Begin typing your search above and press return to search.

కేసీఆర్ కొత్త చ‌ట్టం..నియంతృత్వ‌మేనట‌!

By:  Tupaki Desk   |   27 Jan 2018 12:01 PM GMT
కేసీఆర్ కొత్త చ‌ట్టం..నియంతృత్వ‌మేనట‌!
X
టీఆర్ఎస్ అధినేత‌ - తెలంగాణ సీఎం క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర‌రావు తాను అనుకున్న‌ది అమ‌లు చేసి తీర‌తార‌న‌డంలో ఎలాంటి సందేహం లేద‌నే చెప్పాలి. తన ఉద్య‌మం ద్వారా సాధించిన తెలంగాణ‌కు తొలి సీఎంగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌ర్వాత గ‌డ‌చిన నాలుగేళ్లుగా కేసీఆర్ తీసుకుంటున్న చ‌ర్య‌లే ఇందుకు నిద‌ర్శ‌నంగా చెప్పుకోవాలి. తాజాగా నిన్న సోష‌ల్ మీడియాలో వినిపిస్తున్న ప‌రుష ప‌ద‌జాలాన్ని, దూష‌ణ‌ల‌ను నియంత్రించేందుకు అంటూ కేసీఆర్ స‌ర్కారు ఓ కొత్త చ‌ట్టాన్ని తీసుకొచ్చేందుకు సిద్ధ‌ప‌డింది. ఆ కొత్త చ‌ట్టానికి సంబంధించిన ఫైల్‌ పై కేసీఆర్ సంత‌కం కూడా చేసేశారు. అంటే ఆ డ్రాఫ్ట్‌ ను చ‌ట్టంగా మార్చ‌డంలో ఎన్ని అడ్డంకులు వ‌చ్చినా వేస్టేన‌న్న మాట వినిపిస్తోంది.

కేసీఆర్ వ్య‌వ‌హార స‌ర‌ళి చూసిన ఏ ఒక్క‌రైనా... ఇది చ‌ట్టంగా అమ‌ల్లోకి రావ‌డం ఖాయ‌మేన‌ని ఫిక్స‌యిపోయారు. కేసీఆర్‌ ను ఆప‌డం వీలు కాద‌న్న భావ‌న‌తో అన్ని రాజ‌కీయ పార్టీలు త‌మ‌దైన రీతిలో నిర‌స‌న‌లు వ్య‌క్తం చేయ‌డం మిన‌హా... ఏమీ చేయ‌లేని స్థితిలో ప‌డిపోయాయి. అయితే నోరు మెద‌ప‌కుండా ఆయా పార్టీల నేత‌లు కూర్చోలేరు క‌దా. అందుకే నేటి ఉద‌యం మీడియా ముందుకు వ‌చ్చేసి కాంగ్రెస్ పార్టీ నేత - ఆ పార్టీ అధికార ప్ర‌తినిధి దాసోజు శ్రవ‌ణ్ కుమార్... కేసీఆర్ కొత్త చ‌ట్టంపై త‌న‌దైన శైలిలో నిర‌స‌న గ‌ళం విప్పారు. ఈ క్ర‌మంలో కేసీఆర్ పాల‌న‌ను తుగ్ల‌క్ పాల‌న‌తో పోల్చిన శ్రావ‌ణ్‌... కేసీఆర్ చ‌ర్య‌లు నియంతృత్వానికి నిద‌ర్శ‌నాల‌ని విరుచుకుప‌డ్డారు.

ఈ సందర్భంగా కేసీఆర్‌ పై శ్రావ‌ణ్ కుమార్ ఏ రేంజిలో విరుచుకుప‌డ్డార‌న్న విష‌యానికి వ‌స్తే..* ఐపీసీ సెక్షన్లు 506 - 507ల‌ను క్రిమినల్ - నాన్ బెయిలబుల్ కేసులుగా మార్పు చెయ్యడం నియంతృత్వ చర్యే. సోషల్‌ మీడియాను నియంత్రించాలనుకోవడం కేసీఆర్ తుగ్లక్ చర్య - దూరహంకారానికి నిదర్శనం. శాశ్వత వ్యవస్థలను చెడగొట్టే హక్కు తోటమాలిగా ఉండే సీఎంకు లేదు. ఈ విషయంలో కేసీఆర్‌ కు మరోసారి న్యాయవ్యవస్థ నుంచి మొట్టికాయలు తప్పవు. సామాజిక మాధ్యమాల ద్వారానే నిర్భయ చట్టం వచ్చింది, తెలంగాణ ఉద్యమానికి అండ దండ లభించింది. మీడియాను బెదిరించి ప్రభుత్వ వ్యతిరేక వార్తలను నిలవరించినట్టే.. సామాజిక మాధ్యమాల మీద సీఎం పడ్డారు. నాడు ఉద్యమంలో సోషల్‌ మీడియా పాత్ర భేష్ అని పేర్కొన్న సీఎం.. ఇప్పుడు దాన్నే నియంత్రించాలనుకోవడం దారుణం. ధర్నా చౌక్ ఉండొద్దు.. నిరసన హక్కు ఉండొద్దు అంటున్నారు. ఇక్కడ అంబేద్కర్ రాజ్యాంగం ఉందా, లేక కల్వకుంట్ల రాజ్యాంగం ఉందా? ఈ ప్రభుత్వ దుర్మార్గాలను ఎండగడుతాం. తెలంగాణను పోలీస్ రాజ్యం​గా మారుస్తారా? మీరు మాట్లాడిన భాష ఎలా ఉంది? దానికి సమాధానం ఏమిటి?, మీ ఎమ్మెల్యేలు బెదిరింపుల మాట ఏమిటి? మీ మీద ఎన్నిసార్లు ఎన్ని కేసులు పెట్టాలి? ఆర్టీసీ ఉద్యోగి సంజీవ్ ఏం తప్పు చేశాడని తొలగించారు. ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలను అడగటం తప్పా* అని దాసోజు శ్రవణ్‌ ప్రశ్నించారు.