాలు వచ్చేస్తున్నాయి. దీనికి సంబంధించిన ముహుర్తాన్నితాజాగా డిసైడ్ చేశారు. ఏపీలో కర్నూలు జిల్లాలో.. తెలంగాణలో మహబూబ్ నగర్ జిల్లాలో ఉండే తుంగభద్ర పుష్కరాలను గతానికి భిన్నంగా నిర్వహించనున్నారు. కరోనా నేపథ్యంలో మిగిలిన పుష్కరాల మాదిరి కాకుండా.. భిన్నమైన పద్దతుల్లో నిర్వహించాలని ఏపీ సర్కారు నిర్ణయించింది.

ఈ పుష్కరాల ముహుర్తాన్ని ఏపీ ప్రభుత్వం దాదాపుగా డిసైడ్ చేసినట్లే. ఎందుకీ మాట అంటే.. ఫలానా ముహుర్తంలో తుంగభద్ర పుష్కరాల్ని షురూ చేయాలని నిర్ణయించారు కానీ అధికారికంగా మాత్రం వెల్లడించలేదు. ఇక.. ముహుర్తం విషయానికి వస్తే.. ఈ నెల 20 నుంచి డిసెంబరు ఒకటో తేదీ వరకు పుష్కరాల్ని నిర్వహించనున్నారు. అంటే.. మరో రెండు రోజుల్లో పుష్కరాలు మొదలుకానున్నాయి. 20న మధ్యాహ్నం 1.21 గంటలకు పుష్కరాల ప్రారంభ ముహుర్తంగా నిర్ణయించారు.

పన్నెండేళ్ల క్రితం అంటే.. 2008లో తుంగభద్ర పుష్కరాలు జరిగాయి. అప్పట్లో ఉమ్మడి ఏపీలో వీటిని నిర్వహించారు. ఈ సారి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు వేర్వేరుగా నిర్వహించనున్నాయి. పుష్కరాలు అన్నంతనే పుష్కర స్నానం ఒకటైతే.. పితృ దేవతలకు పిండ ప్రదానం అన్నది మరో కీలకమైన అంశంగా చెబుతారు. కరోనా నేపథ్యంలో ఈసారి పుష్కర స్నానాల మీద ఆంక్షలు విధించారు. ఎట్టిపరిస్థితుల్లోనూ నదిలోకి స్నానానికి వెళ్లేందుకు అనుమతించరు.

అందుకు బదులుగా షవర్ స్నానాలకు ఓకే చెప్పనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లనుఏపీ సర్కారు పూర్తి చేసింది. కర్నూలు జిల్లాలో 23 పుష్కర ఘాట్లను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఈ పుష్కరాలకు ముఖ్యమంత్రి జగన్ హాజరు కానున్నారు. 20న కర్నూలు జిల్లాలోని సంకల్ బాగ్ పుష్కర ఘాట్ వద్ద జరిగే కార్యక్రమానికి ముఖ్య అతిధిగా జగన్ పాల్గొననున్నారు.