Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ సాక్షిగా కాంగ్రెస్ నేతకు సత్కారం

By:  Tupaki Desk   |   20 Nov 2018 5:49 PM GMT
ఎన్టీఆర్ సాక్షిగా కాంగ్రెస్ నేతకు సత్కారం
X
రాహుల్ గాంధీకి చంద్రబాబు షేక్ హ్యాండిచ్చినప్పటి నుంచి తెలుగుదేశం వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ ఎప్పటికప్పుడు కళ్లు మూసుకుని బాధను భరించాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయట. తాజాగా ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌ లో ఈ రోజు కాంగ్రెస్ నేత ఒకరికి సత్కారం జరగడం మరింత చర్చనీయమవుతోంది.

మామూలుగా అయితే ఎన్టీయార్ ట్రస్టు భవన్ లో కాంగ్రెస్ నేతలు అడుగుపెట్టే అవకాశాలు తక్కువ. కానీ... చంద్రబాబు పుణ్యమా అని ఎన్టీయార్ ట్రస్టు భవన్ కాంగ్రెస్ నేతలకూ ఇప్పుడు కేంద్ర స్థానంగా మారిపోయింది. తాజాగా ఖైరతాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ శ్రవణ్ దాసోజు ఎన్టీయార్ ట్రస్టు భవన్ కువచ్చారు. ఖైరతాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి గా నామినేషన్ వేశాక డాక్టర్ శ్రవణ్ దాసోజు అక్కడికి వెళ్లి టీడీపీ నేతలతో సమావేశమయ్యారు.

ప్రధానంగా టీడీపీ తిరుగుబాటు అభ్యర్థి బీఎన్ రెడ్డితో చర్చలు జరిపి ఆయన్ను పోటీ నుంచి వైదొలగేలా చేసుకున్నారు. ఎన్టీయార్ ట్రస్ట్ భవన్ లో టీటిడిపి అధ్యక్షులు ఎల్ రమణ అధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో శ్రవణ్ కు మద్దతుగా తన నామినేషన్ ఉపసంహరించుకున్నట్లు బీఎన్ రెడ్డి ప్రకటించారు. అంతేకాదు, ఆయన శ్రవణ్ గెలుపుకోసం క్యాంపెయిన్ కూడా మొదలుపెడుతున్నారు. మహాకూటమి తరుఫున బరిలో నిలిచిన డాక్టర్ శ్రవణ్ దాసోజు కు టీడిపి కార్యకర్తలు కృషిచేయాలని బీఎన్ రెడ్డి టీడిపి శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా శ్రవణ్ ను టీడీపీ నేతలు శాలువా కప్పి సన్మానించారు.